మహిళా జర్నలిస్టులను శత్రువులుగా చూడటం ప్రజాస్వామ్యానికి ప్రమాదం
హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 24 : బేగంపేట టూరిజం ప్లాజాలో ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ మహిళా జర్నలిస్టుల సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై సదస్సును ప్రారంభించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళా జర్నలిస్టులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. అధికారాన్ని ప్రశ్నించే మహిళా జర్నలిస్టులను శత్రువులుగా చూడటం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు. ఎన్నికల ప్రధానాధికారి జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలను కవర్ చేసిన మహిళా జర్నలిస్టులపై దాడులు, లైంగిక వేధింపుల ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రశ్నలను అణచివేయడం కాకుండా వాటికి సమాధానం చెప్పే ధైర్యంలోనే ప్రజాస్వామ్య బలం ఉందన్నారు.
మహిళల స్వేచ్ఛ, హక్కుల విషయంలో మనుస్మృతి భావజాలం కాకుండా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగమే తమకు సర్వోన్నతమని సీతక్క స్పష్టం చేశారు. మహిళలు ఎవరి దయాదాక్షిణ్యాలూ కోరడం లేదని, రాజ్యాంగం కల్పించిన హక్కులను మాత్రమే డిమాండ్ చేస్తున్నారని అన్నారు. పత్రికా స్వేచ్ఛ, అధికారాన్ని ప్రశ్నించే హక్కు లేకుండా ప్రజాస్వామ్యం మనుగడ సాగించదన్నారు.
మహిళలను కేవలం ఆదాయార్జనకే పరిమితం చేయకుండా ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా ఆస్తులు, వ్యాపారాలకు యజమానులుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. మహిళా జర్నలిస్టుల భద్రత, గౌరవం, వృత్తిపరమైన హక్కుల పరిరక్షణకు ఐజేయూ ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
సదస్సులో హైకోర్టు రిటైర్డ్ జడ్జి రాధారాణి, మల్కాజిగిరి సీపీ సుమతి, తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, కర్ణాటక మీడియా అకాడమీ చైర్పర్సన్ అయిషా కనుమ్, ఐజేయూ జాతీయ అధ్యక్షుడు బల్వీందర్ సింగ్ జమ్మూ, జర్నలిస్టు ఉద్యమ నేతలు దేవులపల్లి అమర్, విరహత్ అలీ, సోమసుందర్, అరుణ తదితరులు పాల్గొన్నారు.
