హైదరాబాద్, వెలుతురు జూలై 31:
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (51) కన్నుమూశారు. కార్డియాక్ అరెస్ట్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయన 2018లో నర్సంపేట నుండి ఎమ్మెల్యేగా సేవలందించారు.
ఈ నెల 26న హనుమకొండలోని తన నివాసంలో ఉన్న సమయంలో ఆయనకు తీవ్ర ఛాతినొప్పి రావడంతో వెంటనే హనుమకొండలోని స్థానిక రోహిణి ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు కార్డియాక్ అరెస్ట్ వచ్చినట్లు గుర్తించి దాదాపు గంటపాటు పలుమార్లు సీపీఆర్ నిర్వహించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించి వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం అందించారు. గత ఐదు రోజులుగా యశోద ఆసుపత్రి ఐసీయూలో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు వెంటిలేటర్‌పై ఉంచి అత్యవసర చికిత్స అందించారు. అయితే, బ్రెయిన్ ఎంఆర్‌ఐ, ఈఈజీ పరీక్షల్లో నాడీ సంబంధిత స్పందనలు కనిపించకపోవడం, శరీర అవయవాలు సహకరించకపోవడంతో గురువారం (జులై 31) అర్ధరాత్రి 12:51 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయనకు భార్య స్వప్న, కుమారుడు నిధర్షన్ రెడ్డి, కుమార్తె ధర్మిష్ఠ రెడ్డి ఉన్నారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగ్రామం నల్లబెల్లిలో సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. ప్రజలతో సన్నిహితంగా మెలుగుతూ ఉద్యమ నాయకుడిగా, ప్రజా ప్రతినిధిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం తెలంగాణ రాజకీయాల్లో తీరని లోటుగా పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు.
నేపథ్యం
పెద్ది సుదర్శన్ రెడ్డి 1974 ఆగస్టు 6న వరంగల్ జిల్లా నల్లబెల్లిలో రైతు కుటుంబంలో జన్మించి, విద్యార్థి దశలోనే కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐ ద్వారా రాజకీయ ప్రయాణం ప్రారంభించి, అనంతరం యువజన కాంగ్రెస్‌లో వివిధ బాధ్యతలు నిర్వహించారు. ఆయన 2001లో టీఆర్ఎస్‌లో చేరి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, జెడ్పిటిసిగా, రాష్ట్ర కార్యదర్శిగా, పొలిటికల్ బ్యూరో సభ్యునిగా పనిచేస్తూ ఉద్యమాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు.
2015లో తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నర్సంపేట నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించి ఎమ్మెల్యేగా సేవలందించారు. 2023 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక పాత్ర
తెలంగాణ మలిదశ ఉద్యమంలో పెద్ది సుదర్శన్‌రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని ముందుండి నడిపించడంలో ఆయన చురుగ్గా వ్యవహరించారు. వరంగల్ కేంద్రంగా జరిగిన సభలు, మహాగర్జన సభ, సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్, రైలు రోకో వంటి అనేక ఉద్యమ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని పలుమార్లు జైలుశిక్ష అనుభవించారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సారథ్యంలో ఉద్యమ వేదికలపై ప్రజా గళాన్ని బలంగా వినిపించారు. కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. పార్టీ ఏ బాధ్యత అప్పగించినా అకుంఠిత దీక్షతో విజయవంతంగా నిర్వహించేవారు.





