- నిమిషానికి రూ.20.20 లక్షల అప్పు
- నాలుగు నెలల్లో రూ.34,900 కోట్ల రుణం
- రూ.4 లక్షల కోట్లకు పైగా అప్పులు
- రూ.లక్ష కోట్ల బకాయిలు పేరుకుపోయాయి
- ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు
- ఉద్యోగుల బకాయిలపై నిర్లక్ష్యం
- మూసీ పేరుతో వేల కోట్ల ఖర్చు
- కాంట్రాక్టర్లకు పెద్దపీట
- ప్రభుత్వ ప్రాధాన్యాలపై ప్రశ్నలు
- ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి
హైదరాబాద్, వెలుతురు, ఆగష్టు 12:
తెలంగాణ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తూ ప్రజలకు చెల్లించాల్సిన బకాయిలను మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. గత నాలుగు నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వం రూ.34,900 కోట్ల అప్పు చేసిందని, అంటే నిమిషానికి రూ.20.20 లక్షల చొప్పున రుణం తీసుకుంటోందని ఆరోపించారు.
ఇప్పటివరకు ప్రభుత్వం రూ.4 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసినప్పటికీ ఆ నిధులను ఎక్కడ ఖర్చు చేశారో ప్రజలకు వివరించాలని ఏలేటి డిమాండ్ చేశారు. వివిధ వర్గాలకు చెల్లించాల్సిన దాదాపు రూ.లక్ష కోట్ల బకాయిలు పేరుకుపోయాయని ఆరోపించారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్, సింగరేణి, ఆర్టీసీ బకాయిలతో పాటు ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన మొత్తాలను ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిందని విమర్శించారు. 30 నుంచి 40 ఏళ్లపాటు ప్రభుత్వానికి సేవలందించిన రిటైర్డ్ ఉద్యోగులు తమ పెన్షన్, ఇతర ప్రయోజనాల కోసం కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ప్రజల అవసరాలకు నిధులు లేవని చెబుతున్న ప్రభుత్వం మరోవైపు మూసీ, ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని ఏలేటి ఆరోపించారు.
కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూర్చేందుకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు. గ్రామాలు, పట్టణాల్లో రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి ప్రాథమిక సమస్యలు పరిష్కారం కాకుండానే భారీ ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టి పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజల అవసరాలకు నిధులు కేటాయించకుండా కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయలు ఎలా కేటాయిస్తారని నిలదీశారు.
రాష్ట్రంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉందని ఏలేటి మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వం చేసిన అప్పులు, పెండింగ్ బకాయిలు, భారీ ప్రాజెక్టుల వ్యయంపై సమగ్ర లెక్కలను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. అవినీతి, కాంట్రాక్టర్ల బిల్లులు, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలపై ఏసీబీ, లోకాయుక్తతో విచారణ జరిపించాలని కోరారు. ప్రజలపై మరింత ఆర్థిక భారం మోపకుండా ప్రభుత్వం తన ప్రాధాన్యాలను మార్చుకోవాలని ఏలేటి సూచించారు.
