స్టీల్ బ్యాంక్‌తో పర్యావరణ విప్లవం

  • ఒక సంకల్పం… ఒక సేవా యజ్ఞం… ప్లాస్టిక్ రహిత హుస్నాబాద్‌ స్టీల్ బ్యాంక్ ఏడాది విజయగాథ
  • 276 మహిళా సంఘాల ద్వారా స్టీల్ బ్యాంక్‌తో పర్యావరణ విప్లవం
  • ప్లాస్టిక్‌కు శాశ్వత ప్రత్యామ్నాయం గ్రామాల నుంచి హోటళ్ల వరకు విజయవంతంగా సాగుతున్న స్టీల్ బ్యాంక్ ఉద్యమం
  • ప్రజల భాగస్వామ్యంతో పచ్చని హుస్నాబాద్ దిశగా అడుగులు పడుతున్న స్టీల్ బ్యాంక్ కార్యక్రమానికి ఏడాది పూర్తి 

హుస్నాబాద్, వెలుతురు జూలై 17:

పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యం, ప్లాస్టిక్ రహిత గ్రామాలు అనే మూడు ప్రధాన లక్ష్యాలతో ప్రారంభించిన “స్టీల్ బ్యాంక్” కార్యక్రమం విజయవంతంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్లాస్టిక్ రహిత హుస్నాబాద్ లక్ష్యంతో ప్రారంభమైన ఈ వినూత్న కార్యక్రమం నేడు ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకోవడం ఆనందదాయకమని మంత్రి పేర్కొన్నారు.

తన తండ్రి స్వర్గీయ  పొన్నం సత్తయ్య గారి సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ ఆయన జ్ఞాపకార్థం పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో స్వంత నిధులతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు మంత్రి తెలిపారు.  తెలంగాణ గవర్నర్  జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా గత సంవత్సరం జూలై 17 ప్రారంభమైన ఈ కార్యక్రమం నేడు గ్రామాల్లో పర్యావరణ చైతన్యానికి ప్రతీకగా నిలిచిందన్నారు.

ప్లాస్టిక్ వినియోగాన్ని కేవలం నిషేధించడం కాకుండా, దానికి శాశ్వత ప్రత్యామ్నాయాన్ని అందించాలనే ఆలోచనతో గ్రామ మహిళా సంఘాల ద్వారా స్టీల్ బ్యాంకులను ఏర్పాటు చేశామని మంత్రి వివరించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని 276 గ్రామ మహిళా సమైక్య సంఘాలకు మొత్తం 276 స్టీల్ బ్యాంక్ సెట్లను పూర్తిగా ఉచితంగా అందించామని తెలిపారు. ఒక్కో సెట్‌లో 13 రకాల స్టీల్ పాత్రలు ఉండేలా, 300, 400, 500 పాత్రల సామర్థ్యంతో గ్రామాల అవసరాలకు అనుగుణంగా పంపిణీ చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా 7,376 స్వయం సహాయక సంఘాలకు చెందిన 80,633 మంది మహిళా సభ్యులు ప్రత్యక్షంగా లబ్ధి పొందుతున్నారని తెలిపారు. ఈ మహత్తర కార్యక్రమం కోసం రూ.2.54 కోట్లకు పైగా స్వంత నిధులను వెచ్చించడం సేవా దృక్పథానికి నిదర్శనమన్నారు.

గ్రామాల్లో జరిగే వివాహాలు, శుభకార్యాలు, అన్నదానాలు, గ్రామసభలు వంటి కార్యక్రమాల్లో ప్లాస్టిక్ పాత్రలకు బదులుగా స్టీల్ పాత్రల వినియోగం విస్తృతంగా పెరిగిందని మంత్రి తెలిపారు. దీంతో ప్లాస్టిక్ వ్యర్థాలు గణనీయంగా తగ్గి గ్రామాలు మరింత పరిశుభ్రంగా మారాయని పేర్కొన్నారు. గ్రామాలతో పాటు వాణిజ్య సంస్థల్లో కూడా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని 319 హోటళ్లకు 33,900 స్టీల్ గ్లాసులను పూర్తిగా ఉచితంగా పంపిణీ చేసి, ఒక్కసారి ఉపయోగించే ప్లాస్టిక్ గ్లాసులకు శాశ్వత ప్రత్యామ్నాయం కల్పించినట్లు వివరించారు.

మహిళా సంఘాలు స్టీల్ బ్యాంకులను సమర్థవంతంగా నిర్వహిస్తూ పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయని మంత్రి ప్రశంసించారు. ప్రజల్లో బాధ్యత పెరగడంతో పాటు ప్లాస్టిక్ వినియోగం తగ్గి, పరిశుభ్రమైన జీవన విధానం అలవాటవుతోందన్నారు. ప్లాస్టిక్ నిర్మూలనతో పాటు నియోజకవర్గంలో విస్తృతంగా మొక్కలు నాటడం, చెరువుల అభివృద్ధి, ప్రజా ప్రదేశాల సుందరీకరణ కార్యక్రమాలను చేపట్టామని మంత్రి తెలిపారు.

యెల్లమ్మ చెరువు, పల్లె చెరువు, కొత్త చెరువు పరిసరాల అభివృద్ధి, త్రిశూలం జంక్షన్, గాంధీ విగ్రహం పరిసరాల సుందరీకరణ, “I Love Husnabad” ప్రదేశం, యోగా లోగోలతో కూడిన డివైడర్లు, ఎల్కతుర్తి చౌరస్తా వంటి ప్రాంతాలు పరిశుభ్రత, పచ్చదనానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.

అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు నిర్మించడం మాత్రమే కాదని, సమాజంలో శాశ్వత మార్పు తీసుకువచ్చే ఆలోచనలే నిజమైన అభివృద్ధి అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ప్లాస్టిక్ రహిత హుస్నాబాద్ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ, భావితరాలకు పరిశుభ్రమైన, పచ్చని, ఆరోగ్యకరమైన నియోజకవర్గాన్ని అందించేందుకు కృషి కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

“ప్లాస్టిక్ రహిత గ్రామాల నుంచి – ప్లాస్టిక్ రహిత హోటళ్ల వరకు, అక్కడి నుంచి ప్లాస్టిక్ రహిత తెలంగాణ వైపు కొనసాగే ప్రజా ఉద్యమమే స్టీల్ బ్యాంక్ కార్యక్రమం” అని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్  ఆధ్వర్యంలో  పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్టు ద్వారా ప్రారంభించిన స్టీల్ బ్యాంక్ కార్యక్రమం గ్రామాల్లో గొప్ప మార్పును తీసుకొచ్చిందని మహిళా సంఘాల ప్రతినిధులు తెలిపారు. గ్రామాల్లో జరిగే పెళ్లిళ్లు, శుభకార్యాలు, అన్నదానాలు, గ్రామ సభలు వంటి కార్యక్రమాల్లో ఒకప్పుడు పెద్దఎత్తున ప్లాస్టిక్ పాత్రలు వినియోగించేవారని, ప్రస్తుతం స్టీల్ బ్యాంక్ ద్వారా అందుబాటులో ఉన్న స్టీల్ పాత్రలనే ఎక్కువగా ఉపయోగిస్తున్నామని తెలిపారు. దీంతో ప్లాస్టిక్ వ్యర్థాలు గణనీయంగా తగ్గి గ్రామాలు పరిశుభ్రంగా మారాయని చెప్పారు.

ప్లాస్టిక్ రహిత గ్రామాల అభివృద్ధి పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించామని పేర్కొన్నారు. స్టీల్ బ్యాంక్ నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించడం తమపై ఉంచిన నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు. గ్రామ ప్రజలకు అవసరమైనప్పుడు పాత్రలను అందిస్తూ, వాటిని భద్రపరుస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని మహిళా సంఘాల నాయకులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.