హైదరాబాద్, వెలుతురు జూలై 06:
రవీంద్రభారతిలోని పాల్కురికి సోమన మూల వేదికగా భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ ప్రజాకళ 99 రోజుల సాంస్కృతిక మహోత్సవంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా మారుతి బృందం ప్రదర్శించిన వాఘె ఆదివాసీ జానపద కళారూపం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
ఆదిలాబాద్ గిరిజనుల జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలు, ప్రకృతి ఆరాధనను ప్రతిబింబించే గోండు భాషా జానపద గీతాలు, డప్పు, డోలక్, బోండ్కా వంటి సంప్రదాయ వాద్యాల మేళవింపుతో అద్భుతంగా వినిపించాయి. రంగురంగుల సంప్రదాయ వస్త్రధారణ, ప్రత్యేక ఆహార్యం, ఉత్సాహభరితమైన నృత్య విన్యాసాలు ప్రేక్షకులను ఆద్యంతం అలరించి, గిరిజన సంస్కృతికి అద్దం పట్టాయి. ఈ ప్రదర్శనలో డప్పుపై విఠల్ ఆజిక్, బోండ్కాపై రాందాస్, డోలక్‌పై ఖండు గైక్వాడ్ తమ అద్భుతమైన వాద్య సహకారంతో కార్యక్రమానికి మరింత శోభను చేకూర్చారు.
ఈ సందర్భంగా భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. ఏనుగు నర్సింహా రెడ్డి ఐఏఎస్, సహాయ సంచాలకులు పి. నర్సింలు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డా. పి. విజయ్ కుమార్ కళాకారులను ఘనంగా సత్కరించి అభినందించారు.
