తెలంగాణ ఉద్యమానికి కళను ఆయుధంగా మలిచిన అంకిరెడ్డికి ఘన నివాళి

  • 10వ సంస్మరణ సభలో అంకిరెడ్డి స్మృతిలో ‘ఉప్పెనంటి’ పాట ఆవిష్కరణ
  • మామిడి హరికృష్ణ మాటలతో, విమలక్క పాటతో భావోద్వేగ నివాళి

తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ఆజాద్ ఫోర్స్ సభ్యుడు గోపికృష్ణ 10వ సంస్మరణ సభ హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఘనంగా జరిగింది. ఆయ‌న ఉద్య‌మ స‌హ‌చ‌రులు, ప్ర‌జా క‌ళాకారులు, ర‌చ‌యిత‌లు, సాంస్కృతిక కార్య‌క‌ర్త‌లు, కుటుంబ స‌భ్యులు పెద్ద సంఖ్య‌లో పాల్గొని ఆయ‌న‌కు ఘ‌న నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ముఖ గేయ ర‌చ‌యిత మిత్ర ర‌చించిన ‘ఉప్పెనంటి’ పాట‌ను బిసి స్టడీ సెంటర్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ విడుద‌ల చేశారు. ఉద్య‌మ చ‌రిత్ర‌, అమ‌రుల త్యాగం, క‌ళాకారుల బాధ్య‌త‌లను ప్ర‌తిబింభించే ఈ గీతం స‌భ‌ళో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది.

తెలంగాణ ఉద్యమకారుడు నవీన్ ఆచారి మాట్లాడుతూ అంకిరెడ్డి గోపికృష్ణను ఒక ఫోటోగ్రాఫర్‌గా మాత్రమే చూస్తే అది ఆయన జీవితానికి చేసే అతిపెద్ద అన్యాయం అవుతంద‌ని చెప్పారు. ఆయన కెమెరా కేవలం చిత్రాలను బంధించలేదని, తెలంగాణ ప్రజల ఆవేదనను, ఆకాంక్షను, పోరాట చరిత్రను, త్యాగాల గాథను కాలానికి సాక్ష్యంగా నిలిపిందని తెలిపారు. కళను అలంకారంగా కాకుండా ఆయుధంగా ఉపయోగించిన అరుదైన సాంస్కృతిక యోధుడు గోపికృష్ణ అని కొనియాడారు. ఒక పోస్టర్ కూడా ఉద్యమానికి నినాదం కావచ్చని, ఒక ఫోటో ప్రజలను ఆలోచింపజేయగలదని, ఒక డిజైన్ సమాజాన్ని కదిలించగలదని తన సృజనతో నిరూపించారని న‌వీన్ తెలిపారు.

విమలక్క మాట్లాడుతూ అంకిరెడ్డి కెమెరాతో చిత్రాల‌ను మాత్ర‌మే బంధించలేదు.. తెలంగాణ ఉద్యమ ఆత్మను బంధించాడు. కళాకారుడు సమాజానికి ఎంత బాధ్యత వహించాలో తన జీవితంతో చూపించిన వ్యక్తని ఆమె కొనియాడారు. ఆయనపై రూపొందించిన ప్ర‌త్యేక గీతాన్ని పాడ‌టం తనకు గౌరవకరమైన బాధ్యతగా భావిస్తున్నానని అన్నారు.  కళాకారుడు తటస్థంగా ఉండకూడదని, ప్రజల పక్షాన నిలబడాలని, తన ప్రతిభను సామాజిక మార్పు కోసం వినియోగించాలని గోపికృష్ణ జీవితం చెబుతోంద‌ని అన్నారు.

మామిడి హరికృష్ణ మాట్లాడుతూ, అంకిరెడ్డి గోపికృష్ణను స్మరించడానికి మాటలకన్నా ఒక గీతమే సరైన నివాళి అని చెప్పారు. ఉద్యమాన్ని ప్రేమించిన మనిషికి ఉద్యమ గీతాన్ని రూపొందించిన ఆయ‌న కుటుంబ స‌భ్యులు, మిత్రులు అంకిరెడ్డికి ఇచ్చే గొప్ప గౌర‌వమ‌ని తెలిపారు. ఈ పాట ఆయ‌న వ్య‌క్తిత్వాన్ని మాత్రేమే కాకుండా.. తెలంగాణ ఉద్య‌మ స్ఫూర్తిని కూడా భావిత‌రాల‌కు చేర‌వేస్తుందని అన్నారు. తెలంగాణ  ఉద్యమంలో పోస్టర్  అనే  మాధ్యమానికి  కొత్త  అర్థాన్ని ఇచ్చిన వ్యక్తి గోపికృష్ణ అని పేర్కొన్నారు. ఒక  పోస్టర్‌లో  వేలాది  మంది భావోద్వేగాలను, ఉద్యమ  ఆకాంక్షల‌ను, సామూహిక గొంతును ప్రతిబింబించే  సృజనాత్మక  శక్తి  ఆయన  సొంతమని  అన్నారు.  పోస్టర్  డిజైన్‌ను కేవలం ప్రచార సాధనంగా కాకుండా ఉద్యమ భాషగా మలిచారని గుర్తుచేశారు. ఫోటోగ్రఫీ, గ్రాఫిక్  డిజైన్,  డిజిటల్ టెక్నాలజీ వంటి  ఆధునిక  సాధనాలను ప్రజా ఉద్యమ అవసరాలకు అనుసంధానం చేసిన తొలితరం  సృజనకారుల్లో అంకిరెడ్డి  గోపికృష్ణ  ఒకరని తెలిపారు. సాంకేతికతను  వ్యక్తిగత  అభివృద్ధికి  కాకుండా  సామాజిక  చైతన్యానికి  ఉపయోగించడం ఆయన ప్రత్యేకత అని అన్నారు.

స‌భ‌కు ముందు ప్రజాగాయని తన హృదయాన్ని తాకే  గళంతో ఈ గీతాన్ని ఆలపించగా సభ మొత్తం భావోద్వేగ వాతావరణంలో మునిగిపోయింది. ఉద్యమానికి  అంకితమైన ఒక కళాకారుడికి  మరో కళాకారుడు గీత రూపంలో  నివాళి అర్పించడం, దానికి ఉద్యమ గళం స్వరం కలవడం సభకు ప్రత్యేకతను తీసుకొచ్చింది.

ఈ కార్య‌క్ర‌మంలో అంకిరెడ్డి త‌ల్లిదండ్రులు, సోద‌రి జ్యోతి, తెలంగాణ ఆజాద్ ఫోర్స్ వ్య‌వ‌స్థాప‌కుడు శ్రీ‌నివాస్ బండారీ, ఖాజా అఫ్రిది, తిరుమ‌న్‌దాస్ న‌రేష్, బీట్స్ బాలు, ర‌మేష్ పోతుల‌, బ‌త్తిని విన‌య్ కుమార్ గౌడ్, శివ‌, నిషాంత్, సాయికృష్ణ‌, చింత‌ల సురేష్, క్రాంతి, రాజుగౌడ్, మ‌ల్లేష్ ప‌ప్పు, ర‌జిత బండారీ, వాణి, యూన‌స్ ఫ‌రాన్ త‌దితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.