50 గంటల ప్రజా కళాజాతర ప్రారంభం

  • ప్రజా కళలు, సంస్కృతిని కాపాడుకోవాలి
  • జానపద కళారూపాలను భావితరాలకు అందించాలి: వక్తలు

హైదరాబాద్, వెలుతురు, సెప్టెంబర్ 26:

ప్రజా కళలు, జానపద కళారూపాలు, ప్రజా సంస్కృతిని పరిరక్షిస్తూ వాటిని భావితరాలకు అందించాలనే సందేశంతో 50 గంటల ప్రజా కళాజాతర ప్రారంభమైంది. ఉభయ తెలుగు రాష్ట్రాల అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఆర్టీసీ కళ్యాణ మండపం వరకు వేలాది మంది కళాకారులతో ర్యాలీ నిర్వహించారు. వివిధ జానపద, ప్రజా కళారూపాలను ప్రదర్శిస్తూ కళాకారులు ర్యాలీలో పాల్గొన్నారు.

ఆర్టీసీ కళ్యాణ మండపం వద్ద అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జెండాను సీనియర్ కార్యకర్త అంబిక ఆవిష్కరించగా, మల్సూర్ ‘ఓ అరుణ పతాకమా’ గీతాన్ని ఆలపించారు. అనంతరం ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని ప్రొఫెసర్ శాంతా సిన్హా ప్రారంభించారు. ప్రజా ఉద్యమాలు, తెలంగాణ ఉద్యమం, బహుజన బతుకమ్మ కార్యక్రమాల్లో విమలక్క ఐదు దశాబ్దాలుగా నిర్వహించిన కార్యక్రమాలను ప్రతిబింబించేలా గ్యాలరీని ఏర్పాటు చేశారు.

ప్రజా కళాజాతర సభను ‘అంకురం’ సినిమా దర్శకుడు ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ప్రజా సంస్కృతి ప్రజల సమస్యలను ప్రతిబింబిస్తూ వాస్తవాల వైపు నిలుస్తుందని ఆయన అన్నారు. జానపద కళారూపాలు ప్రజల గుండెచప్పుడని, వాటిని ఆధునీకరించి భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా కళారూపాలను యువతరం ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఐదు దశాబ్దాలుగా విమలక్క ప్రజా కళలు, ప్రజా ఉద్యమాలతో మమేకమై పనిచేయడం ప్రస్తావనీయమన్నారు.

విమలక్క నేతృత్వంలో సిగ్నేచర్ డాన్స్, అమరులకు నివాళిగా ‘వీరుల సన్నిధి’ పాట ప్రదర్శించారు. వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతిని పురస్కరించుకుని ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి ప్రొఫెసర్ నాగేశ్వర్‌రావు సమన్వయకర్తగా వ్యవహరించి ప్రజా కళాజాతర కీనోట్‌ను ప్రవేశపెట్టారు. ఈ  కార్యక్రమంలో ప్రముఖ జర్నలిస్టు భాషా సింగ్, ప్రొఫెసర్లు జయధీర్ తిరుమలరావు, చక్రధరరావు, వినయ్‌బాబు, కట్టా భగవంతరెడ్డి, రమేష్ పోతుల, మల్సూర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.