సోలార్ ప్లాంట్ పెట్టండి…లాభాలు ఆర్జించండి : బండి సంజయ్

  • ఏటా రూ.50 లక్షలు ఆర్జించే అవకాశం
  • నాబార్డు ద్వారా రుణం పొందండి
  • సక్రమంగా ఈఎంఐ చెల్లిస్తే 1 శాతం వడ్డీకే రుణాలు
  • సహకార సంఘాలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపు
  • వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడి
  • జన ఔషధి కేంద్రాలను వినియోగించుకోవాలని పిలుపు

చొప్పదండి వెలుతురు జూన్ 17 : సహకార సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుంటే పెద్ద ఎత్తున లాభాలు ఆర్జించే అవకాశం ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. 1 మెగావాట్ సామర్థ్యంతో ఏర్పాటు చేసే ఒక్కో సోలార్ ప్లాంట్ ద్వారా ఏటా రూ.50 లక్షల ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకునేందుకు నాబార్డు ద్వారా రుణ సౌకర్యం కల్పిస్తామన్నారు. సక్రమంగా ఈఎంఐ చెల్లించే సహకార సంఘాలకు 1 శాతం వడ్డీకే రుణాలు లభిస్తాయన్నారు. బుధవారం రోజున చొప్పదండి పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ తొలుత జన ఔషధి కేంద్రాన్ని సందర్శించారు. జన ఔషధి కేంద్రానికి వస్తున్న ఆదరణపై ఆరా తీశారు. అతి తక్కువ ఖర్చుతో జన ఔషధిలో మందులు అందుబాటులో ఉన్నాయని, వినియోగించుకోవాలని ప్రజలను కోరారు. అనంతరం చొప్పదండి శివారులో ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ ను కేంద్ర మంత్రి బండి సంజయ్ సందర్శించారు. సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు అయిన ఖర్చు, రుణం వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.

*ఆ ప్రకటనలోని ముఖ్యాంశాలు…*

పీఎం కుసుం పథకంలో భాగంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సహకార సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంట్ ఏర్పాటును ప్రోత్సహిస్తోంది. ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన వ్యయంలో 80 శాతానికిపైగా నాబార్డు రుణ సౌకర్యం కల్పిస్తోంది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో తొలిసారి చొప్పదండిలోనే సోలార్ ప్లాంట్ ఏర్పాటు కావడం అభినందనీయం. ఈ ప్లాంట్ ధ్వారా 1 మెగావాట్ కరెంట్ ను ఉత్పత్తి చేయవచ్చు. ఒక్కో యూనిట్ ను 3 రూపాయల చొప్పున విద్యుత్ డిస్కంలు కొనుగోలు చేస్తాయి.

వాస్తవానికి 1 మెగావాట్ ఉత్పత్తి కలిగిన సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు అయ్యే మొత్తం ఖర్చు 3 కోట్ల 80 లక్షల రూపాయలు. సహకార సంఘం 40 లక్షలు వెచ్చించాలి. మిగిలిన 3 కోట్ల 40 లక్షల రూపాయలను నాబార్డ్ సంస్థ రుణం రూపంలో ఇస్తోంది. వడ్డీ 4 శాతం. ఒకవేళ సక్రమంగా ఈఎంఐ చెల్లిస్తే 3 శాతం వడ్డీని తిరిగి చెల్లిస్తుంది. అంటే ఒక శాతానికే లోన్ వచ్చినట్లవుతుంది.

సోలార్ ప్లాంట్ ద్వారా ఒక్కో సహకార సంఘానికి ఏటా 50 లక్షల ఆదాయం సంపాదించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 5 సోలార్ ప్లాంట్లు మాత్రమే ఏర్పాటయ్యాయి. అందులో కరీంనగర్ లోని చొప్పదండిలో ఏర్పాటైంది కాగా మిగిలినవి పెద్దపల్లి జిల్లాలో ఏర్పాటయ్యియి. రాష్ట్రవ్యాప్తంగా సహకార సంఘాలు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుని ఆదాయం సమకూర్చుకోవాలి. కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుంది. ఒకవేళ ఎవరైనా వ్యక్తిగతంగా పెట్టుకుంటే 9 శాతం వడ్డీతో రుణం లభిస్తుది. సక్రమంగా కడితే 3 శాతం మినహాయాంపు ఉంటుంది. సోలార్ ప్లాంట్ పెట్టుకోవాలంటే 3 ఎకరాల స్థలం అవసరం. తద్వారా 1 మెగావాట్ కరెంట్ ఉత్పత్తి అవుతుంది. ఏటా పెద్ద ఎత్తున ఆదాయం సమకూర్చుకునే అవకాశం ఉంది. భూమి లభ్యత కలిగిన వారు వెంటనే సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవాలి.

Leave A Reply

Your email address will not be published.