యజ్ఞంలా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం: మంత్రి వాకిటి శ్రీహరి

  • పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం 
  • షాద్‌నగర్‌ నియోజకవర్గంలోని అన్నారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం
  • ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌తో కలిసి ఇళ్లను ప్రారంభించిన మంత్రి వాకిటి శ్రీహరి
  • బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికే కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి
  • ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం, ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ పథకాలను ప్రస్తావించిన మంత్రి
  • ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపణ

షాద్‌నగర్‌ వెలుతురు జూలై 05:

షాద్‌నగర్‌ నియోజకవర్గం ఫరూక్‌నగర్‌ మండలం అన్నారం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను రాష్ట్ర క్రీడలు, పాడి పరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన బంజారా మహిళలు మంత్రికి ఘన స్వాగతం పలికారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి వాకిటి శ్రీహరి.. ప్రజా ప్రభుత్వం బీద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేస్తోందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం యజ్ఞంలా చేపట్టిందని చెప్పారు.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అర్హులైన లబ్ధిదారులకు మళ్లీ ఇందిరమ్మ ఇళ్లను అందిస్తున్నారని మంత్రి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లతో పాటు రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు.

షాద్‌నగర్‌కు వచ్చిన ప్రతీసారి కొత్త అనుభూతి కలుగుతుందని మంత్రి అన్నారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రజల కోసం, షాద్‌నగర్ అభివృద్ధి కోసం నిరంతరం ఆలోచిస్తున్నారని కొనియాడారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ భూసేకరణ కోసం ఎమ్మెల్యే విశేషంగా కృషి చేస్తున్నారని తెలిపారు.

గత పాలకులు ఈ ప్రాంత అభివృద్ధిని పట్టించుకోలేదని ఆరోపించిన మంత్రి.. పేదల గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు. తాము చేసిన మంచి పనులే శాశ్వతంగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపిస్తూ, యువకులు, మేధావులు ఆలోచించి అలాంటి కుట్రలను తిప్పికొట్టాలని మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.