- కాంగ్రెస్ అండతోనే ఒవైసీ బరితెగిస్తున్నారని విమర్శ
- ఫాతిమా విద్యాసంస్థలపై చర్యలు ఎందుకు లేవని ప్రశ్న
- హైకోర్టు ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్
- ఎఫ్‌టీఎల్ ఆక్రమణలపై ఒకే విధమైన చర్యలు తీసుకోవాలన్నారు
- విద్యార్థులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని హామీ
హైదరాబాద్ వెలుతురు జూలై 05:
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ మద్దతుతోనే ఒవైసీ బరితెగించి మాట్లాడుతున్నారని, హైకోర్టునే ప్రశ్నించేలా, బెదిరించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. కోర్టులు, చట్టాల పట్ల ఎంఐఎంకు గౌరవం లేదని విమర్శించారు.
ఒవైసీ ఆధ్వర్యంలోని ఫాతిమా విద్యాసంస్థలపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. హైకోర్టు లేవనెత్తిన ప్రశ్నలకు స్పష్టమైన వివరణ ఇవ్వకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోందని అన్నారు. చెరువును ఆక్రమించి విద్యాసంస్థలను నిర్మించడమే తప్పని పేర్కొన్నారు.
గండిపేటలో ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న ఇతర విద్యాసంస్థలకు వరుసగా నోటీసులు జారీ చేస్తున్న ప్రభుత్వం.. ఫాతిమా విద్యాసంస్థల విషయంలో మాత్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. ఒవైసీకి ఒక న్యాయం, ఇతరులకు మరో న్యాయమా అని ప్రశ్నించారు.
ఫాతిమా విద్యాసంస్థ మిలిటెంట్లకు ఆశ్రయం కల్పించిందనే ఆరోపణలను కూడా బండి సంజయ్ ప్రస్తావించారు. విద్యార్థులకు చదువు ముసుగులో మిలిటెంట్లను తయారు చేస్తున్నారా అని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఫాతిమా విద్యాసంస్థలపై చట్టప్రకారం చర్యలు తీసుకుని అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని స్పష్టం చేశారు. అక్కడ చదువుతున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. అక్రమార్కులు, అవినీతిపరులకు భయమంటే ఏమిటో చూపిస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు.
