భరణంపై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

  • భర్త జీతంలో 25శాతం భరణం భార్యకు ఇవ్వడం తప్పనిసరి కాదుA
  • ప్రతి వివాదం ఒకేలా ఉండదు
  • ఇరు పక్షాల ఆర్థిక స్థితి ఆధారంగానే నిర్ణయం
  • స్థూల జీతం కాదు.. నికర ఆదాయమే ప్రామాణికం
  • ట్యాక్సులు, కటింగ్‌లు పోగా మిగిలే జీతంపైనే భరణం
  • ఆడపడుచు ఆత్మగౌరవంతో బతకడమే భరణం ఉద్దేశం
  •  కేవలం బతుకుదెరువు మాత్రమే కాదన్న ధర్మాసనం

అలహాబాద్ వెలుతురు జూలై 15:

విడాకులు తీసుకున్న భార్యకు భర్త చెల్లించే భరణం (మెయింటెనెన్స్) విషయంలో అలహాబాద్ హైకోర్టు అత్యంత కీలకమైన, స్పష్టమైన తీర్పును వెలువరించింది. భర్తకు వచ్చే నికర ఆదాయంలో ఖచ్చితంగా 25 శాతం మొత్తాన్ని భార్యకు భరణంగా ఇవ్వాలనే కఠినమైన నిబంధన ఏ చట్టంలోనూ లేదని కోర్టు స్పష్టం చేసింది. పరిస్థితులను బట్టి భరణం మొత్తాన్ని తగ్గించే లేదా పెంచే పూర్తి స్వేచ్ఛ, అధికారాలు న్యాయస్థానాలకు ఉంటాయని జస్టిస్ అచల్ సచ్‌దేవ్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ తీర్పు భవిష్యత్తులో వచ్చే అనేక కుటుంబ వివాదాల కేసులకు మార్గదర్శకంగా నిలవనుంది.

కుటుంబ వివాదాలకు సంబంధించిన ప్రతి కేసు భిన్నమైన పరిస్థితులను కలిగి ఉంటుందని హైకోర్టు అభిప్రాయపడింది. అందుకే అన్ని కేసులకు ఒకే రకమైన సూత్రాన్ని లేదా శాతాన్ని అంధానుకరణగా వర్తింపజేయలేమని కోర్టు తేల్చి చెప్పింది. భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు, వారి సామాజిక నేపథ్యం, ఇరు పక్షాల ఆర్థిక స్థితిగతులు, వారి అవసరాలు మరియు కోర్టుకు సమర్పించిన పక్కా ఆధారాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే న్యాయమూర్తులు భరణం మొత్తాన్ని ఖరారు చేయాలని సూచించింది.

భరణం మొత్తాన్ని లెక్కించే సమయంలో భర్త యొక్క గ్రాస్ శాలరీని (స్థూల జీతం) ప్రాతిపదికగా తీసుకోకూడదని హైకోర్టు ఒక ముఖ్యమైన సాంకేతిక అంశాన్ని తెరపైకి తెచ్చింది. భర్త జీతం నుండి చెల్లించే పన్నులు (ఇన్‌కమ్ ట్యాక్స్), పీఎఫ్ వంటి ఇతర తప్పనిసరి కోతలు మినహాయించిన తర్వాత అతని చేతికి వచ్చే నికర ఆదాయాన్ని (నెట్ శాలరీ) మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. ఎందుకంటే, వాస్తవంగా ఒక కుటుంబ నిర్వహణకు లేదా జీవన ప్రమాణాలకు అందుబాటులో ఉండే అసలైన బడ్జెట్ ఇదేనని కోర్టు వ్యాఖ్యానించింది.

వివాహ బంధం ముగిసిపోయినంత మాత్రాన చట్టబద్ధమైన భార్యకు భరణం పొందే హక్కు ఏమాత్రం కోల్పోదని హైకోర్టు తేల్చి చెప్పింది. భార్యకు సొంతంగా ఎలాంటి ఆదాయ వనరులు లేనప్పుడు, ఆమె రెండో వివాహం చేసుకోకుండా ఒంటరిగా జీవిస్తున్నప్పుడు భరణం పొందడం ఆమె చట్టపరమైన హక్కని పేర్కొంది. భరణం అంటే కేవలం కడుపు నింపుకోవడానికి ఇచ్చే కనీస సహాయం మాత్రమే కాదని.. ఒక మహిళ సమాజంలో ఎవరిపైనా ఆధారపడకుండా, గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి అవసరమైన ఆర్థిక భరోసా కల్పించడమే భరణం యొక్క ప్రధాన ఉద్దేశమని కోర్టు ఉద్ఘాటించింది.

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహాత్ ప్రాంతానికి చెందిన విడాకులు పొందిన దంపతుల కేసు విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పింకీ అలియాస్ ప్రీతి అనే మహిళకు స్థానిక కుటుంబ న్యాయస్థానం నెలకు రూ.12 వేల భరణం మంజూరు చేసింది. అయితే ఈ మొత్తం తనకు సరిపోదని, దీనిని పెంచాలంటూ ఆమె హైకోర్టును ఆశ్రయించింది. ఇదే సమయంలో ఆమె మాజీ భర్త జై ప్రకాశ్.. అసలు ఆ రూ.12 వేల భరణం ఉత్తర్వునే రద్దు చేయాలంటూ రివిజన్ పిటిషన్ వేశారు. ఈ రెండు పిటిషన్లను కలిపి విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అచల్ సచ్‌దేవ్ తుది తీర్పును వెలువరించారు.

చట్టబద్ధంగా వివాహం చేసుకున్న భార్య తనను తాను పోషించుకోలేని స్థితిలో ఉండి, పునర్వివాహం చేసుకోకుండా, వ్యభిచారంలో జీవించకుండా ఉన్నట్లయితే, విడాకుల డిక్రీ మాత్రమే ఆమెకు భరణం కోరే హక్కును దూరం చేయదని హైకోర్టు పునరుద్ఘాటించింది.

సాధారణంగా దిగువ కోర్టులు ఇచ్చిన భరణం తీర్పులపై దాఖలయ్యే రివిజన్ పిటిషన్లలో హైకోర్టులు జోక్యం చేసుకోవడం చాలా అరుదుగా జరుగుతుంది. అయితే, దిగువన ఉన్న ఫ్యామిలీ కోర్టు కేసులోని కీలక ఆధారాలను, వాస్తవాలను సరిగ్గా పరిశీలించకుండా తప్పుడు నిర్ణయం తీసుకున్నప్పుడు బాధితులకు న్యాయం చేసేందుకు జోక్యం చేసుకునే పూర్తి అధికారం హైకోర్టుకు ఉంటుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ కేసులో కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును తప్పుబడుతూ అసలు దరఖాస్తు దాఖలు చేసిన తేదీ నుంచే చెల్లించే విధంగా భార్య నెలవారీ భరణాన్ని రూ. 12,000 నుంచి రూ. 20,000  చెల్లించాలని భర్త జై ప్రకాశ్‌ను ఆదేశించింది.

సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం.. భరణం వివాదాల్లో ఉన్న భర్త తన ఆస్తులు, అప్పులు, నెలవారీ ఖర్చులు మరియు ఖచ్చితమైన ఆదాయ వివరాలతో కూడిన ఒక సమగ్ర అఫిడవిట్‌ను కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఈ కేసులో భర్త జై ప్రకాశ్ అలాంటి అఫిడవిట్ ఏదీ దాఖలు చేయకపోవడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. కోర్టు రికార్డుల ప్రకారం భర్తకు నెలకు రూ.86,674 స్థూల వేతనం ఉండగా, అన్ని కోతలు పోగా నెలకు రూ.67,043 నికరంగా బ్యాంకు ఖాతాలో జమ అవుతున్నట్లు గుర్తించింది. భార్యకు ఎలాంటి ఆదాయం లేనప్పుడు భర్త తన ఆదాయ వివరాలు దాచడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది.

జులై 10న వెలువరించిన ఈ తుది తీర్పులో హైకోర్టు భార్యకు పూర్తి న్యాయం చేకూర్చింది. సవరించిన రూ.20 వేల భరణం మొత్తం ఇప్పటి నుంచి కాకుండా.. సదరు మహిళ కుటుంబ న్యాయస్థానంలో భరణం కోసం మొదట దరఖాస్తు చేసుకున్న తేదీ నుంచే వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది. అంటే పాత బకాయిలతో సహా భర్త ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. గతంలో సుప్రీంకోర్టు భరణంపై చేసిన కొన్ని వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. 25 శాతం అనేది కేవలం ఒక అవగాహన కోసమే తప్ప, అది ప్రతి కేసులో కచ్చితంగా అమలు చేయాల్సిన కఠినమైన రూల్ కాదని హైకోర్టు మరోసారి తేల్చి చెప్పింది.

Leave A Reply

Your email address will not be published.