- జులై 12 నుంచి ఆగస్టు 4 మధ్య ‘మిషన్ ఆగమన్’ నిర్వహణ
- సీవీ రామన్, విక్రమ్ సారాభాయ్, అబ్దుల్ కలాం సూక్ష్మ చిత్రాలు అంతరిక్షంలోకి
- 18 క్యారెట్ల బంగారంతో మైక్రో రాకెట్ రూపొందించిన కళాకారుడు అజయ్ కుమార్
- బియ్యం గింజ కంటే చిన్న పరిమాణంలో శాస్త్రవేత్తల చిత్రాలు
- కాస్మోస్ డైమండ్స్ రూపొందించిన ‘కాస్మిక్ బ్లూమ్’ ఆర్ట్‌వర్క్ కూడా పేలోడ్‌లో చోటు
- 2022లో విక్రమ్-ఎస్‌తో చరిత్ర సృష్టించిన స్కైరూట్
- ఇప్పుడు తొలి ప్రైవేట్ ఆర్బిటల్ ప్రయోగానికి సిద్ధమైన సంస్థ
- శ్రీహరికోటలోని షార్ ఫస్ట్ లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగం
- భారత ప్రైవేట్ అంతరిక్ష రంగానికి కొత్త అధ్యాయంగా ‘మిషన్ ఆగమన్’
శ్రీహరికోట వెలుతురు జూలై 06:
దేశంలోనే తొలిసారిగా ప్రైవేట్‌గా అభివృద్ధి చేసిన ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 తొలి ప్రయోగానికి రంగం సిద్ధమైంది. ‘మిషన్ ఆగమన్’ పేరుతో ఈ ప్రయోగాన్ని జులై 12 నుంచి ఆగస్టు 4 మధ్య నిర్వహించనున్నట్లు స్కైరూట్ ఏరోస్పేస్ ప్రకటించింది. ఈ మిషన్‌లో భారత అంతరిక్ష, శాస్త్ర రంగాలకు విశేష సేవలందించిన ముగ్గురు దిగ్గజ శాస్త్రవేత్తల సూక్ష్మ చిత్రాలను అంతరిక్షంలోకి పంపనున్నట్లు వెల్లడించింది.
నోబెల్ గ్రహీత సర్ సీవీ రామన్, భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్, మాజీ రాష్ట్రపతి, ప్రముఖ ఏరోస్పేస్ శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సూక్ష్మరూపాలను ఈ ప్రయోగంలో భాగంగా తీసుకెళ్లనున్నారు. వీటిని మైక్రో ఆర్టిస్ట్ అజయ్ కుమార్ 18 క్యారెట్ల బంగారంతో రూపొందించిన చిన్న రాకెట్‌పై చెక్కారు. ఒక్కో చిత్రం బియ్యం గింజ కంటే చిన్న పరిమాణంలో ఉండటం విశేషం.
ఈ మిషన్‌లో కాస్మోస్ డైమండ్స్ సంస్థ రూపొందించిన కాస్మిక్ బ్లూమ్’ ఆర్ట్‌వర్క్ కూడా పేలోడ్‌గా అంతరిక్షంలోకి వెళ్లనుంది. భారత శాస్త్రవేత్తలకు నివాళిగా ఈ ప్రత్యేక పేలోడ్‌ను రూపొందించినట్లు స్కైరూట్ తెలిపింది.
2022లో విక్రమ్-ఎస్ ద్వారా భారత తొలి ప్రైవేట్ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిన స్కైరూట్ ఏరోస్పేస్.. ఇప్పుడు విక్రమ్-1తో దేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటల్ ప్రయోగాన్ని చేపట్టనుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే భారత ప్రైవేట్ అంతరిక్ష రంగానికి కొత్త ఊపు లభించడంతో పాటు ప్రపంచ వాణిజ్య ఉపగ్రహ ప్రయోగాల మార్కెట్‌లో దేశ ప్రతిష్ఠ మరింత పెరగనుంది.
తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని ఫస్ట్ లాంచ్ ప్యాడ్ నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నారు. భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడు విక్రమ్ సారాభాయ్ గౌరవార్థం ఈ రాకెట్‌కు ‘విక్రమ్’ అని పేరు పెట్టగా, భారత ప్రైవేట్ అంతరిక్ష రంగం ఆర్బిటల్ ప్రయోగాల యుగంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ మిషన్‌కు ఆగమన్’ అనే పేరు ఖరారు చేశారు.
