పాలమూరు ప్రాజెక్టుపై త్వరలో శుభవార్త

  •  పాలమూరుకు శుభవార్త.. 90 టీఎంసీలకు అనుమతులే లక్ష్యం
  •  90 టీఎంసీలకు అనుమతుల కోసం ప్రయత్నాలు
  • డిండి ప్రాజెక్టుపైనా చర్చలు కొనసాగుతున్నాయి
  • అమర రాజా కొత్త ప్లాంట్‌ను ప్రారంభించిన సీఎం
  • పాలమూరు అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమన్న రేవంత్
  • స్థానిక యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని సూచన
  • ఈవీ రంగంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలపాలని ఆకాంక్ష
  • *అమర రాజా ప్రపంచ స్థాయి సంస్థగా ప్రశంసలు
  • చైనాతో పోటీ పడే సంస్థగా కొనియాడిన సీఎం
  • పరిశ్రమలు–సాగునీటితో పాలమూరు రూపురేఖలు మారతాయని వెల్లడి

మహబూబ్‌నగర్ వెలుతురు జూలై 15:

పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి త్వరలోనే శుభవార్త వినిపిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ ప్రాజెక్టు కింద 90 టీఎంసీల నీటి వినియోగానికి కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను ఒప్పించి అవసరమైన అనుమతులు సాధించే దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అలాగే డిండి ప్రాజెక్టుకు 30 టీఎంసీల నీటి కేటాయింపుల అంశంపైనా సంప్రదింపులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలో అమర రాజా గ్రూప్ ఏర్పాటు చేసిన కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ (సీక్యూఫీ) తయారీ యూనిట్‌ను ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో సీఎం మాట్లాడారు. కృష్ణా పరివాహక ప్రాంతంలోని డిండి, పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, ఆర్డీఎస్ ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు వాటి సమస్యల పరిష్కారానికి పొరుగు రాష్ట్రంతో చర్చలు కొనసాగిస్తున్నామని చెప్పారు. అన్ని అనుమతులు సాధించి మహబూబ్‌నగర్ జిల్లాను సస్యశ్యామలం చేసి ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.

విద్య, నీటిపారుదల, పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని సీఎం పేర్కొన్నారు. జిల్లాలో ట్రిపుల్ ఐటీ, ఇంజినీరింగ్ కళాశాలలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు, ప్రతి నియోజకవర్గానికి అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. **తెలంగాణ రైజింగ్–2047** లక్ష్యాలతో పెట్టుబడులను ఆకర్షించే విధానాలను అమలు చేస్తున్నామని చెప్పారు.

పరిశ్రమల కోసం భూములు ఇచ్చిన పాలమూరు రైతుల త్యాగాన్ని గుర్తించాలని, అమర రాజా సంస్థ స్థానిక యువతకు ఉద్యోగాల్లో అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం సూచించారు. వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావంతో కాలుష్య రహిత రవాణా అవసరం పెరిగిందని, ఈవీ రంగంలో తెలంగాణ కీలక కేంద్రంగా ఎదగాలని ఆకాంక్షించారు.

అమర రాజా సంస్థ ప్రపంచ స్థాయి కంపెనీగా ఎదిగి చైనా, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా వంటి దేశాల సంస్థలతో పోటీ పడుతోందని రేవంత్ రెడ్డి కొనియాడారు. చైనా ఆధిపత్యం ఉన్న ఈవీ రంగంలో భారత సంస్థలు ముందుకు రావాలంటే అమర రాజా వంటి కంపెనీలను ప్రోత్సహించడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణా రావు, వాకిటి శ్రీహరి, ఎంపీ డీకే అరుణ, ప్రభుత్వ విప్ యన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, అమర రాజా గ్రూప్ చైర్మన్ గల్లా జయదేవ్, ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.