- సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో బీఆర్‌ఎస్ యువ సంగ్రామ సదస్సు
- యువతకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయలేదని ఆరోపణ
- 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్
- ఉద్యోగాల కంటే రాహుల్‌గాంధీ రాజకీయాలపైనే రేవంత్ దృష్టి
- యువ గళాలు గర్జిస్తే కుర్చీలు కూలిపోతాయి
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు
హైదరాబాద్ వెలుతురు జూలై 18:
యువత గళం బలంగా వినిపిస్తే అధికార కుర్చీలు కూడా కూలిపోతాయని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఇప్పటివరకు ఒక లెక్క అయితే.. ఇకపై మరో లెక్క ఉంటుందని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్ యువ సంగ్రామ సదస్సులో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రకటించిన యూత్ డిక్లరేషన్ యువతను మోసం చేసేందుకేనని ఆరోపించిన కేటీఆర్.. ఆ పార్టీకి యువత డెత్ డిక్లరేషన్ ఇవ్వాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వేలాది మంది విద్యార్థుల ప్రాణాలు పోవడానికి కాంగ్రెస్ బాధ్యత వహించాలని ఆరోపించారు. యువతతో రాజకీయాలు చేస్తే ఆ ప్రభావం తరాలపాటు ఉంటుందని వ్యాఖ్యానించారు.
యూత్ డిక్లరేషన్‌లో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించిన కేటీఆర్.. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి బదులుగా అవినీతి, అక్రమాలే పెరిగాయని విమర్శించారు. తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు కనిపించడం లేదని, ‘లూటీ నోటిఫికేషన్లే’ కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా కాంగ్రెస్ నాయకుల రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు నోటిఫికేషన్లతో సహా నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని కేటీఆర్ సవాల్ విసిరారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెబుతున్నారని, ఆయనకు పదవి ఇచ్చింది తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకా, లేక రాహుల్ గాంధీకి రాజకీయ ప్రయోజనం చేకూర్చేందుకా అని ప్రశ్నించారు.
తెలుగు, ఆంగ్ల సంవత్సరాలు మారుతున్నా ఉద్యోగాల వార్షిక ప్రణాళిక మాత్రం మారడం లేదని కేటీఆర్ విమర్శించారు. అసెంబ్లీలో ప్రకటించిన ఉద్యోగాల ప్రణాళిక ఇప్పుడు విలువలేని కాగితంగా మారిందని ఆరోపించారు. యువత తమ హక్కుల కోసం పోరాడేందుకు ముందుకు వచ్చిందని పేర్కొంటూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చకపోతే తీవ్ర రాజకీయ పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
