నోరు అదుపులో పెట్టుకో కేటీఆర్‌

  • ప్ర‌జా ప‌రీక్ష‌లో పాసైన లీడ‌ర్ రేవంత్‌రెడ్డి
  • ముఖ్యమంత్రిని విమ‌ర్శించే నైతిక హ‌క్కు బీఆర్ఎస్‌కు లేదు
  • ఇంజ‌నీర్ల‌పై బీఆర్ఎస్‌ది ముమ్మాటికీ స‌వ‌తి ప్రేమే..
  • గ‌తంలో 709 మందిని ఎలా తొల‌గించారో సమాధానం చెప్పు.?
  • కేటీఆర్‌పై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత ఇందిరాశోభ‌న్ ఫైర్‌

హైదరాబాద్ వెలుతురు ఆగస్టు 03:

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత ఇందిరాశోభ‌న్ తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు కంటే పెద్ద పోటీ పరీక్ష మరొకటి లేదని.. రేవంత్ రెడ్డి గ‌త రెండు ద‌శాబ్దాలుగా ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యున్నతమైన “ప్రజాక్షేత్రం అనే పరీక్ష”లో పదేపదే ఉత్తీర్ణులవుతూ వ‌స్తున్నార‌న్నారు. జడ్పీటీసీ స్థాయి నుంచి ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, ప్రస్తుతం తెలంగాణ‌ ముఖ్యమంత్రిగా ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్న గొప్ప నాయకుడని ఆమె కొనియాడారు. తండ్రి చాటున‌ రాజకీయాల్లోకి వచ్చిన కేటీఆర్‌కు, ప్రజల మధ్య ఉండి రాసే “ప్రజా పరీక్ష” విలువ తెలియదంటూ ఇందిరాశోభ‌న్‌ చుర‌క‌లంటించారు.

పరీక్ష ఫారాలు నింపడం, విదేశీ డిగ్రీలు ఉండ‌టం మాత్ర‌మే అర్హ‌త‌ని బీఆర్ఎస్ నాయ‌కుల “ఎలైటిస్ట్ (దొర‌ల) మ‌న‌స్థ‌త్వానికి” నిద‌ర్శ‌మ‌ని ఆమె మండిప‌డ్డారు. చ‌దువుకున్న‌ ప్రతి నిరుద్యోగి కష్టాన్ని గుర్తించే మనసు ఉండాలి కానీ, ఇత‌రుల విద్యాభ్యాసాన్ని చుల‌క‌న చేసి మాట్లాడ‌టం అంటే గ్రామీణ, సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన నాయకులను అవమానించినట్లేనని ఇందిరాశోభ‌న్‌ వ్యాఖ్యానించారు. డిగ్రీలు చూపిస్తూ రాజకీయాలు చేయడం కాదు, ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుని వారి కోసం పనిచేయడం నాయకత్వానికి అసలైన ప్రమాణమ‌న్నారు. త‌మ‌కు ఫారాలు నింపడం వ‌చ్చు.. నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపడం కూడా వ‌చ్చ‌ని, అందుకు అనుగుణంగానే బీఆర్ఎస్ హయాంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను సీఏం రేవంత్‌రెడ్డి సార‌థ్యంలోని కాంగ్రెస్ ప్ర‌జా ప్రభుత్వం భర్తీ చేస్తోందని ఇందిరాశోభ‌న్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప‌దేళ్ల కాలంలో 1.11 ల‌క్ష‌ల ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తే.. ఎలాంటి లీకుల‌కు తావులేకుండా కేవ‌లం రెండున్న‌రేళ్ల ప్ర‌జా పాల‌న‌లో దాదాపు ల‌క్ష ఉద్యోగాలను పార‌ద‌ర్శంగా భ‌ర్తీ చేశామ‌ని గుర్తుచేశారు.

టీఎస్‌పీఎస్సీ పరీక్షల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పేపర్ లీకులు లక్షలాది మంది నిరుద్యోగ యువత భవిష్యత్తును దెబ్బతీశాయని ఇందిరాశోభన్ ఆరోపించారు. పదేళ్ల పాలనలో పరీక్షలు రద్దవడం, అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడటం బీఆర్ఎస్ వైఫల్యానికి నిదర్శనమన్నారు. నిజంగా కేటీఆర్‌కు ఇంజ‌నీర్ల‌పై చిత్త‌శుద్ధి ఉంటే 2020 జులైలో 709 మంది మిష‌న్ భ‌గీర‌థ ఉద్యోగుల‌ను ఎలాంటి నోటీసులు, జీత‌భ‌త్యాలు చెల్లించ‌కుండా ఎందుకు తొల‌గించారో సమాధానం చెప్పాల‌న్నారు. ఇంజ‌నీర్ల‌పై మీ స‌వ‌తి త‌ల్లి ప్రేమేంటో ఈ ఘ‌ట‌న‌తో అర్థ‌మ‌వుతుంద‌ని ఎద్దేవా చేశారు. తెలంగాణ యువ‌త స్కిల్డ్ వైపు వెళ్లాల‌ని, నాణ్య‌మైన విద్య‌ను అందిపుచ్చుకోవాల‌ని స‌దుద్దేశంతో ముఖ్య‌మంత్రి తండ్రిలాగా చెప్పిన మాట‌ల‌ను కూడా వ‌క్రీక‌రించి.. కేటీఆర్ రాజ‌కీయ పైశాచిక ఆనందం పొంద‌డం సిగ్గుచేట‌న్నారు.

రాజకీయాల్లో డిగ్రీల సర్టిఫికెట్లు కాదు… ప్రజలకు చేసిన సేవ, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే అసలైన సర్టిఫికేట్ అని, అది రేవంత్ రెడ్డి ఎప్పుడో సాధించార‌న్నారు. పదేళ్లు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న వారికి, ఇప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్న ముఖ్య‌మంత్రిని ప్రశ్నించే నైతిక హక్కు ఎక్క‌డిద‌ని ఆమె ప్ర‌శ్నించారు. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాల‌ని.. మ‌రోసారి రేవంత్‌రెడ్డి గురించి నోటికొచ్చిన‌ట్లు మాట్లాడితే ప్ర‌జాక్షేతంలోనే త‌గిన గుణ‌పాఠం చెబుతామ‌ని ఇందిరాశోభ‌న్‌ హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.