- మరోసారి అక్రమ చొరబాట్ల కలకలం
- యూపీ సరిహద్దులో మాజీ నేవీ అధికారి అరెస్ట్
- మయన్మార్ మిలిటెంట్లతో సంబంధాలు
- నేపాల్ సరిహద్దు దాటేందుకు యత్నిస్తుండగా అరెస్ట్
- కాలిఫోర్నియాకు చెందిన జోర్డాన్ బ్రౌన్‌గా గుర్తింపు
- పారిపోతున్న నిందితుడిని బంధించిన పోలీసులు
ఢిల్లీ వెలుతురు జూలై 14:
భారతదేశంలోకి అమెరికా మాజీ సైనికులు ఎలాంటి పత్రాలు లేకుండా అక్రమంగా చొరబడుతుండటం ఇప్పుడు దేశ భద్రతా వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. భారత్ నుంచి నేపాల్ దేశంలోకి దొంగచాటుగా ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న ఒక అమెరికా మాజీ నేవీ అధికారిని ఉత్తర్ ప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లా సరిహద్దులో ‘సహస్త్ర సీమా బల్’ (ఎస్ఎస్‌బీ) బలగాలు వ్యూహాత్మకంగా అడ్డుకుని అరెస్ట్ చేశాయి. విదేశీయులకు సంబంధించిన ఎలాంటి గుర్తింపు కార్డులు లేదా ప్రయాణ పత్రాలు (పాస్‌పోర్ట్, వీసా) లేకుండా అతడు అనుమానాస్పదంగా యూపీ సరిహద్దుల్లో తిరుగుతుండటంతో బలగాలు తనిఖీలు చేపట్టాయి.
భద్రతా బలగాల తనిఖీల్లో పట్టుబడిన ఆ విదేశీయుడిని అమెరికాలోని కాలిఫోర్నియా ప్రాంతానికి చెందిన జోర్డాన్ బ్రౌన్‌గా అధికారులు గుర్తించారు. సరిహద్దు చెక్‌పోస్ట్ వద్ద ఎస్ఎస్‌బీ జవాన్లు అతడిని ఆపి నిలదీయగా.. బ్రౌన్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోవడానికి తీవ్రంగా ప్రయత్నించినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే అలర్ట్ అయిన జవాన్లు అతడిని చుట్టుముట్టి బంధించారు. అనంతరం అతడిని స్థానిక పోలీసులకు అప్పగించగా.. సరైన పత్రాలు లేకుండా దేశంలో తిరుగుతున్నందుకు ఇమిగ్రేషన్ చట్టాల కింద కేసు నమోదు చేసి లోతుగా విచారణ ప్రారంభించారు.
పోలీసులు, నిఘా వర్గాల ప్రాథమిక విచారణలో జోర్డాన్ బ్రౌన్ తన నేపథ్యానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తాను కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఉన్నత చదువులు చదువుకున్నానని, ఆ తర్వాత దాదాపు ఆరేళ్ల పాటు అమెరికా సైన్యంలో (నేవీ) పనిచేసినట్లు ఒప్పుకున్నాడు. గత 2025 నవంబర్ నెలలో తాను విమానంలో కాకుండా సముద్ర మార్గం ద్వారా దొంగచాటుగా భారత్‌లోకి ప్రవేశించినట్లు అధికారులు కనుగొన్నారు. దేశంలోకి వచ్చినప్పటి నుంచి అతడు గోవాలో శాశ్వతంగా నివసిస్తున్నాడని, ఈ మధ్య కాలంలో బెంగళూరు, లఖ్‌నవూ, గోరఖ్‌పూర్ వంటి కీలక నగరాలకు కూడా వెళ్లి వచ్చినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.
అయితే, విచారణ సాగుతున్న కొద్దీ జోర్డాన్ బ్రౌన్ అధికారుల ప్రశ్నలకు పొంతనలేని, పరస్పర విరుద్ధమైన సమాధానాలు చెబుతూ గందరగోళానికి గురిచేస్తున్నాడు. మూడేళ్ల క్రితం తనకు ఉత్తరాఖండ్‌కు చెందిన ఒక భారతీయ మహిళతో పరిచయం ఏర్పడిందని, 2024 అక్టోబర్‌లో తామిద్దరం పెళ్లి చేసుకున్నామని చెప్పాడు. కానీ, అదే సమయంలో తాను ఇటలీ పర్యటనలో ఉన్నానని చెప్పడం అనుమానాలకు తావిచ్చింది. ఆ తర్వాత తాను టూరిస్ట్ వీసాపై థాయ్‌లాండ్ వెళ్లానని, అక్కడ పాస్‌పోర్టు పోవడంతో సముద్ర మార్గంలో భారత్ వచ్చానని అన్నాడు. ఇప్పుడు గోవాలో పరిచయమైన ఒక నేపాల్ వ్యక్తిని కలవడానికి సరిహద్దు దాటుతున్నానని, తన అసలు పాస్‌పోర్ట్ బెంగళూరులోని ఒక స్నేహితుడి దగ్గర ఉందని చెప్పడంతో అధికారులు అతడి మాటలను నమ్మడం లేదు.
జోర్డాన్ బ్రౌన్ అరెస్ట్ వ్యవహారం కేవలం ఒక సాధారణ చొరబాటు కేసు కాకపోవచ్చని నిఘా సంస్థలు భావిస్తున్నాయి. ఎందుకంటే, ఇటీవల పొరుగు దేశమైన మయన్మార్‌లోని మిలిటెంట్లకు అత్యాధునిక యుద్ధతంత్రాలలో ఉగ్రశిక్షణ ఇస్తున్న అమెరికా మాజీ సైనికుడు మాథ్యూ వాన్‌డైక్‌తో పాటు ఐదుగురు ఉక్రెయిన్ పౌరులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలోనే బ్రౌన్ అరెస్ట్ ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికాకు చెందిన మాజీ సైనికులు టూరిస్ట్ వీసాల పేరుతో భారత్‌కు వచ్చి, ఇక్కడి నుంచి మిజోరాం సరిహద్దు ద్వారా మయన్మార్‌లోకి చొరబడి అక్కడి ఉగ్రవాద, తిరుగుబాటు ముఠాలతో చేతులు కలుపుతున్నట్లు దర్యాప్తులో తేలింది.
విదేశీ కిరాయి సైనికులు ఇతరులకు ఆయుధాలు, డ్రోన్లను చేరవేయడానికి భారత భూభాగాన్ని ఒక సురక్షితమైన రవాణా మార్గంగా (ట్రాన్సిట్ రూట్) వాడుకుంటున్నారా? అనే అనుమానాలకు అవుననే సమాధానాలు లభిస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం కోల్‌కతాలో పట్టుబడిన మాథ్యూ వాన్‌డైక్ బృందం ఐరోపా దేశాల నుంచి అత్యాధునిక డ్రోన్లను తీసుకొచ్చి, ఈశాన్య భారత సరిహద్దుల గుండా మయన్మార్‌లోని తిరుగుబాటు ముఠాలకు స్మగ్లింగ్ చేసినట్లు పక్కా సమాచారం అందింది. ఇలా డ్రోన్లను దొంగరవాణా చేయడం, వాటిని అసెంబ్లింగ్ చేయడం, ఎలక్ట్రానిక్ యుద్ధరీతుల్లో మయన్మార్ ముఠాలకు శిక్షణ ఇవ్వడమే ఈ అంతర్జాతీయ ముఠాల పని అని రష్యా కూడా గతంలో తీవ్ర ఆరోపణలు చేసింది.
భారతదేశ భద్రతా నిబంధనల ప్రకారం విదేశీయులు ఎవరైనా సరే మిజోరాం వంటి సున్నితమైన ఈశాన్య సరిహద్దు రాష్ట్రాల్లో ప్రయాణించాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసే ‘రక్షిత ప్రాంత పర్మిట్’ (ప్రొటెక్టెడ్ ఏరియా పర్మిట్ – PAP) కలిగి ఉండాలి. కానీ, ఇప్పుడు అరెస్టయిన అమెరికా మాజీ సైనికులు మరియు విదేశీయులు ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండానే నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించారు. స్థానిక శక్తుల సహాయంతో రహస్యంగా ఈశాన్య భారతం నుంచి మయన్మార్‌లోకి ప్రవేశిస్తూ సరిహద్దు భద్రతకు పెద్ద సవాలుగా మారారు.
ఇంతకీ ఈ వ్యవహారంలో కీలక సూత్రధారిగా ఉన్న మాథ్యూ వాన్‌డైక్ సాదాసీదా వ్యక్తి కాదు. ‘సన్స్ ఆఫ్ లిబర్టీ ఇంటర్నేషనల్’ అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ ముసుగులో అతడు ఒక కిరాయి సైన్యాల ముఠాను నడుపుతున్నాడు. గతంలో లిబియా అంతర్యుద్ధం జరిగిన సమయంలో అక్కడి పాలకుడు గడాఫీకి వ్యతిరేకంగా స్వయంగా తుపాకీ పట్టి పోరాడటం ద్వారా ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకెక్కాడు. ఆ తర్వాత సిరియా అంతర్యుద్ధంలోనూ పాల్గొని అక్కడి తిరుగుబాటుదారులకు శిక్షణ ఇచ్చాడు. మోటార్ సైకిల్‌పై ఉత్తర ఆఫ్రికా, పశ్చిమాసియా దేశాల్లో విస్తృతంగా పర్యటించిన చరిత్ర ఇతనికి ఉంది. 2022 మార్చి నుంచి ఇతని సంస్థ ఉక్రెయిన్ దేశంలో రష్యా సైన్యానికి వ్యతిరేకంగా కూడా పని చేస్తోంది. ఇప్పుడు అరెస్టయిన జోర్డాన్ బ్రౌన్‌కు కూడా ఇటువంటి ముఠాలతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నాయి.
