148 నుంచి 152 మీటర్లకు తుమ్మిడిహట్టి పెంచాలని తెలంగాణ ప్రతిపాదన
హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 26 : గోదావరిలో మన వాటా నీటిని పూర్తిగా వాడుకోవాలి.. మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందించాలి.. ఇందుకోసం తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తును పెంచాలన్న దిశగా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. గతంలో ప్రతిపాదించిన 148 మీటర్లకు బదులు 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మించేందుకు మహారాష్ట్ర అంగీకారం కోరుతోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌తో చర్చలు జరిపారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తును 148 మీటర్లుగా ఉంచేందుకు గతంలో రెండు రాష్ట్రాల మధ్య అవగాహన కుదిరింది. అయితే, ఆ ఎత్తుతో నిర్మిస్తే తెలంగాణ తన వాటా నీటిని పూర్తిస్థాయిలో మళ్లించుకోవడం సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇదే అంశాన్ని సీఎం రేవంత్‌రెడ్డి చర్చల్లో ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలిసింది.
బ్యారేజీ ఎత్తును మరో నాలుగు మీటర్లు పెంచాల్సిన అవసరాన్ని వివరించినట్లు సమాచారం. ప్రాజెక్టుతో ఆశించిన ప్రయోజనాలు దక్కాలంటే ఎత్తు పెంపు కీలకమన్నది తెలంగాణ వాదన. ముఖ్యంగా రాష్ట్రంలోని మెట్ట ప్రాంతాల సాగునీటి అవసరాలను తీర్చేందుకు ఈ ప్రతిపాదనకు ప్రాధాన్యమిస్తోంది. ఇందుకు మహారాష్ట్రను ఒప్పించి, ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తోంది. అయితే, ఎత్తు పెంపుతోపాటు నీటి లభ్యత ఎంత? ముంపు విస్తీర్ణం ఎంత మేర ఉంటుంది? వంటి అంశాలపైనా రెండు రాష్ట్రాల మధ్య అంగీకారం కుదరాల్సి ఉంది. ఈ కీలక అంశాలపై ఏకాభిప్రాయం సాధించే దిశగా తాజా చర్చలు జరిగాయి. పర్యావరణపరమైన ప్రభావాలకు సంబంధించి అవసరమైన పరిహారం చెల్లించేందుకు తెలంగాణ సుముఖత వ్యక్తం చేసింది. చర్చల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, మాజీ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కూడా పాల్గొన్నారు.
మహారాష్ట్రతో చర్చల ద్వారా తుమ్మిడిహెట్టి నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లి, గోదావరి జలాలను రాష్ట్ర సాగునీటి అవసరాలకు మరింతగా వినియోగించుకోవడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది.
