అక్టోబర్ 31న సమూహ యువసాహిత్యోత్సవం–2026

 

‘గోడల్ని ఛేదిద్దాం’ ఇతివృత్తంతో వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో ఉత్సవాలు

వెలుతురు, హైదరాబాద్, అక్టోబర్ 24:

సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో ఈ నెల 31న హైదరాబాద్‌లోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో ‘సమూహ యువసాహిత్యోత్సవం–2026’ నిర్వహించనున్నారు. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ‘గోడల్ని ఛేదిద్దాం’ (వర్డ్స్ ఎగైనెస్ట్ వాల్స్) అనే ఇతివృత్తంతో ఉత్సవాలు జరగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో ఐదు చర్చా సమావేశాలు, యువ కవిసమ్మేళనం, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు.

ఆధిపత్య వ్యవస్థలు – సంస్కృతి నిర్మాణం

తొలి సమావేశం ‘సంస్కృతి–ఆధిపత్య వ్యవస్థలు’ అంశంపై జరగనుంది. సంస్కృతి నిర్మాణంలో కులం, లింగ వివక్ష, కుటుంబం, మతం, భాష, రాజ్యం వంటి వ్యవస్థల పాత్ర, ప్రజాస్వామిక సంస్కృతి నిర్మాణానికి ఎదురవుతున్న అవరోధాలు, వాటిని అధిగమించే మార్గాలపై చర్చిస్తారు. సుంకిరెడ్డి నారాయణరెడ్డి స్వాగతంతో ప్రారంభమయ్యే ఈ సమావేశానికి ఆచార్య సూర్యా ధనంజయ్ గౌరవ అతిథిగా హాజరవుతారు. స్కై బాబా సమన్వయం చేయగా, బీబీసీ తెలుగు ఎడిటర్ జి.ఎస్. రామ్మోహన్ చర్చను ప్రారంభిస్తారు. ఎం.ఎం. వినోదిని, చల్లపల్లి స్వరూపరాణి, రచన ముద్రబోయిన, జాబాలి, అఖిల్ సూర్య పాల్గొంటారు. గుడిపల్లి నిరంజన్ సమావేశాన్ని నిర్వహిస్తారు.

డిజిటల్ మాధ్యమాలు – అసమ్మతి స్వరాలు

రెండో సమావేశంలో డిజిటల్ మాధ్యమాల పాత్ర, అసమ్మతి స్వరాలకు ఎదురవుతున్న సవాళ్లపై చర్చిస్తారు. ప్రధాన స్రవంతి మీడియాలో ప్రజాభిప్రాయాలకు, ఉద్యమ స్వరాలకు తగిన ప్రాధాన్యం లభించని పరిస్థితుల్లో డిజిటల్ వేదికలు ప్రత్యామ్నాయాలుగా ఎలా ఎదుగుతున్నాయి, వాటిపైనా అణచివేత ప్రయత్నాలను ఎలా ఎదుర్కోవాలనే అంశాలను చర్చకు తీసుకురానున్నారు. కె.వి. కూర్మనాథ్ మోడరేటర్‌గా వ్యవహరించగా, రవీశా చర్చను ప్రారంభిస్తారు. తులసి చందు, ముద్దం స్వామి, సుమేరా, విప్లవ శ్రీనిధి పాల్గొంటారు. సిద్ధంకి యాదగిరి సమావేశాన్ని నిర్వహిస్తారు.

కొత్తతరం – సాహిత్య స్వరం

మూడో సమావేశం ‘కొత్తతరం–సాహిత్య స్వరం’ అంశంపై జరగనుంది. నేటి యువత సాహిత్య ఆకాంక్షలు, సృజనాత్మక ప్రయోగాలు, కొత్తతరం రచనా ధోరణులపై చర్చిస్తారు. శివన్నగారి చంద్రయ్య మోడరేటర్‌గా వ్యవహరించనుండగా, వేణు ఉడుగుల చర్చను ప్రారంభిస్తారు. జయలక్ష్మి, ఎ. సందీప్ వోటారికారి, స్వప్న కొండమడుగు, చీక్కొండ్ర రవి, సూర్యచంద్ర తమ అభిప్రాయాలను వెల్లడిస్తారు. హాథీరాం సభావట్ సమావేశాన్ని నిర్వహిస్తారు.

చదువుల మేనిఫెస్టో – మేమెక్కడ?

నాలుగో సమావేశంలో నూతన విద్యావిధానం, విద్యావ్యవస్థను బలహీనపరిచే విధానాలు, పరీక్షల నిర్వహణలో పాలనా వైఫల్యాలు, విద్యారంగంలో మార్పుల కోసం యువత చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చిస్తారు. క్రాంతి మోడరేటర్‌గా వ్యవహరించనుండగా, ఇబ్రహీం నిర్గుణ సమావేశాన్ని నిర్వహిస్తారు. వివిధ విశ్వవిద్యాలయాల విద్యార్థి ప్రతినిధులు పాల్గొనే ఈ సమావేశంలో ఆచార్య భంగ్యా భూక్యా ప్రసంగిస్తారు.

ప్రదర్శన కళలు – సామాజిక మార్పు

ఐదో సమావేశంలో భాగంగా అజయ్ మంకెనపల్లి బృందం వీధి నాటక ప్రదర్శన ఇవ్వనుంది. ప్రదర్శన అనంతరం నిర్మల, ధీరజ్ రావణ్ తేజా స్పందనలు తెలియజేస్తారు. మెర్సీ మార్గరెట్, కుంజ కళ్యాణి ఈ సమావేశాన్ని నిర్వహిస్తారు.

యువ కవుల సమ్మేళనం, సాంస్కృతిక కార్యక్రమాలు

సాయంత్రం ఆర్. సీతారాం, గాజోజు నాగభూషణం, రూపరుక్మిణి నిర్వహణలో యువ కవిసమ్మేళనం జరగనుంది. సుమారు 40 మంది యువ కవులు ఇందులో పాల్గొంటారు. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డా. గడ్డం మల్లేశం ఆత్మీయ సందేశం అందిస్తారు.

అనంతరం పసునూరి రవీందర్, భూపతి వెంకటేశ్వర్లు, ఉదయమిత్ర నిర్వహణలో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. రేలారే ప్రసాద్, అందె డప్పు భాస్కర్, అరుణోదయ బృందానికి చెందిన రాకేష్ తదితర గాయకులు, కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు.

లౌకిక, ప్రజాస్వామిక విలువల పరిరక్షణ కోసం కృషి చేస్తున్న యువత, రచయితలు, కవులు, కళాకారులు, విద్యార్థులు, ప్రజాస్వామికవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని యువసాహిత్యోత్సవాన్ని విజయవంతం చేయాలని సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరమ్ ఆహ్వానించింది.

మరిన్ని వివరాలకు సంప్రదించండి:
మెర్సీ మార్గరెట్, కొల్లాపురం విమల, ఎ. కె. ప్రభాకర్
9052809952, 9848098333, 7680055766

 

 

 

Leave A Reply

Your email address will not be published.