- పటాన్‌చెరు–ఆదిలాబాద్ లైన్‌ను పింక్‌బుక్‌లో చేర్చాలని విజ్ఞప్తి
- ప్రాజెక్టుకు త్వరితగతిన ఆమోదం ఇవ్వాలని వినతి
- కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో తెలంగాణ ఎంపీల భేటీ
- బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి వినతిపత్రం సమర్పణ
- డీపీఆర్ ఇప్పటికే రైల్వే బోర్డుకు చేరిందని గతంలో కేంద్రం వెల్లడి
- ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ఈ రైల్వే మార్గం కీలకమని బీజేపీ నేతలు
ఢిల్లీ, వెలుతురు జూలై 30:
పటాన్‌చెరు–ఆదిలాబాద్ కొత్త రైల్వే మార్గం మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ బీజేపీ శాసనసభా పక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే అలేటి మహేశ్వర్‌రెడ్డి, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు న్యూఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిశారు. ఈ రైల్వే మార్గానికి త్వరితగతిన ఆమోదం తెలపడంతో పాటు రైల్వే పింక్‌బుక్‌లో చేర్చి నిధులు కేటాయించాలని వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు మెరుగైన రైలు అనుసంధానం కల్పించడంలో పటాన్‌చెరు–ఆదిలాబాద్ రైల్వే లైన్ కీలకమని ప్రతినిధి బృందం వివరించింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే పారిశ్రామిక, వాణిజ్య, వ్యవసాయ రంగాలతో పాటు ప్రయాణ సౌకర్యాలు కూడా మెరుగుపడతాయని కేంద్ర మంత్రికి వివరించారు.
ఇప్పటికే ఈ రైల్వే మార్గానికి సంబంధించి డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్)ను దక్షిణ మధ్య రైల్వే రైల్వే బోర్డుకు సమర్పించినట్లు కేంద్ర ప్రభుత్వం గతంలో పార్లమెంట్‌లో వెల్లడించింది. సుమారు 320 కిలోమీటర్ల పొడవుతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు పరిశీలనలో ఉన్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంట్‌కు తెలిపిన విషయం తెలిసిందే.
అలాగే ఇటీవల కూడా పటాన్‌చెరు–ఆదిలాబాద్ రైల్వే లైన్‌ను పింక్‌బుక్‌లో చేర్చి త్వరగా మంజూరు చేయాలని బీజేపీ నేతలు కేంద్ర రైల్వే శాఖను కోరినట్లు సమాచారం. ప్రాజెక్టుకు సంబంధించిన పరిపాలనా అనుమతులు, నిధుల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

