- 15 ఏండ్ల తర్వాత ఈఎస్ఐలో భారీ నియామకాలు
- 247 మంది స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందజేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి
- త్వరలో వైద్యులు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు సహా మరో 300కుపైగా పోస్టుల భర్తీ
హైదరాబాద్, వెలుతురు జూలై 17:
రాష్ట్రంలో కార్మికులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో దాదాపు 15 ఏండ్ల తర్వాత తెలంగాణ ఈఎస్ఐలో భారీ స్థాయిలో స్టాఫ్ నర్సుల నియామకాలు చేపట్టామని రాష్ట్ర శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీస్), గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి తెలిపారు.
హైదరాబాద్ బంజారాహిల్స్‌లో కొమరం భీమ్ ఆదివాసీ భవన్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) ద్వారా ఎంపికైన 247 మంది స్టాఫ్ నర్సులకు ఉద్యోగ నియామక పత్రాలను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి మంత్రి డా. వివేక్ వెంకటస్వామి అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ, 2011 తర్వాత ఈఎస్ఐ శాఖలో ఇదే తొలి భారీ ప్రత్యక్ష నియామక ప్రక్రియ అని పేర్కొన్నారు. కార్మికులు, వారి కుటుంబాలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో నర్సింగ్ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తారని, అందుకే సిబ్బంది కొరతను పూర్తిగా తొలగించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు.
ప్రస్తుతం ఈఎస్ఐ సేవలు రాష్ట్రంలోని సుమారు 20 లక్షల మంది బీమా పొందిన కార్మికులకు, వారి కుటుంబ సభ్యులతో కలిపి దాదాపు 75 లక్షల మంది లబ్ధిదారులకు అందుతున్నాయని మంత్రి తెలిపారు. ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలంటే వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, మందులు, ఆధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉండాలని అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో ఈఎస్ఐ వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందని పేర్కొన్న మంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సహకారంతో ఈఎస్ఐ ఆస్పత్రులపై సమగ్ర సమీక్ష నిర్వహించామని తెలిపారు. సుమారు రూ.72 కోట్ల బకాయిలను విడుదల చేసి మందుల కొరతను నివారించడంతో పాటు, నిర్వహణ, సేవల మెరుగుదలకు అదనపు నిధులు కూడా కేటాయించామని చెప్పారు.
రాష్ట్రంలోని అన్ని ఈఎస్ఐ ఆస్పత్రులను ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ఇటీవల కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో కూడా ఈ అంశాలపై చర్చించినట్లు తెలిపారు.
సనత్‌నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిపై ఉన్న భారాన్ని తగ్గించేందుకు రామచంద్రాపురం ఈఎస్ఐ ఆస్పత్రిలో డయాలసిస్ యూనిట్, కార్డియాక్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసి ప్రత్యేక వైద్య సేవలను విస్తరిస్తున్నామని తెలిపారు. అలాగే నాచారం ఈఎస్ఐ ఆస్పత్రిలో డయాలసిస్ సేవలను బలోపేతం చేసి కార్డియాక్ సేవలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. దీంతో కార్మికులకు తమ ప్రాంతానికే మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.
రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి అనుగుణంగా రామగుండం, శంషాబాద్, మహబూబ్‌నగర్, కొత్తగూడెం ప్రాంతాల్లో కొత్త ఈఎస్ఐ ఆస్పత్రుల ఏర్పాటుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. 12 నుంచి 18 నెలల్లో రాష్ట్రంలోని అన్ని ఈఎస్ఐ ఆస్పత్రులను దశలవారీగా ఆధునికీకరిస్తామని మంత్రి తెలిపారు.
ఈఎస్ఐ శాఖలో మొత్తం 599 పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించినట్లు మంత్రి వెల్లడించారు. అందులో భాగంగానే ఈరోజు 247 మంది స్టాఫ్ నర్సులను నియమించామని, త్వరలోనే 120 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, 6 మంది డెంటల్ సర్జన్లు, 99 మంది ఫార్మసిస్టులు, 34 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, 54 మంది ఏఎన్‌ఎంలు సహా ఇతర పారామెడికల్ సిబ్బంది నియామకాలు కూడా పూర్తి చేస్తామని తెలిపారు. ఈఎస్ఐ సేవల్లో ఎక్కడా సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
నాచారం ఈఎస్ఐలో నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో నర్సింగ్ విద్యను మరింత బలోపేతం చేయడమే ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశమని చెప్పారు.
కొత్తగా నియామకమైన నర్సులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ, ఉద్యోగాన్ని కేవలం ఉపాధిగా కాకుండా సేవా ధర్మంగా భావించి పని చేయాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా నర్సింగ్ సిబ్బందికి భారీ డిమాండ్ ఉందని, ముఖ్యంగా జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం టామ్‌కామ్ ద్వారా విదేశీ భాషల్లో శిక్షణ అందించి అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని వివరించారు .

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ 15 ఏండ్ల తర్వాత ఒకేసారి 247 మంది స్టాఫ్ నర్సులను నియమించడం రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గత పదేళ్లలో ఈఎస్ఐ శాఖ ద్వారా కార్మికులకు అందాల్సిన సేవలు అందలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల సంక్షేమాన్ని అత్యున్నత ప్రాధాన్యంగా తీసుకుని ఈఎస్ఐ ఆస్పత్రుల బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి ఈఎస్ఐ ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత, మౌలిక వసతుల లోపాలు, అవసరమైన సంస్కరణలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. వాటిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి దశలవారీగా అన్ని ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించిందన్నారు.
శుక్రవారం రోజున 247 మంది స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందించడం ఆ ప్రక్రియలో తొలి ముఖ్యమైన అడుగని పేర్కొన్నారు. త్వరలోనే వైద్యులు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఏఎన్‌ఎంలు తదితర పోస్టుల భర్తీ కూడా పూర్తి చేసి ఈఎస్ఐ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. బీఆర్ఎస్ పాలనలో పదేండ్లు కార్మిక శాఖను, కార్మికులను పట్టించుకోలేదని అన్నారు. వివేక్ వెంటస్వామి మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కార్మికుల కోసమే కష్టపడుతున్నారని అన్నారు. కార్మికుల ఇబ్బందులు గుర్తించి, పట్టుపట్టి వేతన సవరణ అమలు చేయించారని తెలిపారు. తద్వారా కోట్లాది మంది కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపారని భట్టి విక్రమార్క చెప్పారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఏనాడు కార్మికుల గురించి , వేతన సవరణ గురించి పట్టించుకోలేదని అన్నారు.
ఈ కార్యక్రమంలో శక్తి శాఖ కార్యదర్శి దాసరి హరిచందన, ఐఏఎస్ , కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ గంగాధర్ , ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ క్రాంతి సాగర్ తో పాటు ఈఎస్ఐ, కార్మిక శాఖకు చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు.


