ప్రభుత్వ పాఠశాలలే తెలంగాణ పునర్నిర్మాణానికి పునాది: సీఎం రేవంత్ రెడ్డి

  • కొత్తకోట బాలికల ఉన్నత పాఠశాల నూతన భవనం ప్రారంభించిన సీఎం
  • చదువే భవిష్యత్తును, ఆత్మగౌరవాన్ని తీర్చిదిద్దుతుందని వ్యాఖ్య
  • గత ప్రభుత్వం విద్యాశాఖను నిర్లక్ష్యం చేసిందని విమర్శ
  • విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్నానని వెల్లడించిన ముఖ్యమంత్రి
  • ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం
  • విద్యలో తెలంగాణను దేశంలో తొలి రెండు స్థానాల్లో నిలపాలని పిలుపు
  • ఆగస్టు 15లోగా 27.5 లక్షల మందికి యంగ్ ఇండియా కిట్లు పంపిణీ చేస్తామని వెల్లడి
  • ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారూ అత్యున్నత స్థానాలకు చేరవచ్చని విద్యార్థులకు సూచన

కొత్తకోట వెలుతురు జూలై 15:

వనపర్తి జిల్లా కొత్తకోట బాలికల ఉన్నత పాఠశాల నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ చదువే మన భవిష్యత్తును నిర్ణయిస్తుందని, జీవితాల్లో వెలుగులు నింపడంతో పాటు ఆత్మగౌరవాన్ని పెంచి తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందాన్ని నింపుతుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఆగస్టు 15 నాటికి 9 రకాల వస్తువులతో కూడిన కిట్లను అందిస్తామని ప్రకటించారు.

గత ప్రభుత్వం విద్యాశాఖపై నిర్లక్ష్యం చూపిందని విమర్శించిన సీఎం, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యాశాఖకు సీనియర్ అధికారులను నియమించామని తెలిపారు. తెలంగాణ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందని నమ్ముతున్నందునే విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్నానని చెప్పారు.

కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో అమరుల ఆశయాలకు గత ప్రభుత్వం గుర్తింపు ఇవ్వలేదని, తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేయాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మౌలిక వసతుల కొరత వల్లే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిందని పేర్కొన్నారు.

గతంలో పాలించిన వారు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై దృష్టి పెట్టలేదని విమర్శిస్తూ, స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కృషితో ఈ పాఠశాలకు కొత్త భవనాలు, సౌకర్యాలు కల్పించామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయకుండా విద్యా సమస్యలు పరిష్కారం కావని స్పష్టం చేశారు.

ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల సమస్యను ఇప్పటికే పరిష్కరించామని, ఇప్పుడు విద్యా ప్రమాణాల పెంపుపై దృష్టి సారించామని చెప్పారు. ప్రస్తుతం విద్యలో తెలంగాణ దేశంలో 18వ స్థానంలో ఉందని, దానిని తొలి రెండు స్థానాల్లో నిలబెట్టడం మనందరి బాధ్యత అని అన్నారు.

విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలు సాధించేలా చర్యలు తీసుకుంటున్నామని, ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా (ATCs) అప్‌గ్రేడ్ చేశామని తెలిపారు. జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో బ్లూ కాలర్ ఉద్యోగాలకు మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

ఆగస్టు 15లోగా 27.5 లక్షల మంది విద్యార్థులకు యంగ్ ఇండియా కిట్ల పంపిణీ పూర్తి చేస్తామని సీఎం వెల్లడించారు. “ప్రభుత్వ పాఠశాలలో చదివితే ఏమవుతారని ఎవరైనా అడిగితే మీ రేవంతన్నను చూపించండి. నేను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివి ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నాను” అని విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపారు.

ప్రభుత్వ పాఠశాలలే తెలంగాణ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. మైదానాల్లోని మట్టిలో మాణిక్యాలను వెలికితీయాలని, క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారి భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత ప్రభుత్వానిదేనని హామీ ఇచ్చారు.  రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై ఏడాదికి రూ.1.08 లక్షలు ఖర్చు చేస్తోందని పేర్కొంటూ, విద్యార్థులు బాగా చదువుకుని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరాలని ఆకాంక్షించారు.  

Leave A Reply

Your email address will not be published.