- పర్యావరణ పరిరక్షణలో హుస్నాబాద్ మరో ముందడుగు
- స్టీల్ బ్యాంక్‌తో ప్లాస్టిక్ రహిత హుస్నాబాద్
- ప్లాస్టిక్ మహమ్మారి నివారణకు, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు స్టీల్ బ్యాంకుల ఏర్పాటు
- పర్యావరణ పరిరక్షణలో హుస్నాబాద్ చూపిన ఆదర్శం
ప్రపంచం నేడు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ప్లాస్టిక్ కాలుష్యం ఒకటి. ఒకప్పుడు సౌకర్యంగా భావించిన ప్లాస్టిక్ నేడు ప్రకృతికి, మానవ ఆరోగ్యానికి, జీవావరణానికి పెను ముప్పుగా మారింది. ఒకసారి ఉపయోగించి పారేసే ప్లాస్టిక్ వస్తువులు నదులు, చెరువులు, పొలాలు, వీధులు నింపేయడంతో పాటు భూగర్భ జలాలను, పశువులను, పర్యావరణ వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ సమస్యను కేవలం చట్టాలతో లేదా నిషేధాలతో పూర్తిగా అరికట్టడం సాధ్యం కాదు. ప్రజల జీవనశైలిలో మార్పు రావాలి. ఆ మార్పుకు ప్రత్యామ్నాయం ఉండాలి. అదే ఆలోచనతో హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రారంభమైన “స్టీల్ బ్యాంక్” కార్యక్రమం నేడు దేశానికే ఆదర్శంగా నిలిచే ప్రజా ఉద్యమంగా ఎదిగింది.
స్వర్గీయ పొన్నం సత్తయ్య గారి సేవా భావాన్ని స్ఫూర్తిగా తీసుకుని, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో స్వంత నిధులతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గౌరవనీయులైన తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ గారి చేతుల మీదుగా గత సంవత్సరం జూలై 17 న ప్రారంభమైన ఈ కార్యక్రమం ఏడాది కాలంలోనే హుస్నాబాద్‌లో పర్యావరణ పరిరక్షణకు ఒక కొత్త దిశను చూపించింది.
నిషేధం కాదు ప్రత్యామ్నాయమే శాశ్వత పరిష్కారం
ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలంటే ప్రజలకు ఉపయోగకరమైన ప్రత్యామ్నాయం అందించాల్సిందే. ఈ సూత్రాన్ని ఆధారంగా చేసుకుని స్టీల్ బ్యాంక్ భావన రూపుదిద్దుకుంది. గ్రామాల్లో జరిగే పెళ్లిళ్లు, శుభకార్యాలు, అన్నదానాలు, సామాజిక కార్యక్రమాల కోసం ప్లాస్టిక్ పాత్రలకు బదులుగా స్టీల్ పాత్రలను అందుబాటులోకి తీసుకువచ్చారు.హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రతి మండలంలో గ్రామ మహిళా సంఘాలను భాగస్వాములను చేస్తూ మొత్తం 276 గ్రామ సంఘాల్లో స్టీల్ బ్యాంకులను ఏర్పాటు చేశారు. ఒక్కో స్టీల్ బ్యాంక్‌లో 13 రకాల స్టీల్ పాత్రలు ఉండేలా 300, 400, 500 పాత్రల సామర్థ్యం కలిగిన సెట్లను గ్రామాల అవసరాలకు అనుగుణంగా అందించారు.
ఈ కార్యక్రమం వల్ల 7,376 స్వయం సహాయక సంఘాలకు చెందిన 80,633 మంది మహిళలు ప్రత్యక్ష లబ్ధిదారులుగా మారారు. మహిళా సంఘాలే ఈ స్టీల్ బ్యాంకులను నిర్వహించడం వల్ల గ్రామాల్లో బాధ్యత, క్రమశిక్షణ, సమిష్టి భాగస్వామ్యం మరింత బలపడింది.ఈ కార్యక్రమం వెనుక ఉన్న గొప్ప విషయం ఏమిటంటే ఇది ప్రభుత్వ నిధులతో కాదు, పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్టు ద్వారా రూ.2.54 కోట్లకు పైగా స్వంత నిధులతో అమలు చేయబడింది. సమాజం ఇచ్చిన ప్రేమకు తిరిగి సమాజానికే సేవ రూపంలో అందించిన అరుదైన కార్యక్రమంగా ఇది నిలిచింది.
గ్రామాల నుంచి హోటళ్ల వరకు విస్తరించిన పర్యావరణ ఉద్యమం
స్టీల్ బ్యాంక్ ప్రభావం కేవలం గ్రామాలకే పరిమితం కాలేదు. ప్రజలు నిత్యం వెళ్లే హోటళ్లలో కూడా ప్లాస్టిక్ గ్లాసుల వినియోగాన్ని తగ్గించాలనే లక్ష్యంతో 319 హోటళ్లకు 33,900 స్టీల్ గ్లాసులను ఉచితంగా పంపిణీ చేశారు. దీంతో వేల సంఖ్యలో ప్లాస్టిక్ గ్లాసుల వినియోగం తగ్గింది. వ్యాపార సంస్థలు కూడా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావచ్చని ఈ కార్యక్రమం నిరూపించింది.
మహిళా సంఘాలే విజయానికి వెన్నెముక
ఈ కార్యక్రమంలో మహిళా స్వయం సహాయక సంఘాల పాత్ర అత్యంత కీలకం. స్టీల్ పాత్రలను భద్రపరచడం, అవసరమైన వారికి అందించడం, తిరిగి స్వీకరించడం, నిర్వహణ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించడం ద్వారా మహిళలు ఈ ఉద్యమానికి అసలైన నాయకత్వం వహించారు. ఇది మహిళా సాధికారతకు కూడా ఒక మంచి ఉదాహరణగా నిలిచింది.
పచ్చదనం – పరిశుభ్రత -ప్రజల భాగస్వామ్యం
స్టీల్ బ్యాంక్‌తో పాటు హుస్నాబాద్‌లో చెరువుల అభివృద్ధి, మొక్కల పెంపకం, రోడ్ల సుందరీకరణ, ప్రజా ప్రదేశాల అభివృద్ధి వంటి కార్యక్రమాలు సమాంతరంగా కొనసాగాయి. అర్బన్ ఫారెస్ట్ పార్క్, ఏల్లమ్మ చెరువు, పల్లె చెరువు, కొత్త చెరువు పరిసరాల అభివృద్ధి, “I Love Husnabad” ప్రదేశం, త్రిశూలం జంక్షన్, గాంధీ విగ్రహం పరిసరాల సుందరీకరణ, యోగా లోగోలతో కూడిన డివైడర్లు, ఎల్కతుర్తి చౌరస్తా వంటి ప్రాంతాలు పరిశుభ్రత, పచ్చదనానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు తగ్గడంతో చెరువులు పరిశుభ్రంగా మారాయి. కాలుష్యం తగ్గింది. వ్యవసాయ భూములు రక్షించబడుతున్నాయి. ఇంటి పరిసరాల్లో పెంచే కూరగాయలు కూడా పరిశుభ్రమైన వాతావరణంలో సాగు అయ్యే పరిస్థితి ఏర్పడుతోంది.
అభివృద్ధికి కొత్త నిర్వచనం
అభివృద్ధి అంటే కేవలం సిమెంట్ రోడ్లు, భారీ భవనాలు, వంతెనలు మాత్రమే కాదు. ప్రజల ఆలోచనల్లో మార్పు తీసుకురావడం, ప్రకృతిని కాపాడే అలవాట్లను పెంపొందించడం, భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడం కూడా నిజమైన అభివృద్ధే. స్టీల్ బ్యాంక్ కార్యక్రమం అలాంటి అభివృద్ధికి ఒక సజీవ ఉదాహరణ.
హుస్నాబాద్ మోడల్ – తెలంగాణకు ఆదర్శం
ఒక నియోజకవర్గంలో ప్రారంభమైన ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచే సామర్థ్యం కలిగి ఉంది. ప్లాస్టిక్ సమస్యకు స్థానికంగా, ప్రజల భాగస్వామ్యంతో, మహిళా సంఘాల నాయకత్వంలో పరిష్కారం చూపించడం ఈ కార్యక్రమం ప్రత్యేకత. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు, గ్రామ ప్రజలు కలిసి పనిచేస్తే పర్యావరణ పరిరక్షణ ఎంత సమర్థవంతంగా సాధ్యమవుతుందో హుస్నాబాద్ నిరూపించింది. స్టీల్ బ్యాంక్ ఒక సంవత్సరం పూర్తి చేసుకోవడం ఒక మైలురాయి మాత్రమే. ఈ ప్రయాణం ఇక్కడితో ముగిసేది కాదు. ప్లాస్టిక్ రహిత గ్రామాల నుంచి ప్లాస్టిక్ రహిత పట్టణాల వరకు, అక్కడి నుంచి ప్లాస్టిక్ రహిత తెలంగాణ దిశగా ఈ ఉద్యమం విస్తరించాల్సిన అవసరం ఉంది.ప్రకృతిని కాపాడటం అనేది ఒక్కరి బాధ్యత కాదు. అది సమాజం మొత్తానికి చెందిన బాధ్యత. హుస్నాబాద్‌లో నాటిన ఈ చైతన్య విత్తనం రాష్ట్రం అంతటా విస్తరిస్తే, పర్యావరణ పరిరక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది.
స్టీల్ బ్యాంక్ కేవలం స్టీల్ పాత్రల పంపిణీ కార్యక్రమం కాదు… అది ఒక ఆలోచన. ఒక సామాజిక బాధ్యత. ఒక పర్యావరణ ఉద్యమం. ఒక తరం నుంచి మరో తరానికి పరిశుభ్రమైన భూమిని అందించాలనే సేవా సంకల్పం.ఒక సంవత్సరం క్రితం నాటిన చిన్న విత్తనం నేడు హుస్నాబాద్ అంతటా పర్యావరణ చైతన్య వృక్షంగా విస్తరించింది. ఈ వృక్షం నీడలో పెరుగుతున్నది కేవలం పచ్చదనం మాత్రమే కాదు బాధ్యతగల సమాజం కూడా.

నాగరాజు, పి.ఆర్.ఓ
బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి
