- కులవృత్తులను ఎక్కువగా ప్రోత్సహించాలి
- ప్రభుత్వం కుల వృత్తులకు ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తుంది
- రాష్ట్ర రవాణా , బి.సి. సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్ వెలుతురు జూలై 16:
గురువారం ఆషాఢ బోనాల సందర్భంగా నెక్లెస్ రోడ్డులోని హెచ్‌ఎండీఏ మైదానంలో “బోనాలు – చేతివృత్తుల మేళాను-2026 ను ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య, శాసన సభ్యులు మక్కన్ సింగ్ ఠాగూర్, ఈర్ల పల్లి శంకర్, కార్పొరేషన్ల చైర్మన్లు, సెక్రెటరీ బాల మాయ దేవి తో కలసి బి.సి. సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆలోచనలకు అనుగుణంగా కులవృత్తులను ప్రోత్సహించడం, బీసీ వర్గాలకు చెందిన కళాకారులకు తమ ఉత్పత్తులను విక్రయించుకునే అవకాశాలు కల్పించడం లక్ష్యంగా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
జూలై 16 నుంచి 26 వరకు పది రోజులపాటు నిర్వహిస్తున్న ఈ మేళాలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బీసీ చేతివృత్తుల కళాకారులకు తమ ఉత్పత్తులను నేరుగా విక్రయించుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. బోనాల పండుగకు అవసరమైన బోనం కుండలతో పాటు సంప్రదాయ ఆచారాలకు ఉపయోగించే వివిధ రకాల వస్తువులను ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానంలో అంతర్భాగమైన అనేక కులవృత్తులు కనుమరుగు అవ్వకుండా మరింతగా ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ఈ కులవృత్తులు రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడమే కాకుండా పర్యావరణహితమైన, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని కూడా ప్రోత్సహిస్తాయని అన్నారు. సంప్రదాయ ఉత్పత్తులను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు భావితరాలకు కులవృత్తుల ప్రాధాన్యతను తెలియజేస్తూ కుల వృత్తుల కళాకారుల జీవనోపాధిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ప్రజలందరూ ఈ ప్రదర్శనలను సందర్శించి బీసీ కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేసి ప్రోత్సహించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఇలా చేయడం ద్వారా సంప్రదాయ కులవృత్తులను ఆదరించడమే కాకుండా వేలాది మంది కళాకారుల జీవనోపాధికి తోడ్పాటు అందించినవారవుతారని అన్నారు. ప్రదర్శన ప్రారంభానంతరం మంత్రి ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి వృత్తి కళాకారులతో ముచ్చటించారు.
ఈ ప్రదర్శనలో టెర్రకోట ఉత్పత్తులు, మట్టి పాత్రలు, జనపనార ఉత్పత్తులు, గద్వాల్ చీరలు, పోచంపల్లి ఇకత్ చేనేత వస్త్రాలు, నిర్మల్ బొమ్మలు, నిర్మల్ చిత్రకళా ఉత్పత్తులు, వెండి ఫిలిగ్రీ కళాఖండాలు, వరాహి హస్తకళ ఉత్పత్తులు, వరంగల్ దుర్రీలు, నారాయణపేట చేనేత వస్త్రాలు, పెంబర్తి ఇత్తడి కళాఖండాలు, సెర్ప్, మెప్మా ఆధ్వర్యంలోని సేంద్రీయ ఆహార ఉత్పత్తులు, రానున్న వినాయక చవితి సందర్భంగా పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాలు, పూసల కళాఖండాలు, సంప్రదాయ మందులు, విశ్వకర్మ కళాకారుల ఉత్పత్తులు, ప్రభుత్వ విజయ డెయిరీ ఉత్పత్తులు ప్రదర్శనలో అందుబాటులో ఉన్నాయి.
ఈ ప్రదర్శనలో పాల్గొన్న కళాకారుల నైపుణ్యాన్ని మంత్రి అభినందిస్తూ, తమ సంప్రదాయ కళలు, కులవృత్తులను భావితరాలకు అందించే దిశగా వారు నిరంతరం కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సి. ఈ ఓ ఎబిసి కార్పొరేషన్ అలోక్ కుమార్, సెక్రెటరీ బి.సి రెసిడెన్సీ యల్ సైదులు, ఎం.డి బి.సి. కార్పొరేషన్ మల్లయ్య బట్టు, బి.సి. స్టడీ సర్కిల్ హరికృష్ణ, వివిధ బీసీ కుల కార్పొరేషన్ల చైర్మన్లు, పలు సంఘాలు, అధికారులు, కళాకారులు పాల్గొన్నారు.







