తుపాకీతో బెదిరించి దోపిడీ.. సరిహద్దుల్లో పోలీసుల వేట!
• బీదర్, మహారాష్ట్ర వైపు సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలన
జహీరాబాద్, వెలుతురు , అక్టోబర్ 26 : సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం చింతల్ఘాట్ గ్రామ సమీపంలో తుపాకీతో బెదిరించి బంగారం దోచుకున్న ఘటన కలకలం రేపింది. హైదరాబాద్కు కారులో వెళ్తున్న వారిని సోమవారం తెల్లవారుజామున బైక్పై వచ్చిన గుర్తుతెలియని దుండగులు అడ్డగించి, తుపాకీతో బెదిరించి వారి వద్ద ఉన్న సుమారు మూడు తులాల బంగారాన్ని దోచుకొని పరారయ్యారు. దోపిడీకి గురైన బాధితులు వెంటనే 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కోహీర్ పోలీసులు అప్రమత్తమై ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. బీదర్, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. బాధితులు ప్రయాణిస్తున్న కారును దుండగులు ఎక్కడి నుంచి అనుసరించారు? ముందస్తు రెక్కీ నిర్వహించారా? అనే కోణాల్లోనూ విచారణ చేపట్టారు. ఈ దోపిడీలో ముగ్గురు దుండగులు పాల్గొన్నట్లు సమాచారం. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
