ఎల్లుండి రవీంద్ర భారతిలో పండుగ సాయన్న జయంతి

ఎల్లుండి పండుగ సాయన్న జయంతి

 

మక్తల్, వెలుతురు, అక్టోబర్ 20 : మక్తల్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో పండుగ సాయన్న 174వ జయంతి పోస్టర్‌ను మంత్రి వాకిటి శ్రీహరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పండుగ సాయన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్బంగా ముదిరాజుల తరపున ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ నెల 22వ తేదీన హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో నిర్వహించనున్న జయంతి వేడుకలకు ముదిరాజ్ బంధుమిత్రులు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. పండుగ సాయన్న తన కాలంలో సామాజిక అసమానతలను, దోపిడీని ఎదిరిస్తూ పేదలు, బలహీన వర్గాల పక్షాన నిలిచిన ప్రజానాయకుడిగా గుర్తింపు పొందారని తెలిపారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తూ, అణగారిన వర్గాలకు అండగా నిలిచిన ఆయన జీవితం ప్రజల్లో ధైర్యాన్ని, ఆత్మగౌరవాన్ని నింపిందని పేర్కొన్నారు. పండుగ సాయన్న చరిత్రను భావితరాలకు అందించడంతో పాటు, ఆయన ఆశయాలను సమాజంలో విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పండుగ సాయన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ద్వారా ఆయన సేవలకు, పోరాట స్ఫూర్తికి తగిన గుర్తింపు లభిస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. పండగ సాయన్న జయంతి కార్యక్రమాన్ని ముదిరాజ్ సమాజం ఐక్యతకు, మహనీయుల చరిత్రను స్మరించుకునే వేదికగా మలచాలని మంత్రి వాకిటి శ్రీహరి ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.