ఉమ్మడి ఖమ్మం జిల్లాకు తాగునీటి గండం లేకుండా అపర భగీరథ ప్రయత్నం
భద్రాద్రి కొత్తగూడెం, వెలుతురు, అక్టోబర్ 24 : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గోదావరి నదిలో నీటిని నిల్వ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని దుమ్ముగూడెం ఆనకట్టపై సుమారు ఒక మీటరు ఎత్తున ఇసుక బస్తాలను ఏర్పాటు చేసి నీటిని నిల్వ చేసే పనులు చేపట్టారు. గోదావరిలో నీటి నిల్వను పెంచడం ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద ఇసుక బస్తాల ఏర్పాటు ద్వారా సుమారు ఒక టీఎంసీ నీటిని నిల్వ చేయాలనే లక్ష్యంతో పనులు చేపడుతున్నారు. ఈ నీటి నిల్వ పనుల ఆవశ్యకతను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన సీఎం తక్షణమే పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇరిగేషన్ శాఖ సీఈ శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద పనులు కొనసాగుతున్నాయి. పనుల పురోగతిపై మంత్రి తుమ్మల ఎప్పటికప్పుడు అధికారులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసి నీటి నిల్వకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచిస్తున్నారు. దీపావళి నాటికి పనులు పూర్తి చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తాగునీటి అవసరాలకు భరోసా కల్పించడం, గోదావరి జలాలను సమర్థంగా వినియోగించుకోవడం లక్ష్యంగా నీటి నిల్వ పనులు చేపడుతున్నారు.
