ఉప్పల్‌లో రూ.3.22 కోట్లతో అత్యాధునిక సిటీ బస్ టెర్మినల్ నిర్మాణం
హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 24 : మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్–10, ఉప్పల్ జోనల్ వర్క్‌షాప్ వద్ద పాత ఉప్పల్ బస్ డిపో స్థలంలో రూ.3.22 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న అత్యాధునిక సిటీ బస్ టెర్మినల్ నిర్మాణ పనులకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో నిర్మిస్తున్న ఈ టెర్మినల్‌ను ప్రయాణికులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. 100 రోజుల్లో నిర్మాణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, వజ్రేష్ యాదవ్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ రూ.3.22 కోట్లు కేటాయించి బస్ టెర్మినల్ నిర్మాణానికి సహకరించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. కాలానికి అనుగుణంగా ఆధునిక సౌకర్యాలు, ఆహ్లాదకరమైన వాతావరణంతో బస్ టెర్మినల్‌ను నిర్మిస్తామన్నారు.
– ఈ టెర్మినల్ నుంచి రోజుకు సుమారు 1,053 బస్సు ట్రిప్పులు నడిచేలా, దాదాపు లక్ష మంది ప్రయాణికులకు సేవలు అందేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
– ప్రయాణికులకు అవసరమైన మౌలిక సదుపాయాలతో పాటు ప్రత్యేక బస్ పాస్ కౌంటర్, సమాచార కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు.
– ఉప్పల్, బోడుప్పల్, పీర్జాదిగూడ, ఘట్కేసర్, మల్కాజిగిరి, రామంతాపూర్ ప్రాంతాల ప్రజలకు సికింద్రాబాద్, ఐటీ కారిడార్, పటాన్చెరు తదితర ప్రాంతాలకు ప్రయాణం మరింత సులభతరం అవుతుందని పేర్కొన్నారు.
– బస్ టెర్మినల్ పిర్జాదిగూడ బోడుప్పల్ పరిధిలో ఉండడంతో బస్ టెర్మినల్ లు తగిన విధంగా నామకరణం చేసే ప్రక్రియ చేపడతామని తెలిపారు.
ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభించామని మంత్రి తెలిపారు.
ఈ పథకం ద్వారా ఇప్పటివరకు సుమారు 367 కోట్ల మహిళా ప్రయాణాలు నమోదయ్యాయని, మహిళలు ఉచిత ప్రయాణం ద్వారా దాదాపు రూ.12,888 కోట్లు ఆదా చేసుకున్నారని పేర్కొన్నారు. మహిళలకు ఆర్థిక వెసులుబాటు కల్పించడంతో పాటు వారి ప్రయాణ అవసరాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.
రాఖీ పౌర్ణమి వంటి పండుగల సమయంలోనూ ఆర్టీసీ సిబ్బంది నిరంతరం సేవలందిస్తూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారని ప్రశంసించారు.
ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం
కార్మికుల సంక్షేమం, ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు, ఆర్టీసీ సంస్థ అభివృద్ధి అనే మూడు ప్రధాన అంశాలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి స్పష్టం చేశారు.
– రిటైర్డ్ ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన సుమారు రూ.1,400 కోట్ల బకాయిల చెల్లింపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించామని, ఈ అంశంపై త్వరలో నిర్ణయం వెలువడుతుందని తెలిపారు.
– గతంలో పెండింగ్‌లో ఉన్న సీసీఎస్, పీఎఫ్ తదితర బకాయిలను విడతలవారీగా చెల్లిస్తూ వస్తున్నామని పేర్కొన్నారు.
– ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేశామని, డీఏ బకాయిలు లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
– పదేళ్ల తర్వాత ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించామని, ఎన్నికైన గుర్తింపు సంఘంతో కమిటీ ఏర్పాటు చేసి ఆర్టీసీ ప్రభుత్వంలో విలీన ప్రక్రియను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
– కార్మికుల ఆర్థిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
ప్రభుత్వ హయాంలో 3,000కు పైగా కొత్త బస్సుల కొనుగోలుతో పాటు, పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద హైదరాబాద్ నగర పరిధిలో సుమారు 2,200 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు.
హైదరాబాద్ నగరంలో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా కొత్త రూట్లలో బస్సులు నడుపుతున్నామని, ఎక్కడైనా బస్సుల అవసరం ఉంటే ప్రజలు విజ్ఞప్తులు అందించాలని సూచించారు. ప్రజల అవసరాలను పరిశీలించి రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తామని తెలిపారు.
హైదరాబాద్‌లో ఢిల్లీ తరహా కాలుష్య పరిస్థితులు తలెత్తకుండా పర్యావరణహిత రవాణాను ప్రోత్సహిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
– నగరంలో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగాన్ని పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు.
– తొలిదశలో పాత డీజిల్ బస్సుల్లో 250 బస్సులను రెట్రోఫిట్ విధానం ద్వారా మార్పు చేస్తున్నామని వెల్లడించారు.
– క్యూర్ (Q-Area) ప్రాంతంలో ఈవీ ఆటోలను ప్రోత్సహించేందుకు రూ.200 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
– ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులకు రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజులో 100 శాతం మినహాయింపు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
– ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసి డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను ఆధునికీకరిస్తామని తెలిపారు.
– రోడ్డు భద్రత కోసం రిఫ్లెక్టర్ల వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు, కాలం చెల్లిన వాహనాల తొలగింపునకు స్క్రాప్ పాలసీని తీసుకొచ్చామని వివరించారు.
–
రాష్ట్రవ్యాప్తంగా బస్స్టాండ్లలో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు, ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ఆర్టీసీ కార్మికుల సంక్షేమాన్ని పరిరక్షించడం, సంస్థను అభివృద్ధి చేయడం, మహిళలు సహా అన్ని వర్గాల ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడం, కాలుష్యాన్ని తగ్గించే పర్యావరణహిత రవాణా వ్యవస్థను రూపొందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని మంత్రి స్పష్టం చేశారు.
