పేద ప్రజల గుండె చప్పుడు.. లైఫ్‌లైన్ ఆర్‌టీసీ: పొన్నం ప్రభాకర్

  • కరీంనగర్‌లో సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులకు శ్రీకారం
  • మొదటి దశలో మూడు రూట్లలో సేవలు
  • త్వరలో చల్మెడ, ప్రతిమ మెడికల్ కాలేజీ, మానకొండూరు వరకు విస్తరణ
  • పేదల సంక్షేమం.. ప్రయాణికుల సౌకర్యమే ప్రభుత్వ లక్ష్యం
  • సిటీ బస్సులను విద్యార్థులు మహిళలు ప్రజలు విస్తృతంగా వినియోగించుకోవాలి..
  • రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్, వెలుతురు జూలై 30:

“ఆర్‌టీసీ పేద ప్రజల గుండె చప్పుడు.. లైఫ్‌లైన్. కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం” అని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. కరీంనగర్ నగర ప్రజలకు ఆధునిక, సౌకర్యవంతమైన ప్రజా రవాణా సేవలు అందించాలనే లక్ష్యంతో గురువారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ బస్ స్టేషన్‌లో సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీసులను మంత్రి ఘనంగా ప్రారంభించారు. అనంతరం కరీంనగర్ బస్ స్టేషన్ నుంచి వాగేశ్వరి కాలేజీ వరకు సిటీ బస్సులో ప్రయాణించి ప్రయాణికులతో మమేకమయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కరీంనగర్ నగరంలో ఎన్నో ఏళ్లుగా ఉన్న సిటీ బస్సుల డిమాండ్‌ను నెరవేర్చామని తెలిపారు. మొదటి దశలో కరీంనగర్–వాగేశ్వరి కాలేజీ, కరీంనగర్–చింతకుంట, కరీంనగర్–కొత్తపల్లి హవేలీ రూట్లలో సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులను ప్రారంభించామని, పెరుగుతున్న నగర అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు ఈ సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని కోరారు. ప్రతిరోజూ ఉపాధి కోసం చింతకుంట, ఓద్యారం, కొత్తపల్లి ప్రాంతాల నుంచి కరీంనగర్‌కు వచ్చే కార్మికులు, ఉద్యోగులు, అలాగే వాగేశ్వరి, ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల విద్యార్థులకు ఈ బస్సులు ఎంతో ఉపయోగపడతాయని మంత్రి తెలిపారు. భవిష్యత్తులో చల్మెడ, ప్రతిమ మెడికల్ కాలేజీ, మానకొండూరు వరకు కూడా సిటీ బస్సు సేవలను విస్తరిస్తామని ప్రకటించారు.

ప్రయాణికుల ఆదరణను బట్టి అవసరమైతే ఒకే రూట్‌లో అదనపు బస్సులు నడపడంతో పాటు, 24 గంటల సేవలు అందించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నగరంలోని అన్ని ప్రాంతాలకు దశలవారీగా సిటీ బస్సు సేవలను విస్తరించనున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేశామని, ఆర్‌టీసీ అభివృద్ధికి అనేక సంస్కరణలు చేపట్టామని మంత్రి పేర్కొన్నారు. కొత్త బస్సుల కొనుగోలు, కొత్త నియామకాలు, కారుణ్య నియామకాలు, కార్మికుల పెండింగ్ బకాయిల చెల్లింపు, ఉద్యోగుల సంక్షేమం వంటి చర్యలతో సంస్థను బలోపేతం చేశామని చెప్పారు.

ప్రస్తుతం ఆర్‌టీసీ బస్సులు ప్రతిరోజూ 35 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తూ 65 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తున్నాయని, ప్రతి గ్రామానికి ఆర్‌టీసీ సేవలు చేరేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. డ్రైవర్లు, కండక్టర్లు అంకితభావంతో పనిచేస్తూ సంస్థ అభివృద్ధికి వెన్నెముకగా నిలుస్తున్నారని కొనియాడారు.

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ కరీంనగర్ నగర ప్రజలు సిటీ బస్సులను విస్తృతంగా వినియోగించుకోవాలని కోరారు. ఎన్నో ఏళ్ల డిమాండ్‌కు స్పందించి సిటీ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్‌టీసీ ఎండీ నాగిరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆదరణతోనే ఆర్‌టీసీ మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు.

మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్‌టీసీసంస్థలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో ప్రజలకు చేరువయ్యే రవాణా సేవలు అందుబాటులోకి వస్తున్నాయని పేర్కొన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల వరకు సిటీ బస్సులు ఏర్పాటు చేయడం హర్షణీయమని, తమ విజ్ఞప్తికి వెంటనే స్పందించిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్‌టీసీ ఎండీ నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, మేయర్ కొలగాని శ్రీనివాస్ మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆర్టిఏ మెంబర్ పడాల రాహుల్, కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న, కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పగిడిమర్రి సోలమన్, హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఐటీ, పి, ఏఎమ్ & లీగల్) కె. రాజశేఖర్ రీజినల్ మేనేజర్ బి రాజు, డిప్యూటీ రీజనల్ మేనేజర్ (ఆపరేషన్స్) ఎస్. భూపతిరెడ్డి, డిప్యూటీ రీజనల్ మేనేజర్ (మెకానికల్) పి. మల్లేశం, కరీంనగర్ జోన్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి బావ్ రావు, విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ రవీందర్, డిపో మేనేజర్లు ఐ. విజయమాధురి (కరీంనగర్-1), ఎం. శ్రీనివాస్ (కరీంనగర్-2), ఎ. ప్రకాశ్‌రావు (సిరిసిల్ల), బి. శ్రీనివాస్ (వేములవాడ), ఎన్. రమేశ్ (జగిత్యాల), డి. హరి (మెట్‌పల్లి)తో పాటు ఆర్‌టీసీ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.