- దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి: రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ
- ఆలయాల్లో వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు
- బాసర నుంచి భద్రాచలం వరకు టెంపుల్ టూరిజం అభివృద్ధి
- వరంగల్ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి
- గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ మీసాల ప్రకాశ్ ప్రమాణ స్వీకారానికి హాజరు
- ఆధ్యాత్మిక పర్యాటకాన్ని మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం
- దేవాలయాల అభివృద్ధితో స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తామని వెల్లడి
- గ్రేటర్ వరంగల్ ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపు
- మేయర్ సీటు గెలుపే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచన
- ప్రజలకు చేరువయ్యేలా పార్టీ కార్యకర్తలు పనిచేయాలని ఆకాంక్ష
- వరంగల్‌లో కాంగ్రెస్ విజయానికి అందరూ సమన్వయంతో ముందుకు రావాలని పిలుపు
వరంగల్ వెలుతురు జూలై 12:
దేవాలయాల అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ అన్నారు. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ఇప్పటికే ఆలయాల్లో వేలాది కోట్ల రూపాయల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించడం ద్వారా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కూడా ఊతమివ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ఆదివారం వరంగల్ నగరంలో పర్యటించిన మంత్రి కొండా సురేఖ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా మీసాల ప్రకాశ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై వివరించారు.
బాసర నుంచి భద్రాచలం వరకు టెంపుల్ టూరిజాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. ఆలయాల అభివృద్ధితో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆధ్యాత్మిక క్షేత్రాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దే కార్యాచరణ అమలులో ఉందని వెల్లడించారు.
ఈ సందర్భంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపైనా మంత్రి స్పందించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. వరంగల్ మేయర్ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకునేలా క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజల మధ్యకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా వివరించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు మంత్రి కొండా సురేఖ సూచించారు.
