- కవితకు అన్యాయం చేసి ఇప్పుడు ఆమెపైనే విమర్శలా?
- కాంగ్రెస్ వైఫల్యాలపై కవిత ఒక్కరే పోరాడుతున్నారు
- ఆత్మవిమర్శ చేసుకోకపోవడమే బీఆర్‌ఎస్ పతనానికి కారణం
హైదరాబాద్, వెలుతురు, సెప్టెంబర్ 2:
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలతో పాటు ప్రతిపక్ష బీఆర్‌ఎస్ వైఖరిని కూడా ప్రశ్నిస్తూ ప్రజల తరఫున పోరాడుతున్నది తెలంగాణ రక్షణ సేన మాత్రమేనని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు నవీన్ ఆచారి అన్నారు. బీఆర్‌ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, ఆ పార్టీ నేతలు వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదని ఆయన పేర్కొన్నారు.
బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో నవీన్ ఆచారి మాట్లాడుతూ నిజామాబాద్‌లో ఇటీవల నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభలో కవిత చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పాల్సిన బీఆర్‌ఎస్ నేతలు, ఆమె కాంగ్రెస్‌కు అనుకూలంగా పనిచేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేయడం రాజకీయంగా దిగజారుడు వైఖరికి నిదర్శనమని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై కవిత ఒక్కరే నిరంతరం ప్రశ్నిస్తున్నారని, సింగరేణి, ఆర్టీసీ కార్మికులు, వెలుగుమట్ల బాధితుల సమస్యలపై ఆమె స్పందిస్తున్నారని నవీన్ ఆచారి తెలిపారు. ప్రజల తరఫున పోరాడాల్సిన బీఆర్‌ఎస్ తన బాధ్యతను విస్మరించడంతోనే కవిత ఆ పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారని అన్నారు.
కవిత ఓటమిపై సమీక్ష ఎందుకు చేయలేదు?
నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో కవిత ఓటమికి దారితీసిన కారణాలపై బీఆర్‌ఎస్ నాయకత్వం ఇప్పటివరకు సమగ్ర సమీక్ష ఎందుకు నిర్వహించలేదని నవీన్ ఆచారి ప్రశ్నించారు. అప్పటి ఇన్‌చార్జి మంత్రి ప్రశాంత్‌రెడ్డితో పాటు పార్టీ పెద్దలు ఆ ఓటమిపై నిజాయితీగా సమీక్ష చేసి ఉంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదన్నారు.
కామారెడ్డిలో కేసీఆర్ ఓటమి సహా వరుస ఎన్నికల్లో పార్టీ ఎదుర్కొన్న పరాజయాలపై ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన బీఆర్‌ఎస్ నేతలు, ప్రశ్నలు సంధిస్తున్న కవితపై ఎదురుదాడికి దిగడం వల్ల పార్టీకి మరింత నష్టం జరుగుతుందని అన్నారు.
కవిత ఓటమికి కారణమైన వారే ఇప్పుడు ఆమెపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. బాల్కొండ నుంచి పలువురు రైతులు కవితపై పోటీ చేసిన సమయంలో వారితో చర్చించి పోటీ నుంచి తప్పించేందుకు ఎందుకు ప్రయత్నించలేదని ప్రశాంత్‌రెడ్డిని ప్రశ్నించారు. అనంతరం వారిలో కొందరిని పార్టీలోకి తీసుకుని నామినేటెడ్ పదవులు ఇచ్చారనే ఆరోపణలపై కూడా బీఆర్‌ఎస్ నాయకత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ వ్యాఖ్యలకు విరుద్ధంగా విమర్శలు ఎందుకు?
ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన కేసులో కవిత పాత్ర లేదని కేసీఆర్ స్వయంగా చెప్పినప్పటికీ, బీఆర్‌ఎస్ నేతలు ఆమెను అవమానకర పదజాలంతో విమర్శించడం ఏమిటని నవీన్ ఆచారి ప్రశ్నించారు. కాళేశ్వరం అంశంలో కేసీఆర్‌కు నోటీసులు వచ్చినప్పుడు పార్టీ స్పందించిన విధంగానే, కవితకు సంబంధించిన కేసు సమయంలో పార్టీ ఎందుకు అండగా నిలబడలేదని నిలదీశారు.
కవితకు షోకాజ్ నోటీసులు ఇవ్వకుండానే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఏ విధమైన న్యాయమని ప్రశ్నించారు. కవితకు నోటీసులు ఇచ్చామని కొందరు బీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారని, అయితే నోటీసులు ఇవ్వకుండానే సస్పెన్షన్ జరిగిందన్న అంశాన్ని వారు గుర్తించాలని సూచించారు.
బోధన్ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి కారు ప్రమాదం ఘటనలో పోలీసుల వ్యవహారశైలిపై కవిత ప్రశ్నించడం కూడా తప్పుగా చూపడం సరికాదన్నారు. తప్పును తప్పుగా ప్రశ్నిస్తూ రాజకీయాల్లో హుందాతనాన్ని పాటిస్తున్న కవితపై చిల్లర వ్యాఖ్యలు చేయడం బీఆర్‌ఎస్ నేతలకు తగదన్నారు.
సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగత విమర్శలకు దిగకుండా, విధానపరమైన అంశాలపై రాజకీయంగా సమాధానం చెప్పాలని బీఆర్‌ఎస్ నాయకత్వానికి సూచించారు. జెన్-జీ కాలంలోనైనా చౌకబారు రాజకీయాలకు స్వస్తి పలకాలని అన్నారు.
పసుపు బోర్డుతో రైతులకు ప్రయోజనం ఏమిటి?
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పసుపు బోర్డు పేరుతో రైతులను మభ్యపెడుతున్నారని నవీన్ ఆచారి ఆరోపించారు. పసుపు బోర్డు ద్వారా రైతులకు వాస్తవంగా లభించిన ప్రయోజనాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పసుపు ధరలు పెరిగిన ప్రతిసారీ దానిని తమ ఘనతగా చెప్పుకోవడం కాకుండా, రైతులు కోరుతున్న విధంగా ఏటా మద్దతు ధర కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులను మోసం చేసే ప్రచారాలకు స్వస్తి పలకాలని అర్వింద్‌ను కోరారు.
నిజామాబాద్ ప్రజల గుండెల్లో కవితకు ప్రత్యేక స్థానం
నిజామాబాద్ ప్రజల గుండెల్లో కవితకు ప్రత్యేక స్థానం ఉందని నవీన్ ఆచారి అన్నారు. ఎంపీగా, ఎమ్మెల్సీగా ఆమె చేసిన సేవలను ప్రజలు మరచిపోలేదన్నారు. ఇటీవల నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభకు లభించిన స్పందనే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.
పార్టీ ఏర్పాటు చేసిన అనంతరం నాలుగు నెలలకు నిజామాబాద్‌కు వచ్చిన కవితను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారని, తన సొంత ప్రజలను చూసి ఆమె భావోద్వేగానికి గురయ్యారని తెలిపారు. నిజామాబాద్ ఎంపీగా ఉన్న సమయంలో పసుపు రైతుల సమస్యలు, జిల్లా సమస్యలు, తెలంగాణ అంశాలపై ఆమె పోరాటం చేశారని గుర్తుచేశారు.
పాంచజన్య సంకల్ప సభను విజయవంతం చేసిన ప్రజలు, కార్యకర్తలు, నాయకులకు నవీన్ ఆచారి కృతజ్ఞతలు తెలిపారు.
