- రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,775 మంది విద్యార్థులకు ఉద్యోగాలు
- ఆఫర్ లెటర్లు పంపిణీ చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి గారు
- జర్మన్, జపనీస్ తదితర భాషల శిక్షణ కోసం EFLUతో కీలక ఒప్పందం
- తెలంగాణను దేశంలోనే నంబర్-1 స్కిల్ స్టేట్‌గా తీర్చిదిద్దుతాం
హైదరాబాద్, వెలుతురు జూలై 16:
నైపుణ్యమే యువత జీవితాలను మార్చే అసలైన శక్తి అని, ప్రతి యువకుడికి నాణ్యమైన శిక్షణతో పాటు ఉద్యోగం కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీస్) మరియు గనులు శాఖ మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి అన్నారు. డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ (డీఈటీ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని కొమరం భీం ఆదివాసీ భవన్‌లో నిర్వహించిన తొలి ‘తెలంగాణ స్కిల్స్ డే’ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ఉద్యోగాలు సాధించిన శిక్షణార్థులను అభినందించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జాబ్‌మేళాల ద్వారా ఉద్యోగాలకు ఎంపికైన యువతకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) విద్యార్థులకు ఆఫర్ లెటర్లను అందజేశారు. అలాగే విదేశీ ఉపాధి అవకాశాల కోసం ఎంపికైన 19 మంది ఫిజియోథెరపిస్టులకు ఆఫర్ లెటర్లను కూడా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే ప్రతి పరిశ్రమ మొదట అడిగేది స్కిల్డ్ మ్యాన్‌పవర్ గురించేనని అన్నారు. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణను దేశంలోనే నంబర్-1 స్కిల్ డెవలప్‌మెంట్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతోందని చెప్పారు. గతంలో ఐటీఐల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ పొందలేకపోయారని, ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చారిత్రక నిర్ణయాలు తీసుకుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని 65 ప్రభుత్వ ఐటీఐలను టాటా టెక్నాలజీస్ భాగస్వామ్యంతో అత్యాధునిక అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేసినట్లు మంత్రి తెలిపారు. సీఎన్‌సీ, ఇండస్ట్రియల్ రోబోటిక్స్, ఎలక్ట్రిక్ వెహికల్, డిజిటల్ మాన్యుఫ్యాక్చరింగ్, అడ్వాన్స్‌డ్ టూల్స్, ఆటోమేషన్ వంటి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 6 దీర్ఘకాలిక, 23 స్వల్పకాలిక కోర్సులు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. ఈ మార్పులతో రాష్ట్రంలో శిక్షణ సామర్థ్యం 18,484 నుంచి 34,344 మందికి పెరిగిందని, 2025–27 విద్యాసంవత్సరంలో 99 శాతం సీట్లు భర్తీ కావడం యువతలో ఈ కోర్సులపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 65 ప్రభుత్వ ఐటీఐల్లో 35 ట్రేడ్లలో 15,860 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ (డీజీటీ) ప్రమాణాల ప్రకారం శిక్షణ పూర్తిచేసిన వారికి జాతీయ స్థాయి ఎన్‌సీవీటీ సర్టిఫికేషన్ లభిస్తోందని, దీంతో ప్రభుత్వ, ప్రైవేట్, కేంద్ర సంస్థలతో పాటు విదేశాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం కలుగుతోందన్నారు.
ష్నైడర్, సీమెన్స్, ఇండో-జర్మన్ గ్రీన్ స్కిల్స్ ప్రోగ్రామ్, ఎడ్యునెట్ ఫౌండేషన్, నిర్మాణ్ ఫౌండేషన్ వంటి సంస్థలతో భాగస్వామ్యం ద్వారా శిక్షకులకు శిక్షణ, ఆన్-ది-జాబ్ ట్రైనింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ నైపుణ్యాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శిక్షణ అందిస్తున్నామని మంత్రి తెలిపారు. టాటా టెక్నాలజీస్ సామాజిక బాధ్యతలో భాగంగా భారీగా పెట్టుబడులు పెట్టి ఆధునిక ల్యాబ్‌లు, యంత్రాలు, ఫ్యాకల్టీని అందించడం అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు.
ఈ చర్యల ఫలితంగా హైదరాబాద్, ఉట్నూర్, వరంగల్, నిజామాబాద్, హుస్నాబాద్ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన ఏడు జాబ్‌మేళాల్లో 116 పరిశ్రమలు పాల్గొనగా, 2,572 మంది యువత ఇంటర్వ్యూలకు హాజరై 1,775 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని మంత్రి తెలిపారు. ఇందులో 1,216 మంది ఏటీసీ విద్యార్థులు, 559 మంది ఐటీఐ విద్యార్థులు ఉన్నారన్నారు. ఎంపికైన వారికి సగటున రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు నెలవారీ వేతనంతో ఉద్యోగాలు లభించాయని తెలిపారు.
విదేశీ ఉద్యోగ అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం జర్మన్, జపనీస్‌తో పాటు ఇతర విదేశీ భాషల్లో శిక్షణ అందించేందుకు ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (EFLU)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. జర్మనీలో ప్రతి సంవత్సరం లక్షలాది మంది నైపుణ్యం కలిగిన ఉద్యోగుల అవసరం ఉందని, భాషా నైపుణ్యాలు నేర్చుకుంటే తెలంగాణ యువతకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నత వేతనాలతో ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని మంత్రి తెలిపారు. ఇటీవల జర్మనీ పర్యటనలో అక్కడి ప్రభుత్వ ప్రతినిధులు తెలంగాణలోని స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలను ప్రత్యేకంగా ప్రశంసించారని వెల్లడించారు.
విద్యార్థులు శిక్షణను మధ్యలో విడిచిపెట్టకుండా పట్టుదలతో పూర్తిచేయాలని మంత్రి సూచించారు. ప్రభుత్వం ఐటీఐ, ఏటీసీ విద్యార్థులకు నెలకు రూ.2,000 స్టైపెండ్ అందించనుందని, స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలకు నిధుల కొరత రానివ్వబోమని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రస్థాయి స్కిల్ కాంపిటీషన్లు నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరిస్తామని ప్రకటించారు. శిక్షణ పూర్తిచేసిన విద్యార్థులు అలుమ్నీ నెట్‌వర్క్ ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాల సమాచారాన్ని పరస్పరం పంచుకోవాలని సూచించారు.
గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆధునిక నైపుణ్య శిక్షణను విస్తరించేందుకు 54 కొత్త అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్ల ఏర్పాటుకు ఇప్పటికే 281.39 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించామని మంత్రి తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరంలో 50 వేల మంది యువతకు శిక్షణ అందించడమే లక్ష్యమని చెప్పారు. అలాగే జూలై 26 నుంచి ఆగస్టు 30 వరకు రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో మరో విడత భారీ జాబ్‌మేళాలు నిర్వహించి 10 వేల మందికి పైగా యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ యువత నైపుణ్యాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లి, శిక్షణ నుంచి ఉద్యోగం వరకు సమగ్ర వ్యవస్థను నిర్మించడం ద్వారా రాష్ట్రాన్ని దేశంలోనే స్కిల్ డెవలప్‌మెంట్‌లో నంబర్-1 రాష్ట్రంగా నిలబెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పారు.
