రేవంత్ ప్రభుత్వంపై సీబీఐ విచారణ జరిపించాలి : మన్నె కృషాంక్ 

రేవంత్ ప్రభుత్వంపై సీబీఐ విచారణ జరిపించాలి : మన్నె కృషాంక్

 

హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 19 :   సీఎం రేవంత్‌రెడ్డిపై వస్తున్న ఆరోపణలపై సీబీఐతో విచారణ జరిపించాలని కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్ డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత కొన్ని నెలలుగా రేవంత్‌రెడ్డి కుటుంబం, ప్రభుత్వానికి సంబంధించిన పలు అంశాలపై ఆధారాలు బయటపెడుతున్నా సీఎం సమాధానం చెప్పడం లేదన్నారు.

 

రేవంత్‌రెడ్డి ప్రభుత్వం 22ఏ పేరుతో నిషేధిత భూముల వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. చందనవల్లిలోని సర్వే నంబర్ 363లోని భూముల రిజిస్ట్రేషన్‌పై కూడా పలు అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి మరో పవర్ సెంటర్‌గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

 

ఎల్‌నినో పరిస్థితులపై ప్రభుత్వం నిర్వహించిన సమీక్షలు, రైతులకు పంటలు వేయవద్దంటూ చేస్తున్న సూచనలపై కూడా క్రిశాంక్ ప్రశ్నలు సంధించారు. కేసీఆర్‌ ఫామ్‌హౌస్ చుట్టూ అసైన్డ్ భూములున్నాయంటూ గతంలో దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందని, మరోవైపు ‘అనుముల గ్యాంగ్’ రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు పెరిగాయని విమర్శించారు.

 

ఫార్మా, హెల్త్, డిఫెన్స్, విద్య, కార్ల కంపెనీలు, భూములు.. ఇలా ఏ రంగాన్నీ రేవంత్ ప్రభుత్వం వదలడం లేదని ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్ర ప్రభుత్వంపై విచారణ జరిపించడం లేదన్నారు. అధికారులు సమాచారం ఇవ్వకపోయినా బాధితులు అందిస్తున్న సమాచారాన్ని ఆధారంగా తీసుకుని వాస్తవాలను వెలుగులోకి తెస్తున్నామని క్రిశాంక్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.