స్కిల్ డెవలప్‌మెంట్‌లో తెలంగాణతో కలిసి పనిచేయడానికి ఇరాన్ ఆసక్తి
ఇరాన్ కార్మిక, సహకార, సామాజిక సంక్షేమ శాఖ మంత్రి అహ్మద్ మైదారితో మంత్రి వివేక్ భేటీ
హైదరాబాద్, వెలుతురు జూలై 16:
అత్యాధునిక నైపుణ్య శిక్షణ, ప్రపంచ స్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దుతున్న తెలంగాణ యువత భవిష్యత్తులో ఇరాన్ అభివృద్ధిలో కీలక భాగస్వాములుగా నిలుస్తారని శక్తి ( కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీస్) మరియు గనుల శాఖ మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి అన్నారు. భారత్-ఇరాన్ మధ్య శతాబ్దాలుగా కొనసాగుతున్న సాంస్కృతిక, వాణిజ్య, చారిత్రక సంబంధాలు భవిష్యత్తులో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి రంగాల్లో మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు.
గురువారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఇరాన్ కార్మిక, సహకార, సామాజిక సంక్షేమ శాఖ మంత్రి అహ్మద్ మైదారి నేతృత్వంలోని ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంతో మంత్రి వివేక్ వెంకటస్వామి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో అమలు చేస్తున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, పరిశ్రమలకు అనుసంధానమైన శిక్షణా విధానం, విదేశీ ఉపాధి అవకాశాలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ATCs), తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (TOMCOM) ద్వారా తెలంగాణ దేశంలోనే ఆదర్శవంతమైన స్కిల్ డెవలప్‌మెంట్ ఎకోసిస్టమ్‌ను నిర్మించిందన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తెలంగాణ యువతకు ఆధునిక నైపుణ్యాలు అందిస్తూ ప్రపంచ స్థాయి ఉద్యోగాలకు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.
తెలంగాణలో శిక్షణ పొందిన యువత ఇప్పటికే జర్మనీ, జపాన్‌తో పాటు గల్ఫ్ దేశాల్లో విజయవంతంగా ఉద్యోగాలు చేస్తున్నారని, అదే తరహాలో భవిష్యత్తులో ఇరాన్‌కు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరును కూడా తెలంగాణ అందించగలదనే విశ్వాసాన్ని మంత్రి వ్యక్తం చేశారు. ఉపాధి, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో తెలంగాణ-ఇరాన్ మధ్య పరస్పర సహకారం మరింత విస్తరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.
సమావేశంలో కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాసరి హరిచందన తెలంగాణ స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవస్థపై సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా అమలు చేస్తున్న శిక్షణా విధానం, పరిశ్రమల భాగస్వామ్యం, అంతర్జాతీయ ఉద్యోగాల కోసం చేపడుతున్న చర్యలు, టామ్‌కామ్ కార్యకలాపాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ముఖ్యంగా గిగ్ వర్కర్ల సామాజిక భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన చారిత్రాత్మక చట్టంపై ప్రతినిధి బృందానికి వివరించారు.
ఇరాన్ ప్రతినిధి బృందం తెలంగాణలో అమలు చేస్తున్న స్కిల్ డెవలప్‌మెంట్ మోడల్, కార్మిక పరిపాలన, విదేశీ ఉపాధి కార్యక్రమాలు, సంక్షేమ విధానాలపై ఆసక్తి కనబరిచింది. భవిష్యత్తులో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన, శిక్షణ, సంస్థాగత భాగస్వామ్యాలపై రెండు ప్రాంతాల మధ్య సహకార అవకాశాలను విస్తృతంగా చర్చించారు.
ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇరాన్ సహకార, కార్మిక శాఖ ఉపమంత్రి డాక్టర్ సర్ఫీ, భారతదేశంలోని ఇరాన్ రాయబారి డాక్టర్ ఫత్ అలీ, హైదరాబాద్‌లోని ఇరాన్ కాన్సుల్ జనరల్ అహ్మదియే, వైస్ కాన్సుల్ మొహ్సెన్ మొఘద్దామి తదితరులు పాల్గొన్నారు.
