- మీడియా సమావేశంలో ప్రభుత్వంపై విమర్శలు
- ఓయూ హాస్టళ్ల పరిస్థితి అత్యంత దారుణమన్న రామచందర్ రావు
- బి హాస్టల్ మూసివేత.. డి, ఈ హాస్టళ్లు ప్రమాద అంచున
- వెంటనే పునర్నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్
- రూ.1000 కోట్ల హామీని అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
హైదరాబాద్ వెలుతురు జూన్ 20:ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి రూ.1000 కోట్లు కేటాయిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ప్రశ్నించారు. శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హామీ ఇచ్చి చాలా కాలం గడిచినా నిధుల విడుదల, అభివృద్ధి పనుల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదని విమర్శించారు.
రాష్ట్రంలో అత్యంత ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థగా ఉన్న ఉస్మానియా యూనివర్సిటీలో ప్రాథమిక వసతులు దారుణంగా ఉన్నాయని ఆయన అన్నారు. ముఖ్యంగా హాస్టళ్ల పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారిందని పేర్కొన్నారు. ఇప్పటికే బి హాస్టల్‌ను మూసివేశారని, డి, ఈ హాస్టళ్లు కూడా మూసివేత అంచున ఉన్నాయని చెప్పారు.
శిథిలావస్థకు చేరిన హాస్టల్ భవనాల్లో విద్యార్థులు ప్రాణాలను పణంగా పెట్టి ఉంటున్నారని రామచందర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలంలో పైకప్పుల నుంచి నీరు కారడం, గోడల్లో పగుళ్లు, పారిశుద్ధ్య సమస్యలు విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని అన్నారు.
