బీజేపీ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తోంది: మహేష్ కుమార్ గౌడ్

  • గాడ్సే భావజాలాన్ని ప్రోత్సహిస్తున్నారని విమర్శ
  • తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని వ్యాఖ్య

హైదరాబాద్ వెలుతురు జూన్ 20:టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గాంధీభవన్‌లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ రఘుపతి రాఘవ రాజారాం భావజాలాన్ని మరిచిపోయి గాడ్సే భావజాలాన్ని ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. దేశంలో గాడ్సే రాజ్యాన్ని స్థాపించాలనే వ్యూహంతో బీజేపీ ముందుకు సాగుతోందని, అధికారంలో శాశ్వతంగా ఉండేందుకు ప్రజాస్వామ్య వ్యవస్థలను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తోందని అన్నారు.

ప్రాంతీయ పార్టీలను చీల్చడం, రాజ్యాంగ సంస్థలను తమకు అనుకూలంగా వినియోగించుకోవడం బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని విమర్శించారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఉన్న ఉద్యోగాలనే తొలగించారని, దేశ సంపద కొద్ది మంది అనుకూల వర్గాల చేతుల్లో కేంద్రీకృతమైందని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తులు విశ్వవిద్యాలయాల్లోకి చొరబడి విద్యా వ్యవస్థను దెబ్బతీస్తున్నారని అన్నారు.

చైనా సరిహద్దు అంశంపై కేంద్రం మౌనం పాటిస్తోందని, ఈ విషయాన్ని లోక్‌సభలో రాహుల్ గాంధీ ఆధారాలతో ప్రస్తావించారని చెప్పారు. నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలపై అసత్య ప్రచారం చేస్తున్నారని, దేశం కోసం గాంధీ కుటుంబం త్యాగాలు చేసిందని పేర్కొన్నారు.

మీనాక్షి వ్యవహారంలో బీజేపీ దుర్మార్గంగా వ్యవహరించిందని ఆరోపించిన ఆయన, కేసు లేకుండానే నామినేషన్ తిరస్కరించిన ఎన్నికల అధికారిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జార్ఖండ్‌లో మాత్రం సరైన పత్రాలు లేకున్నా మరో అభ్యర్థికి అవకాశం కల్పించారని విమర్శించారు.

దేవుడి పేరును ఉపయోగించకుండా బీజేపీ ఎన్నికల్లో గెలిచే ధైర్యం ఉందా అని ప్రశ్నించిన మహేష్ కుమార్ గౌడ్.. పవన్ కళ్యాణ్‌ను బూచిగా చూపిస్తూ తెలంగాణలో పాగా వేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని, మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే లౌకికవాద భావాలు కలిగిన ఓటర్ల పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు

Leave A Reply

Your email address will not be published.