ప్రజా చైతన్యానికి యువ దర్శకులు కదలాలి : భట్టి ‎

‎ప్రజా చైతన్యానికి యువ దర్శకులు కదలాలి : భట్టి

‎హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 17 :

‎యువ ఫిలిం మేకర్లు తమ సృజనాత్మకతతో సమాజాన్ని ఆలోచింపజేసే లఘు చిత్రాలను రూపొందించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, భవిష్యత్తులో ఎదురయ్యే నీటి సంక్షోభం వంటి సమస్యలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. బతుకమ్మ పండుగలో రంగురంగుల పూలు ఎలా విరబూస్తాయో, యువ ఫిలిం మేకర్ల జీవితాలు కూడా విజయాలతో అలా వికసించాలని  ఆకాంక్షించారు. యువ దర్శకులు మంచి కథలతో ముందుకు వచ్చి, వినోదంతో పాటు సమాజానికి మేలు చేసే చిత్రాలను రూపొందించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ను కేవలం తెలుగు చిత్ర పరిశ్రమకే పరిమితం చేయకుండా, భారతీయ సినిమాకు ప్రధాన కూడలిగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. తెలంగాణ యువతలోని సినీ ప్రతిభను ప్రోత్సహిస్తూ, జాతీయ స్థాయిలో హైదరాబాద్‌ను ప్రముఖ సినీ గమ్యస్థానంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

‎

‎హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరిగిన బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్ ఛాలెంజ్ అవార్డ్స్‌–2026 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భట్టి విక్రమార్క జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మకు ప్రతిరూపమని  అన్నారు. వివిధ రంగులు, సువాసనలతో కూడిన పూలు ఒకచోట చేరినట్లుగా సమాజంలోని భిన్న వర్గాల ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చే వేడుక బతుకమ్మ అని పేర్కొన్నారు. అందుకే ఈ పండుగ సామాజిక న్యాయం, సమానత్వానికి ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు.

‎

‎

‎హైదరాబాద్‌ను భారతీయ సినిమాకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దుతాం

‎

‎తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌లోనే ఉన్నప్పటికీ, తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రతిభావంతులకు తగిన అవకాశాలు లేవనే అభిప్రాయం గతంలో ఉండేదని భట్టి విక్రమార్క అన్నారు. అయితే, ప్రస్తుతం తెలంగాణకు చెందిన పలువురు దర్శకులు, హీరోలు, నిర్మాతలు చిత్ర పరిశ్రమలో తమ ప్రతిభను చాటుకుంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో సృజనాత్మకతకు కొదవలేదని, యువ ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే మరింత మంది ప్రతిభావంతులు వెలుగులోకి వస్తారని చెప్పారు. హైదరాబాద్‌ను భారతీయ సినిమా పరిశ్రమకు ప్రధాన గమ్యస్థానంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా రాష్ట్ర మంత్రివర్గం ఈ దిశగా ఆలోచనలు చేస్తోందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న సినీ రంగ ప్రముఖులను హైదరాబాద్‌కు ఆహ్వానించడం, ఇక్కడ సినిమా రంగ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలు, అనుకూల వాతావరణాన్ని కల్పించడం ద్వారా నగరాన్ని భారతీయ సినిమా రంగంలో కీలక కేంద్రంగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు.

‎

‎మూడు నిమిషాల్లో కథ చెప్పడమూ గొప్ప సృజనాత్మకతే

‎

‎యువ దర్శకుల్లోని ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్ ఛాలెంజ్ నిర్వహించడం అభినందనీయమని ఉప ముఖ్యమంత్రి అన్నారు. మూడు గంటల సినిమాలో చెప్పగలిగే కథను కేవలం రెండు, మూడు నిమిషాల నిడివి ఉన్న షార్ట్‌ఫిల్మ్‌లో చెప్పడం ఎంతో సృజనాత్మకతతో కూడుకున్న విషయమని పేర్కొన్నారు. తక్కువ సమయంలో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, తమ ఆలోచనను సమర్థంగా వ్యక్తీకరించగలిగిన యువ దర్శకులకు భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పోటీలో అవార్డులు అందుకోని వారి చిత్రాల్లోనూ మంచి ప్రతిభ కనిపించిందని పేర్కొంటూ, అవార్డు రాకపోయినంత మాత్రాన నిరుత్సాహపడవద్దని యువ ఫిలిం మేకర్లకు సూచించారు. భవిష్యత్తులో ఎవరు గొప్ప దర్శకులుగా ఎదుగుతారో ఇప్పుడే చెప్పలేమని, అందరూ తమ సృజనాత్మకతను కొనసాగిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. యువ దర్శకులను ప్రోత్సహించేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో షార్ట్‌ఫిల్మ్‌లు, పాటలు, జానపద గీతాలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు, వ్యాసాలు తదితర విభాగాల్లో మొత్తం 29 అవార్డులతో యువ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం సంతోషకరమన్నారు. యువత రూపొందించిన షార్ట్‌ఫిల్మ్‌లను వీక్షించి, ప్రతిభావంతులను మరింతగా ప్రోత్సహించే అవకాశాలను పరిశీలిస్తానని తెలిపారు.

‎

‎వాతావరణ మార్పులపై ప్రజల్లో అవగాహన కల్పించాలి

‎

‎సినిమా వినోదానికి మాత్రమే పరిమితం కాకుండా సమాజానికి ఉపయోగపడే సందేశాలను అందించే సాధనంగా మారాలని భట్టి విక్రమార్క అన్నారు. ముఖ్యంగా రాబోయే రోజుల్లో వాతావరణ మార్పులు, సూపర్ ఎల్‌నినో ప్రభావాలు, ఉష్ణోగ్రతల పెరుగుదల, వర్షపాతంలో మార్పులు ప్రజల జీవనంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితులపై ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయడంలో యువ దర్శకులు తమ వంతు పాత్ర పోషించాలని కోరారు. ప్రజలకు సులభంగా అర్థమయ్యే కథలతో, ఆకట్టుకునే దృశ్యాలతో షార్ట్‌ఫిల్మ్‌లు రూపొందించి ప్రకృతి పరిరక్షణ, నీటి పొదుపు, పర్యావరణ సమతుల్యతపై చైతన్యం కల్పించవచ్చన్నారు. ఒక చిన్న గ్రామంలో జరిగే సంఘటన ఆధారంగా రూపొందించిన లఘు చిత్రం కూడా నేటి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపగలదని చెప్పారు. యువ దర్శకుల చేతుల్లో సమాజాన్ని ఆలోచింపజేసే శక్తి ఉందని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

‎

‎నీటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

‎

‎భవిష్యత్తులో నీటి లభ్యత కీలక సమస్యగా మారే ప్రమాదం ఉందని ఉప ముఖ్యమంత్రి హెచ్చరించారు. ఆహార ధాన్యాల లభ్యతతో పోలిస్తే తాగునీటి నిల్వలు, వాటి సంరక్షణపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. వర్షపాతం పరిస్థితులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, నీటి ఆవిరి పెరుగుదల వంటి అంశాలు భవిష్యత్తులో నీటి వనరులపై ఒత్తిడిని పెంచవచ్చని పేర్కొన్నారు. మనుషులు, పశువులు, పక్షుల తాగునీటి అవసరాలను తీర్చేందుకు అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. నీటిని వృథా చేయకుండా ఎలా కాపాడుకోవాలి, వర్షపు నీటిని ఎలా ఒడిసిపట్టాలి, ప్రకృతిని ఎలా పరిరక్షించాలి వంటి అంశాలను కథాంశాలుగా తీసుకొని షార్ట్‌ఫిల్మ్‌లు రూపొందించాలని యువ దర్శకులకు విజ్ఞప్తి చేశారు. ప్రజల్లో బాధ్యతాయుతమైన ఆలోచనలను పెంపొందించడంలో కళాకారులు, కథానాయకులు, ఫిలిం మేకర్లు కీలక పాత్ర పోషించగలరని చెప్పారు.

‎

‎విద్యుత్ పొదుపుపైనా చైతన్యం అవసరం

‎

‎రాష్ట్రంలో విద్యుత్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని విద్యుత్‌ను పొదుపుగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, వాతావరణ మార్పుల ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించే కథాంశాలను కూడా యువ దర్శకులు ఎంచుకోవాలని సూచించారు. ప్రజల దైనందిన జీవితానికి ఉపయోగపడే సందేశాలను సృజనాత్మకంగా అందిస్తే షార్ట్‌ఫిల్మ్‌లు సామాజిక మార్పునకు దోహదపడతాయని పేర్కొన్నారు.

‎

‎కళలు, సృజనాత్మకతకు ప్రభుత్వ ప్రోత్సాహం

‎

‎ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కళలు, సృజనాత్మకత పట్ల ఆసక్తి ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి స్వయంగా ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో చదువుకున్న నేపథ్యంలో కళారంగంలోని ప్రతిభను ప్రోత్సహించే ప్రయత్నాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. యువతలోని ప్రతిభను గుర్తించి, వారికి అవకాశాలు కల్పించడం ద్వారా తెలంగాణ నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే దర్శకులు, కళాకారులు ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వం ఆకాంక్షిస్తోందన్నారు.

Leave A Reply

Your email address will not be published.