ఆదర్శ రాజకీయ నాయకుడు కొణిజేటి రోశయ్య

హైదరాబాద్, వెలుతురు జూలై 4:

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత కొణిజేటి రోశయ్య నేటి తరానికి ఆదర్శప్రాయుడైన రాజకీయ నాయకుడని రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీలు, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి   కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలోని సాంస్కృతిక శాఖ, కొణిజేటి రోశయ్య మెమోరియల్ ట్రస్ట్ సంయుక్తంగా రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన రోశయ్య 93వ జయంతి సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరైన మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రోశయ్య రాజకీయాల్లో నిజాయితీ, నిబద్ధత, విలువలకు ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు. ఐదు దశాబ్దాలకు పైగా ప్రజా జీవితంలో సేవలందించిన ఆయన శాసనసభ్యుడు, శాసన మండలి సభ్యుడు, ఆర్థిక శాఖ మంత్రి, ముఖ్యమంత్రి, అనంతరం తమిళనాడు గవర్నర్‌గా అనేక కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారని కొనియాడారు. ఆర్థిక వ్యవహారాలపై ఆయనకున్న అపారమైన పట్టు, ప్రజాధనాన్ని అత్యంత బాధ్యతాయుతంగా వినియోగించాలనే దృక్పథం ఆయనను దేశంలోనే విశిష్ట నాయకుడిగా నిలబెట్టిందన్నారు. రాజకీయ భేదాలకు అతీతంగా అందరి గౌరవాన్ని సంపాదించిన అరుదైన నాయకుడు రోశయ్య గారేనని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర పరిపాలనను సమర్థవంతంగా నిర్వహించి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నారని, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ హుందాతనం, సంయమనం, బాధ్యతతో వ్యవహరించడం ఆయన నాయకత్వానికి నిదర్శనమని మంత్రి అన్నారు. నేటి రాజకీయ నాయకులు, యువత రోశయ్య గారి నిరాడంబర జీవనశైలి, ప్రజాసేవ పట్ల అంకితభావం, విలువలతో కూడిన రాజకీయాలను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

వ్యక్తిగతంగా రోశయ్య గారితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్, తాను ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తన రాజకీయ గురువు చొక్కారావు గారితో కలిసి అనేకసార్లు రోశయ్య గారిని కలిసే అవకాశం లభించిందన్నారు. ఆ సమయంలో రోశయ్య పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించారని, తాను ఎంపీగా ఉన్న కాలంలో ఆయన ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి నాయకత్వం వహించారని తెలిపారు. అలాగే ఆయన తమిళనాడు గవర్నర్‌గా ఉన్న సమయంలోనూ, వివిధ హోదాల్లో ఉన్న సమయంలోనూ కలిసి పనిచేసే అవకాశం తనకు దక్కిందని పేర్కొన్నారు. “ఆర్థిక క్రమశిక్షణ అంటే రోశయ్య గారి జీవితమే నిదర్శనం. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఆర్థిక క్రమశిక్షణ అత్యంత కీలకం. రోశయ్య గారి విలువలు, క్రమశిక్షణ, ప్రజాసేవను ఆదర్శంగా తీసుకుంటే ప్రతి ఒక్కరూ జీవితంలో విజయం సాధించగలరు” అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ రోశయ్యతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. “తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రోశయ్య ప్రతిపక్ష నేతగా అత్యంత కీలక పాత్ర పోషించారు. బడ్జెట్ ప్రతిపాదనలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేవారు. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా, రాష్ట్రాన్ని ఆర్థికంగా ఎలా ముందుకు తీసుకెళ్లాలో ప్రభుత్వానికి విలువైన సలహాలు ఇచ్చేవారు” అని పేర్కొన్నారు. ఆర్థిక మంత్రిగా రాష్ట్ర ప్రాధాన్యతలు, సంక్షేమం, అభివృద్ధిపై ఆయనకు స్పష్టమైన దార్శనికత ఉండేదన్నారు.

తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో పొన్నం ప్రభాకర్, తాను తెలంగాణ కోసం పోరాడుతుంటే, రోశయ్య ఎంతో హుందాగా సలహాలు ఇచ్చేవారని మంత్రి గుర్తుచేసుకున్నారు. “తెలంగాణ కోసం కొట్లాడండి.. కానీ రెండు ప్రాంతాలకూ న్యాయం జరిగేలా ఆలోచించాలని చెప్పేవారు” అన్నారు. జైపూర్ పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవ సమయంలో తీవ్ర నిరసనలు వ్యక్తమైనప్పటికీ.. ‘ఇది అభివృద్ధి కార్యక్రమం, ఎవరికీ వ్యతిరేకం కాదు’ అని ఫోన్ చేసి మరీ చెప్పి, కార్యక్రమానికి హాజరై అందరినీ అభినందించిన గొప్ప సంస్కారం ఆయనదని కొనియాడారు.

పరిపాలనలో రోశయ్య సరికొత్త ప్రమాణాలు నెలకొల్పారని మంత్రి వివేక్ అన్నారు. రాత్రి వేళల్లోనూ సెక్రటేరియట్‌లో కూర్చుని ఫైళ్లను క్లియర్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి రోశయ్య గారేనని కొనియాడారు. ఎప్పుడూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఫైలును పూర్తిగా చదివి, ఏది రైటు, ఏది రాంగు, దీనివల్ల ప్రజలకు మేలు జరుగుతుందా లేదా అని ఆలోచించిన తర్వాతే సంతకం చేసేవారని గుర్తుచేశారు.

రోశయ్య గారితో తమ కుటుంబానికి దశాబ్దాల అనుబంధం ఉందని అన్నారు. “మా నాన్నగారితో రోశయ్య గారికి ఎంతో సన్నిహిత సంబంధం ఉండేది. ఒక ముఖ్యమంత్రిగానో, మంత్రిగానో కాకుండా.. నన్ను, వినోద్ గారిని ఎంతో ఆప్యాయంగా చూసేవారు. నాన్నగారిపై చూపించిన ప్రేమనే మాపైనా కురిపించారు. ఆయన చూపిన ప్రేమాభిమానాలకు మేము ఎల్లప్పుడూ కృతజ్ఞులం” అని అన్నారు. ఇంతటి మహోన్నత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకు, రోశయ్య గారి కుటుంబ సభ్యులకు మంత్రి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రముఖ ప్రవచనకర్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత గరికపాటి నరసింహారావు ను రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి ఘనంగా సత్కరించారు. అనంతరం కేఎస్‌ఆర్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ లోగోను మంత్రులు ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్య, ఎమ్మెల్యే వినోద్, మాజీ మంత్రి టీ.జీ. వెంకటేష్, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, వైశ్య కార్పొరేషన్ చైర్‌పర్సన్ కాల్వ సుజాత, ఐఏఎస్ అధికారి శ్రీమతి వాణి ప్రసాద్, రోశయ్య మెమోరియల్ ట్రస్ట్ ప్రతినిధులు, సాంస్కృతిక శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.