నిమ్స్ ఆస్పత్రిలో కొత్త చరిత్ర

  • వెయ్యి రొబోటిక్ ఆప‌రేష‌న్స్‌ విజయవంతం
  • రెండున్నరేళ్లలో వెయ్యి రొబోటిక్ సర్జరీల ఘనత
  • సామాన్యులకు అత్యాధునిక వైద్య సేవలు
  • ప్రజా ప్రభుత్వ సంకల్పం నెరవేరిందన్న సీఎం
  • 90 శాతానికి పైగా ఉచిత చికిత్సలు
  • ఆరోగ్యశ్రీ, సీఎంఆర్‌ఎఫ్ ద్వారా పేదలకు పెద్ద దిక్కు
  • రెండు వేల కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల రికార్డు
  • నిమ్స్ ఖాతాలో మరో అరుదైన మైలురాయి
  • నిమ్స్ డైరెక్టర్ రాహుల్ దేవరాజ్‌కు సీఎం రేవంత్‌, మంత్రి దామోదర అభినందనలు

హైదరాబాద్, వెలుతురు, ఆగష్టు 03:

తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ ప్రభుత్వ బోధనాసుపత్రి నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) వైద్య రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. గత రెండున్నరేళ్ల స్వల్ప వ్యవధిలోనే ఏకంగా 1,000 రొబోటిక్ శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసి అరుదైన ఘనత సాధించింది. ప్రభుత్వ రంగంలో అత్యంత క్లిష్టమైన, అత్యాధునిక రొబోటిక్ సర్జరీలను ఈ స్థాయిలో నిర్వహించి పేద రోగులకు అందించడం పట్ల రాష్ట్ర సర్కారు హర్షం వ్యక్తం చేసింది.ఈ గొప్ప విజయం సాధించిన సందర్భంగా నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్‌తో పాటు దీని వెనుక శ్రమించిన ప్రత్యేక వైద్య నిపుణుల బృందాన్ని, నర్సింగ్ సిబ్బందిని, ఆపరేషన్ థియేటర్ టీమ్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా అత్యంత విలువైన, అత్యాధునిక వైద్య సేవలను సామాన్య ప్రజలకు ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలనే తమ ప్రజా ప్రభుత్వ సంకల్పం ఈ ఫలితంతో నెరవేరిందని సీఎం సంతోషం వ్యక్తం చేశారు.

నిమ్స్‌లో ఇప్పటివరకు నిర్వహించిన ఈ వెయ్యి రొబోటిక్ సర్జరీల్లో దాదాపు 90 శాతానికి పైగా చికిత్సలను ‘ఆరోగ్యశ్రీ’,   ‘ముఖ్యమంత్రి సహాయ నిధి’ (సీఎంఆర్‌ఎఫ్) ద్వారా ఉచితంగా అందించడం అత్యంత ప్రశంసనీయమైన విషయమని ముఖ్యమంత్రి కొనియాడారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో లక్షలాది రూపాయలు ఖర్చయ్యే ఈ చికిత్సలను పేదలకు ఉచితంగా అందించి వారి ప్రాణాలను కాపాడారని తెలిపారు.ఇటీవలే నిమ్స్ ఆస్పత్రి విజయవంతంగా 2,000 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను పూర్తి చేసి రికార్డు సృష్టించగా, ఇప్పుడు దానికి కొనసాగింపుగా వెయ్యి రొబోటిక్ సర్జరీల మైలురాయిని అధిగమించిందని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. ఈ విధంగా ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతూ, వైద్య రంగంలో నిమ్స్ సంస్థ మరిన్ని కొత్త మైలురాళ్లు దాటాలని, మున్ముందు అనేక రికార్డులు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

మరోవైపు, తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కూడా నిమ్స్ వైద్య బృందాన్ని అభినందించారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో నిమ్స్ డైరెక్టర్, సర్జన్ల బృందం మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని శాలువాతో సత్కరించి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రులు సాంకేతికంగా ఏమాత్రం వెనుకబడి లేవని, నిమ్స్ సాధించిన ఈ ఘనతే దానికి నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు.దక్షిణ భారతదేశంలోనే ప్రభుత్వ రంగంలో తొలిసారిగా రొబోటిక్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ (మూత్రపిండ మార్పిడి) నిర్వహించిన ఘనత నిమ్స్ ఆస్పత్రికే దక్కుతుందని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. నిమ్స్‌లో నిర్వహించిన ఈ వెయ్యి రొబోటిక్ సర్జరీల విశ్లేషణను చూస్తే.. యూరాలజీ విభాగంలో 590, గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగంలో 248, అలాగే ఆంకాలజీ (క్యాన్సర్) విభాగంలో 162 శస్త్రచికిత్సలు విజయవంతంగా జరిగాయని వివరించారు.

కేవలం నిమ్స్‌కే పరిమితం కాకుండా ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలోనూ రొబోటిక్ సర్జరీలు విజయవంతంగా సాగుతున్నాయని మంత్రి తెలిపారు. రాబోయే రోజుల్లో పేద ప్రజలకు అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని ఇతర ప్రధాన ఆస్పత్రులైన గాంధీ, ఉస్మానియా, నూతనంగా నిర్మిస్తున్న టిమ్స్ ఆస్పత్రుల్లో కూడా అత్యాధునిక రొబోటిక్ ఆపరేషన్ థియేటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.తెలంగాణలోని ప్రతి నిరుపేద కుటుంబానికి ఉచితంగా ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తేవడమే తమ ప్రభుత్వ ప్రాథమిక ధ్యేయమని మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. అధునాతన సాంకేతికతను ప్రభుత్వ వైద్యంలోకి పెద్దపీట వేస్తూ, మౌలిక వసతులను మరింత విస్తరిస్తామని భరోసా ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.