- ఘనంగా ముగిసిన షేక్ నఫీస్ చిత్రకళా ప్రదర్శన
- కళకు శారీరక పరిమితులు అడ్డుకావు- బీసీ కమిషన్ సభ్యురాలు బాలలక్ష్మి
- చిత్ర ప్రదర్శనకు విశేష స్పందన.. భారీగా హాజరైన కళాభిమానులు
హైదరాబాద్, వెలుతురు జూన్ 18 :
దివ్యాంగ కళాకారిణి షేక్ నఫీస్ రూపొందించిన విశిష్ట చిత్ర కళ ప్రదర్శన హార్ట్ ఏబుల్డ్ మాదాపూర్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఘనంగా ముగిసింది. కళకు శారీరిక పరిమితులు అడ్డుకాదని సంకల్పం ఉంటే అసాధ్యమేది లేదనే సందేశాన్ని ఈ ప్రదర్శన ద్వారా సమాజానికి షేక్ నఫీస్ చాటి చెప్పారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ కమిషన్ సభ్యురాలు బాలలక్ష్మి, విశిష్ట అతిథిగా కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురష్కార అవార్డు గ్రహిత మెర్సీ మార్గరేట్ హాజరై.. ప్రదర్శనను సందర్శించారు. నఫీజ్ చిత్రాల్లో ప్రతిబింభించిన భావోద్వేగాలు, సామాజిక స్పృహ, కళాత్మక నైపుణ్యాన్ని వారు ప్రత్యేకంగా వారు అభినందించారు.
ఈ సందర్భంగా బీసీ కమిషన్ సభ్యురాలు బాలలక్ష్మి మాట్లాడుతూ దివ్యాంగత అనేది ప్రతిభకు అడ్డంకి కాదని, షేక్ నఫీస్ అద్భుత చిత్రాల ద్వారా మరోసారి నిరూపించారన్నారు. ఆమె సంకల్పం, కృషి కళ పట్ల అంకిత భావం స్పూర్తిదాయకమని, సమాజం ఇలాంటి ప్రతిభావంతులైన దివ్యాంగ కళాకారులను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. నఫీస్ భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ.. చిత్ర కళ ప్రదర్శను ఏర్పాటు చేసిన సారంగి ఫౌండేషన్ వ్యవస్థాకుడు ఖాజా అఫ్రిదిని ఆమె అభినందించారు. ప్రతిభను ప్రోత్సహిస్తూ ఆమె కళ ప్రయాణానికి అండగా నిలిచిన ఖాజా సేవలను కొనియాడారు.
విశిష్ట అతిథి వేణు ఉడుగుల మాట్లాడుతూ షేక్ నఫీస్ చిత్రాలు కేవలం కళాఖండాలు మాత్రమే కాదు, సంకల్పం, ఆత్మవిశ్వాసం, జీవిత పోరాటానికి ప్రతీకాలని అన్నారు. శారీరక వైకల్యం మనిషి ప్రతిభను ఎప్పటికీ అడ్డుకోలేవని నఫీస్ తన సృజనతో నిరూపించారు. ఇలాంటి కళాకారులను సమాజం మరింతగా ప్రోత్సహించి వారి ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
రచయిత్రి మెర్సీ మార్గరేట్ మాట్లాడుతూ షేక్ నఫీస్ చిత్రాలు కేవలం రంగులతో వేసిన బొమ్మలు కావని.. అవి శరీరానికి ఏర్పడిన పరిమితులను మనసు, ఊహాశక్తి ఎలా అధిగమించగలవో చెప్పే సజీవ సాక్ష్యాలని తెలిపారు. మస్క్యులర్ డిస్ట్రోఫీ వంటి క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటూనే కళను తన వ్యక్తీకరణగా, తన స్వేచ్ఛగా మలచుకోవడం నిజంగా అభినందనీయమన్నారు. నఫీస్ తన కళాయాత్రలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాని తెలిపారు. మూడ్రోజుల పాటు భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన కళాభిమానులకు, చిత్రాభిమానులకు నిర్వాహకుడు ఖాజా అఫ్రిది ధన్యవాదాలు తెలిపారు.


