కరీంనగర్ బస్‌స్టేషన్‌లో డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ

  • రాజ్యాంగ విలువలను కాపాడుకోవాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
  • అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేస్తాం: మంత్రి వాకిటి శ్రీహరి

కరీంనగర్, వెలుతురు, సెప్టెంబర్ 26:

కరీంనగర్ పట్టణంలోని డా. బీఆర్ అంబేద్కర్ బస్‌స్టేషన్ ప్రాంగణంలో భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్ భీంరావు రాంజీ అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ 2013లో తాను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సమయంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా కరీంనగర్ బస్‌స్టేషన్‌కు డా. బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టినట్లు తెలిపారు. సుమారు 13 ఏళ్ల అనంతరం అదే బస్‌స్టేషన్ ప్రాంగణంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషకరమన్నారు. విగ్రహ ఏర్పాటుకు మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, దొంత రాజయ్య తదితరులు చేసిన కృషిని ఆయన అభినందించారు.

డా. బీఆర్ అంబేద్కర్ కేవలం రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాదని, సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం, సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహానేత అని మంత్రి పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించడంతో పాటు అణగారిన వర్గాలకు ఆత్మగౌరవంతో జీవించే అవకాశాన్ని కల్పించిందన్నారు. విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యం ద్వారా సామాజికంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి రాజ్యాంగం బలమైన పునాది వేసిందని తెలిపారు.

ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే బస్‌స్టేషన్ ప్రాంగణంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ప్రత్యేకతను సంతరించుకుందని, ప్రతిరోజూ వేలాది మంది ఆయన విగ్రహాన్ని చూస్తూ రాజ్యాంగ విలువలను గుర్తుచేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. యువత అంబేద్కర్ జీవితం, ఆలోచనలు, పోరాటాలను అధ్యయనం చేయాలని సూచించారు.

రాజ్యాంగం హక్కులతో పాటు పౌరుల బాధ్యతలను కూడా గుర్తు చేస్తుందని, సమానత్వం, సామాజిక న్యాయం, సోదరభావం వంటి రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని మంత్రి పిలుపునిచ్చారు. అంబేద్కర్ స్ఫూర్తితో పాటు జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు.

అదేవిధంగా ప్రజాపాలన ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, సంస్థ పరిరక్షణ, ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని ఆమె పోరాట స్ఫూర్తిని కూడా మంత్రి స్మరించుకున్నారు.

అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు, గౌరవం, న్యాయం అందే సమాజ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. కరీంనగర్ బస్‌స్టేషన్‌లో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందిస్తూ, ఆయన ఆశయాలను జీవితంలో ఆచరించడమే మహనీయుడికి అందించే నిజమైన నివాళి అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, ఆర్టీఏ, మార్కెట్ కమిటీ, లైబ్రరీ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.