- పలు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు
- నదుల్లా మారిన రహదారులు
- విమాన, రైలు సర్వీసులకు అంతరాయం
- ప్రకృతి ప్రకోపానికి అతలాకుతలమైన జనజీవనం
- ఆకస్మిక వరదలతో పలు రాష్ట్రాల్లో హై అలర్ట్
- దేశ రాజధాని ఢిల్లీలో వానల ఉగ్రరూపం
- రానున్న రోజుల్లో మరింత ముప్పు
ఢిల్లీ వెలుతురు జూలై 09:
భారతదేశంలోని పలు రాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానల కారణంగా దేశవ్యాప్తంగా ఆకస్మిక వరదలు పోటెత్తాయి. అనేక ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం, పాత నివాసాలు, భవనాలు కుప్పకూలడంతో సాధారణ జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. వరద నీరు రైల్వే ట్రాక్‌లను, విమానాశ్రయ రన్‌వేలను ముంచెత్తడంతో రైళ్లు, విమాన సర్వీసుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి వేలాది మంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. రానున్న రోజుల్లో వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
దేశ రాజధాని ఢిల్లీ పరిధిలో వరుణుడు తన ఉగ్రరూపాన్ని చూపిస్తున్నాడు. గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నగరంలోని మెజారిటీ ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కుండపోత వర్షాల దాటికి రోహిణి ప్రాంతంలో కొత్తగా నిర్మిస్తున్న ఒక నాలుగంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో భవన శిథిలాల కింద నలిగి ముగ్గురు అమాయకులు ప్రాణాలు కోల్పోవడం నగరంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అప్రమత్తమైన అధికారులు ఢిల్లీ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని చెప్తూ రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లను జారీ చేశారు.
ఢిల్లీతో పాటు దాని ఉప నగరాలైన ఘాజియాబాద్, గ్రేటర్ నోయిడా, గురుగ్రామ్‌లలో రహదారులు నదులను తలపిస్తున్నాయి. అక్షరధామ్ ఆలయ పరిసర ప్రాంతాల్లో మోకాళ్లోతు నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఢిల్లీ-జైపూర్ జాతీయ రహదారి సర్వీస్ లేన్, బసాయి, ఉమంగ్ భరద్వాజ్ చౌక్, కదీపూర్, సోహ్నా రోడ్, సెక్టార్ 10ఏ వంటి ప్రధాన కూడళ్లలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నగరపాలక సిబ్బంది మోటార్ల సహాయంతో రోడ్లపై ఉన్న నీటిని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు.
మహారాష్ట్రలోనూ భారీ వర్షాల బీభత్సం కొనసాగుతోంది. పింప్రి చించ్వాడ్ ప్రాంతంలో కొండలా పేరుకుపోయిన ఒక భారీ చెత్తకుప్ప వర్షాల దాటికి ఒక్కసారిగా జరిగి పక్కనే ఉన్న మూడంతస్తుల భవనంపై విరిగిపడింది. ఈ ప్రమాదంలో భవనం తీవ్రంగా దెబ్బతినగా, రంగంలోకి దిగిన విపత్తు నిర్వహణ బృందాలు 9 మందిని సురక్షితంగా రక్షించాయి. మరో 11 మంది ఇంకా శిథిలాల కిందే చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. వారిని బయటకు తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా సాగుతోంది. మరోవైపు ఠాణే జిల్లాలో వర్షాల కారణంగా ముగ్గురు చనిపోగా, సుమారు 800 మందిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. ముంబైలో లోకల్ రైళ్లతో పాటు భోర్ ఘాట్ వద్ద కొండచరియలు పడటంతో ముంబై-పుణె రైల్వే సేవలు నిలిచిపోయాయి.
అంతర్జాతీయంగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య నడుస్తున్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల ఇంధన వనరులను, గ్యాస్ సిలిండర్లను ఎంతో భద్రంగా దాచుకోవాల్సిన తరుణంలో, మహారాష్ట్రలో ఒక విచిత్రమైన ప్రమాదం జరిగింది. రాయగఢ్ జిల్లాలోని హెచ్‌పీసీఎల్ పాతాళ్‌గంగ ఎల్‌పీజీ బాట్లింగ్ ప్లాంట్ వరద నీటిలో మునిగిపోయింది. వరద ఉధృతి ఏ స్థాయిలో ఉందంటే.. ప్లాంట్‌లో భద్రపరిచిన దాదాపు 3 వేల గ్యాస్ సిలిండర్లు కొట్టుకుపోయి నేరుగా పాతాళగంగ నదిలో తేలాయి. వీటిలో చాలా వరకు ఖాళీ సిలిండర్లు కూడా ఉన్నాయి. నది ఒడ్డుకు కొట్టుకొచ్చిన సిలిండర్లను స్థానికులు ఎవరూ ముట్టుకోవద్దని అధికారులు హెచ్చరించారు. వాటిలో గ్యాస్ లీకేజీ ఉండి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
గుజరాత్ రాష్ట్రంలోని ప్రముఖ వాణిజ్య నగరం సూరత్‌ను వరదలు ముంచెత్తాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల కారణంగా నగరంలో వివిధ ప్రమాదాల్లో 9 మంది మరణించినట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి. నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునగడంతో వేలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు మరియు సహాయక శిబిరాలకు తరలించారు. వరదల్లో చిక్కుకున్న బాధితులకు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ యంత్రాంగం కలిసి ఆహార పొట్లాలు, తాగునీరు, నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో కూడా ఆకస్మిక వరదలు రాగా, అక్కడి పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో మాట్లాడి కేంద్ర సహాయాన్ని ప్రకటించారు.
పర్వత ప్రాంత రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిపడే ఘటనలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తెహ్రీ గర్వాల్‌లోని కద్దుఖాల్ సమీపంలో కొండచరియలు పడి ఒక నివాస భవనం పూర్తిగా దెబ్బతింది. అలాగే ఉత్తరకాశీ జిల్లాలోని నలుపాని గ్రామం సమీపంలో ప్రధాన రహదారిపైకి కొండపై నుంచి భారీ బండరాళ్లు, మట్టికట్టలు ఒక్కసారిగా దూసుకువచ్చాయి. దీంతో ఆ మార్గంలో ప్రయాణించాల్సిన వందలాది వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న విపత్తు ప్రతిస్పందన దళాలు రోడ్డుపై ఉన్న భారీ బండరాళ్లను తొలగించేందుకు ఆధునిక యంత్రాలతో శ్రమిస్తున్నాయి.
ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పవిత్ర పుణ్యక్షేత్రమైన హరిద్వార్ నగరం కూడా వరద నీటిలో మునిగిపోయింది. గంగా నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో నగరంలోని ప్రధాన వీధులన్నీ జలమయమయ్యాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఎడతెరిపి లేని వానల నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని దెహ్రాదూన్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలు, విద్యాసంస్థలకు అధికారులు తక్షణమే సెలవు ప్రకటించారు. హిమాలయ పర్వత ప్రాంతాల్లో రానున్న 48 గంటల్లో మరింత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నందున పర్యాటకులు, స్థానిక ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని ప్రభుత్వం కఠిన నిబంధనలు జారీ చేసింది.
