- సయీద్‌పై ఎన్ఐఏ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్
- ఉగ్రవాద ముఠా నాయకుడికి బిగుస్తున్న ఉరితాడు
- సయీద్ అరెస్టుకు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు గ్రీన్ సిగ్నల్
- కస్టడీలో విచారణ జరపడం అత్యంత కీలకం
- పాకిస్థాన్‌లో దాక్కున్న ఉగ్రవాదిపై దర్యాప్తు సంస్థల నివేదిక
- అనుబంధ ఛార్జ్‌షీట్ దాఖలైన రెండు రోజులకే కోర్టు ఆదేశాలు
- వారెంట్‌ను తక్షణమే అమలు చేయాలని డీఐజీకి సూచన
పహల్గామ్ వెలుతురు జూలై 14:
పహల్గామ్‌లో జరిగిన భయంకరమైన ఉగ్రదాడి కేసు దర్యాప్తులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కీలక విజయం సాధించింది. పాకిస్థాన్ కేంద్రంగా అంతర్జాతీయ ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న నిషేధిత సంస్థ లష్కరే తోయిబా అధినేత హఫీజ్ సయీద్‌పై జమ్మూలోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్‌బీడబ్ల్యూ) జారీ చేసింది. ఈ ఉగ్రవాద ముఠా నాయకుడిని ఎలాగైనా చట్టం ముందు నిలబెట్టాలనే భారత అధికారుల ప్రయత్నాలకు కోర్టు నిర్ణయం ఊతమిచ్చింది. జాతీయ భద్రతకు ముప్పుగా మారిన సయీద్‌ను అరెస్టు చేయడానికి ఈ వారెంట్ చట్టపరంగా ఎంతో కీలకం కానుంది.
పహల్గామ్ ఉగ్రదాడి వెనుక ఉన్న అసలు కుట్రదారులను పట్టుకోవడానికి హఫీజ్ సయీద్‌ను కస్టడీలోకి తీసుకుని విచారించడం అత్యంత అవసరమని ఎన్ఐఏ కోర్టుకు గట్టిగా వివరించింది. ప్రస్తుతం అతడు పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ పరిధిలో ఉన్న సర్ఘోడా ప్రాంతంలో తలదాచుకుంటున్నట్లు నిఘా వర్గాలు దర్యాప్తులో కనుగొన్నాయి. అతడు కావాలనే భారత చట్టాల నుంచి, అరెస్టు నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడని కోర్టుకు నివేదించారు. ఈ కేసు దర్యాప్తును ఎలాంటి అడ్డంకులు లేకుండా సమగ్రంగా పూర్తి చేయాలంటే సయీద్‌ను ఆధీనంలోకి తీసుకోవడం ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు.
ఈ కేసులో ఎన్ఐఏ అధికారులు కోర్టుకు అదనపు వివరాలతో కూడిన అనుబంధ ఛార్జ్‌షీట్ సమర్పించిన రెండు రోజుల వ్యవధిలోనే, అంటే జూలై 8న ప్రత్యేక న్యాయస్థానం ఈ సంచలన ఉత్తర్వులను జారీ చేసింది. ఎన్ఐఏ సమర్పించిన సాక్ష్యాలను పరిశీలించిన ప్రత్యేక న్యాయమూర్తి, దర్యాప్తు ప్రయోజనాల కోసం హఫీజ్ సయీద్‌పై ఓపెన్-డేటెడ్ నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేయడం సమంజసమేనని అభిప్రాయపడ్డారు. ఈ వారెంట్‌ను చట్టబద్ధమైన పద్ధతుల్లో వెంటనే అమలు చేసేలా జమ్మూలోని ఎన్ఐఏ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డీఐజీ)కు పంపాలని, తదుపరి చర్యలు వేగవంతం చేయాలని కోర్టు ఆదేశించింది.
జమ్మూ కోర్టులో దాఖలైన ఈ అనుబంధ ఛార్జ్‌షీట్‌లో 76 ఏళ్ల వృద్ధుడైన హఫీజ్ సయీద్‌పై అత్యంత కఠినమైన సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. అతడిని కేవలం వ్యక్తిగత నిందితుడిగానే కాకుండా.. లష్కరే తోయిబాతో పాటు దానికి అనుబంధంగా పనిచేస్తున్న ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ (టీఆర్‌ఎఫ్) ఉగ్రవాద సంస్థల ప్రధాన సూత్రధారిగా, నాయకుడిగా ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. అతడిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)-2023తో పాటు, దేశద్రోహ శక్తులపై ప్రయోగించే చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం-1967 (యూఏపీఏ)లోని పలు కఠిన నిబంధనల కింద కేసులు నమోదు చేశారు.
పహల్గామ్ ఉగ్రదాడి కేవలం స్థానికంగా జరిగిన ఘోరం కాదని, దీని వెనుక సరిహద్దుల అవతలి నుంచి ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాకిస్థాన్ పక్కా వ్యూహం ఉందని ఎన్ఐఏ కోర్టుకు సమర్పించిన నివేదికలో తేల్చిచెప్పింది. భారత దేశంపై యుద్ధం ప్రకటించడానికి, కాశ్మీర్ లోయలో రక్తం చిందించడానికి పాకిస్థాన్ గడ్డపై నుంచే హఫీజ్ సయీద్ వ్యూహాత్మకంగా మార్గనిర్దేశం చేశాడని దర్యాప్తు సంస్థలు ఆధారాలతో సహా నిరూపించాయి. సరిహద్దులు దాటించి ఉగ్రవాదులను, ఆయుధాలను భారత్‌లోకి పంపడంలో సయీద్ కీలక పాత్ర పోషించాడని ఛార్జ్‌షీట్‌లో స్పష్టంగా పొందుపరిచారు.
గతంలో డిసెంబర్ 15వ తేదీన ఎన్ఐఏ ఈ కేసుకు సంబంధించి 1,597 పేజీలతో కూడిన భారీ ప్రధాన ఛార్జ్‌షీట్‌ను కోర్టుకు సమర్పించింది. దానికి కొనసాగింపుగా తాజాగా సేకరించిన మరిన్ని పక్కా ఆధారాలతో ఈ కొత్త అనుబంధ ఛార్జ్‌షీట్‌ను తయారు చేశారు. ఇందులో పాకిస్థాన్‌కు చెందిన ప్రధాన ఉగ్రవాద హ్యాండ్లర్ సాజిద్ జట్‌తో పాటు, గత 2025 జూలైలో భారత భద్రతా బలగాలు చేపట్టిన ‘ఆపరేషన్ మహాదేవ్’ ఎన్‌కౌంటర్‌లో హతమైన ముగ్గురు ఉగ్రవాదుల పేర్లను, ప్రస్తుతం అదుపులో ఉన్న మరో ఇద్దరు నిందితుల వివరాలను చేర్చారు. అలాగే లష్కరే తోయిబా, ది రెసిస్టెన్స్ ఫ్రంట్ సంస్థలను కూడా నిందితులుగా చేర్చారు.
గత ఏడాది ఏప్రిల్ 22వ తేదీన కాశ్మీర్‌లోని పసిడి లాంటి పర్యాటక ప్రాంతమైన పహల్గామ్‌లో ఉగ్రవాదులు జరిపిన ఘోరమైన దాడిలో 26 మంది అమాయక ప్రజలు, భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ఘటన జరిగిన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ప్రాథమిక ఎఫ్‌ఐఆర్ నమోదైంది. అయితే ఈ దాడి వెనుక అంతర్జాతీయ కుట్రలు, సరిహద్దు అవతలి శక్తుల ప్రమేయం ఉన్నట్లు ప్రాథమిక విచారణలోనే తేలడంతో, కేంద్ర హోంశాఖ ఈ కేసు తీవ్రతను గుర్తించి తక్షణమే దర్యాప్తు బాధ్యతలను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం, సైన్యం ఉగ్రవాదులకు కోలుకోలేని విధంగా బుద్ధి చెప్పాయి. ఈ నరమేధానికి ప్రతికారంగా భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్ ఆక్రమిత ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు నిర్వహించింది. సరిహద్దు దాటి వెళ్లి ఉగ్రవాదుల అస్థిత్వానికి కారణమైన పలు లాంచ్ ప్యాడ్లను, శిక్షణా కేంద్రాలను విజయవంతంగా ధ్వంసం చేసింది. ఈ దాడుల ద్వారా భారత్‌పై కన్నువేస్తే ఊరుకునేది లేదని గట్టి సందేశం పంపిన కేంద్రం, ఇప్పుడు చట్టపరంగా కూడా హఫీజ్ సయీద్ వంటి అగ్ర ఉగ్రవాదుల చుట్టూ ఉరితాడు బిగిస్తోంది.
