• స్పీకర్ ఛాంబర్‌లో సెలక్ట్ కమిటీ భేటీ
  • హేట్ స్పీచ్ బిల్లుపై చర్చ
  • వారం రోజుల్లో మరో సమావేశం
  • సభ్యుల సూచనలు తీసుకోనున్న కమిటీ
  • అన్ని వర్గాల అభిప్రాయాలకు ప్రాధాన్యం
  • భావప్రకటన స్వేచ్ఛకు భంగం లేదన్న మంత్రి
  • అసెంబ్లీ సమావేశాల్లోనే నివేదిక లక్ష్యం

హైదరాబాద్, వెలుతురు ఆగస్టు 01:

తెలంగాణ అసెంబ్లీలో విద్వేషపూరిత ప్రసంగాల నిరోధానికి ప్రతిపాదించిన చట్టంపై సెలక్ట్ కమిటీ కసరత్తు ప్రారంభించింది. శనివారం అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్‌లో సెలక్ట్ కమిటీ చైర్మన్‌, మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన సమావేశమైన కమిటీ  హేట్ స్పీచ్, క్రైమ్ బిల్లులపై చర్చించింది. వర్షాకాల సమావేశాలు ముగిసేలోపు నివేదిక సమర్పించేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ సమావేశంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో పాటు కమిటీ సభ్యులు దానం నాగేందర్, మధుసూదన్ రెడ్డి, యశస్విని రెడ్డి, కవ్వంపల్లి సత్యనారాయణ, కోవా లక్ష్మి, కూనంనేని సాంబశివరావు, మాణిక్ రావు పాల్గొన్నారు.

సమావేశంలో హేట్ స్పీచ్ బిల్లు, క్రైమ్ బిల్లుకు సంబంధించిన ప్రతులను మరోసారి సభ్యులకు మంత్రి పొన్నం ప్రభాకర్ అందజేశారు. బిల్లులోని నిబంధనలు, వాటిపై సభ్యుల అభిప్రాయాలపై  చర్చించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ వారం రోజుల్లో మరోసారి సెలక్ట్ కమిటీ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. తదుపరి సమావేశంలో సభ్యులందరి నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తామని చెప్పారు.

శాసనసభలో విద్వేషపూరిత ప్రసంగాలను నిరోధించేలా చట్టం తీసుకురావడమే కమిటీ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ఈ అంశంపై సమగ్ర నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేస్తామని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలతో పాటు సమాజంలోని వివిధ వర్గాల ప్రముఖుల అభిప్రాయాలు కూడా తీసుకుంటామని పొన్నం ప్రభాకర్ తెలిపారు. వ్యక్తుల గౌరవానికి భంగం కలగకుండా, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేలా నివేదిక రూపొందిస్తామని చెప్పారు.

భావప్రకటన స్వేచ్ఛకు ఎలాంటి భంగం కలిగించకుండా చట్టాన్ని రూపొందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. విద్వేషపూరిత వ్యాఖ్యలను మాత్రమే నియంత్రించేలా నిబంధనలు ఉండేలా సెలక్ట్ కమిటీ పని చేస్తోందని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.