- ఘనంగా ప్రారంభమైన దివ్యాంగ కళాకారిణి షేక్ నఫీస్ చిత్రకళా ప్రదర్శన
- ప్రతిభకు అంగవైకల్యం అడ్డుకాదు
హైదరాబాద్, వెలుతురు జులై 16:
శారీరక అంగవైకల్యంతో కదలలేని స్థితిలో ఉన్న కూడా తన చిత్రాల ద్వారా భావాలను అద్భుతంగా షేక్ నఫీస్ వ్యక్త పరిచిందని సీనియర్ జర్నలిస్ట్, గద్దర్ అవార్డు గ్రహీత డా. పొన్నం రవిచంద్ర అన్నారు. మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో సారంగి ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర బాషా సాంస్కృతిక శాఖ సహకారంతో ఖాజా ఆఫ్రిది నేతృత్వంలో ఏర్పాటు చేసిన ‘హార్ట్‌టేబుల్డ్’ కళా ప్రదర్శనను ఆయన ముఖ్య అతిధిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, “దివ్యాంగత అనేది ప్రతిభకు అడ్డంకి కాదని షేక్ నఫీస్ తన చిత్రాల ద్వారా నిరూపించిందని తెలిపారు. శరీరం సహకరించకపోయినా సంకల్పం ఉంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని ఆమె జీవితం చెబుతున్నదని కొనియాడారు. ఇలాంటి కళాకారులను సమాజం గుర్తించి ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యతని, కళాకారుడికి అందించే ప్రోత్సాహమే అతిపెద్ద పురస్కారమని అన్నారు. నఫీస్ వంటి ప్రతిభావంతులకు మరింత గుర్తింపు, అవకాశాలు లభించాలని కోరుకుంటున్నానని, ఆమె కళను ప్రపంచానికి పరిచయం చేసిన సారంగి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, సీనియర్ జర్నలిస్ట్ ఖాజా ఆఫ్రిదిని అభినందిస్తూ ఆయన సేవలను, నఫీజ్ కళని కొనియాడారు.
సినీ దర్శకుడు అక్షర కుమార్ మాట్లాడుతూ నఫీస్ చిత్రాల్లో కనిపిస్తున్న భావవ్యక్తీకరణ, కళ పట్ల ఆమెకున్న అంకితభావం ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. దివ్యాంగుల ప్రతిభను వెలుగులోకి తీసుకురావడానికి ఇలాంటి ప్రదర్శనలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
దివ్యాంగ కళాకారిణి షేక్ నఫీస్ “హార్ట్‌టేబుల్డ్” పేరిట జరుగుతున్నచిత్రకళా ప్రదర్శన జులై 17, 18 తేదీల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుందని, కళాభిమానులు పాల్గొని విజయవంతం చేసి నఫీస్ ను ప్రోత్సహించాలని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నటుడు సన్నీ పల్లె, శివరాం రెడ్డి, జర్నలిస్తులు బత్తిని వినయ్ కుమార్ గౌడ్, , మహేష్ , కట్ట శివ రెడ్డి, యూనుస్ ఫర్హాన్, మానస, రఘు మాందాటి, కావాలి శ్రీనివాస్, బత్తుల గణేష్ గౌడ్ తదితరులు పాల్గొని శారీరక అవరోధాలను అధిగమించి కళను జీవన మార్గంగా ఎంచుకున్న నఫీస్ అనేక మందికి ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.






