- మిడ్జిల్ ప్రజలే నా రాజకీయ జీవితానికి పునాది అన్న ముఖ్యమంత్రి
- వచ్చిన అవకాశాన్ని ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదని స్పష్టం
- ప్రతిపక్షంలో ప్రజల గొంతుగా.. అధికారంలో సమస్యల పరిష్కారమే లక్ష్యమని వ్యాఖ్య
- 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం సందర్భంగా మిడ్జిల్‌లో కృతజ్ఞత సభ
- మిడ్జిల్‌ను దత్తత తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు విజ్ఞప్తి
- డార్క్ ఏరియాగా ఉన్న మిడ్జిల్‌ను అభివృద్ధి మండలంగా తీర్చిదిద్దుతామని హామీ
- ఎస్సీ ఉపవర్గీకరణ, బీసీ కులగణనతో చారిత్రక నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడి
- గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయని వ్యాఖ్య
- పాలమూరు అభివృద్ధికి జీవితాంతం కృషి చేస్తానన్న సీఎం
మిడ్జిల్ వెలుతురు జూలై 04:
గడిచిన 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదని, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలపై ప్రశ్నించే గొంతుగా పోరాడానని, అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమంతో పాటు అభివృద్ధి, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యం ఇచ్చానని పేర్కొన్నారు.
తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమై 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నాగర్‌కర్నూల్ జిల్లా మిడ్జిల్‌లో నిర్వహించిన కృతజ్ఞత సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. అంతకుముందు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
2006 జూలై 4న జడ్పీటీసీగా తన విజయం వ్యక్తిగత గెలుపు కాదని, మిడ్జిల్ ప్రజల విజయం అని రేవంత్‌రెడ్డి అన్నారు. ఆనాడు మిడ్జిల్ ప్రజలు నాటిన మొక్కే నేడు మహావృక్షంగా ఎదిగిందని వ్యాఖ్యానించారు. మిడ్జిల్ ప్రజలు తనను పెంచి పోషించారని, ఆ ఋణం తీర్చుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు.
మిడ్జిల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన మండలంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. గతంలో డార్క్ ఏరియాగా గుర్తింపు పొందిన ఈ మండలం ఇకపై వెలుగు నిండిన అభివృద్ధి ప్రాంతంగా ప్రభుత్వ రికార్డుల్లో నిలవాలని అన్నారు. ఈ లక్ష్యంతో మిడ్జిల్ మండలాన్ని దత్తత తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కోరారు.
హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు, మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, మహేంద్రనాథ్, ద్యాప గోపాల్‌రెడ్డి వంటి మహానేతలను ఈ ప్రాంతం దేశానికి అందించిందని సీఎం గుర్తు చేశారు. వారి స్ఫూర్తితోనే ప్రజాసేవలో ముందుకు సాగుతున్నానన్నారు.
జడ్పీటీసీగా పనిచేసిన రోజుల్లో చాలా గ్రామాలకు రోడ్లు, తాగునీరు, సాగునీరు, విద్య, వైద్య సదుపాయాలు కూడా లేవని గుర్తుచేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో మిడ్జిల్, గద్వాల్‌లోని గట్టు మండలాలను డార్క్ ఏరియాలుగా ప్రకటించిన పరిస్థితి ఉండేదని తెలిపారు.
ముఖ్యమంత్రిగా అవకాశం రావడంతో నాలుగు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ ఉపకులాల వర్గీకరణ సమస్యను పరిష్కరించామని, వందేళ్లుగా జరగని బీసీ కులగణనను చేపట్టి చరిత్ర సృష్టించామని చెప్పారు. లెక్కలు తేల్చడమే కాకుండా వారి వాటా వారికి దక్కేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
తాను గ్రామంలో పుట్టి పెరిగిన వ్యక్తినని, రైతు కష్టాలు, పేదవాడి జీవితం, వ్యవసాయం అన్నీ ప్రత్యక్షంగా తెలుసని సీఎం చెప్పారు. భూమికి విత్తనానికి ఉన్న బంధం ఎంత గొప్పదో, పాలకుడికి ప్రజలతో ఉండాల్సిన అనుబంధం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు.
గ్రామాలు అభివృద్ధి చెందితేనే మండలం, జిల్లా, రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయని రేవంత్‌రెడ్డి అన్నారు. మిడ్జిల్ ప్రజలు తనకు ఎంతో ఇచ్చారని, ఈ మండలానికి ఏమిచ్చినా తక్కువేనని చెప్పారు. వలసల పాలమూరును అభివృద్ధి పథంలో నడిపించడం తన బాధ్యత అని, అవసరమైతే ప్రాణాలైనా అర్పిస్తానని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
