సున్నం చెరువు వద్ద అక్రమ బోర్లపై హైడ్రా యాక్షన్
అక్రమ నీటి దందాకు చెక్.. బోర్ల పైపుల తొలగింపు
హైదరాబాద్, వెలుతురు , అక్టోబర్ 24 : సున్నం చెరువు చుట్టుపక్కల అక్రమంగా బోర్లు వేసి నీటిని తోడుతూ వ్యాపారం చేస్తున్న వారిపై హైడ్రా అధికారులు చర్యలు చేపట్టారు. ఇళ్లలో బోర్లు వేసి వాటి ద్వారా నీటిని అక్రమంగా తోడుతూ దశాబ్దాలుగా సాగుతున్న నీటి దందాకు చెక్ పెట్టే చర్యల్లో భాగంగా హైడ్రా భారీ ఆపరేషన్ నిర్వహించింది.
సున్నం చెరువు పరిసరాల్లోని కొన్ని నివాసాల నుంచి బోర్ల ద్వారా నీటిని తోడుతున్న పైపులను అధికారులు తొలగించారు. ఇళ్లలో బోర్లు వేసి.. వాటి ద్వారా నీటిని సేకరించి వ్యాపారం చేస్తున్న వ్యవస్థపై హైడ్రా దృష్టి సారించింది. అక్రమ బోర్ల నుంచి చెరువు నీటిని తోడుతూ వ్యాపారం చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
రెవెన్యూ, సిటిజన్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ), పోలీసు శాఖల సమన్వయంతో హైడ్రా అధికారులు ఈ ఆపరేషన్ నిర్వహించారు. పోలీసుల బందోబస్తు మధ్య అక్రమ బోర్ల పైపులను తొలగించారు. అక్రమంగా నీటిని తోడుతూ వ్యాపారం చేసే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు.
ఇంట్లో బోరు.. బయట అక్రమ నీటి వ్యాపారం అన్న తరహాలో సాగుతున్న వ్యవహారాలకు హైడ్రా చర్యలు అడ్డుకట్ట వేయనున్నాయి. సున్నం చెరువు పరిసరాల్లో నీటి వనరుల దుర్వినియోగంపై మరిన్ని చర్యలు కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు.
