మహిళా శక్తే తెలంగాణ అభివృద్ధికి చోదకశక్తి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

  • ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ మహిళా పారిశ్రామికవేత్తల సమావేశంలో సీఎం ప్రసంగం
  • శిల్పారామం వద్ద ఫిక్కీ కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు
  • భారత్ ఫ్యూచర్ సిటీలో ఫిక్కీకి మరో ఎకరం భూమి ఇస్తామని హామీ
  • మహిళా సాధికారత కోసం రెండో ఇండస్ట్రియల్ పార్క్ ప్రతిపాదన పరిశీలన
  • ప్రతి మూడు నెలలకోసారి మహిళా పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహిస్తానన్న ముఖ్యమంత్రి

హైదరాబాద్ వెలుతురు జూలై 18:

మహిళా శక్తి దీవెనలే తమ ప్రభుత్వానికి బలమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మహిళల మద్దతుతోనే 2023 డిసెంబరులో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని పేర్కొన్నారు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఎల్‌వో) ఆధ్వర్యంలో మహిళా పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడారు.

మహిళా స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్రంలోని 22 జిల్లా కేంద్రాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలను నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ భవనాలు శిక్షణ, మార్కెటింగ్, వ్యాపార కార్యకలాపాలకు కార్పొరేట్ స్థాయి సౌకర్యాలతో కేంద్రాలుగా మారనున్నాయని చెప్పారు.

హైటెక్ సిటీలో శిల్పారామం సమీపంలో రూ.1,000 కోట్ల విలువైన స్థలాన్ని ఇందిరా మహిళా శక్తి బజార్ కోసం కేటాయించామని తెలిపారు. అక్కడ మహిళా సంఘాల కోసం 150కిపైగా దుకాణాలు విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అదే ప్రాంతంలో ఫిక్కీ ప్రధాన కార్యాలయం నిర్మించుకునేందుకు వెయ్యి గజాల స్థలాన్ని కేటాయిస్తామని ప్రకటించారు. అలాగే భారత్ ఫ్యూచర్ సిటీలో ఫిక్కీకి మరో ఎకరం భూమి ఇస్తామని హామీ ఇచ్చారు.

భారత్ ఫ్యూచర్ సిటీలో అమెజాన్ వంటి దిగ్గజ సంస్థ లక్ష కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టబోతోందని, భవిష్యత్తులో ఫార్చ్యూన్-500 కంపెనీలను అక్కడికి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ లక్ష్య సాధనలో ఫిక్కీతో పాటు మహిళా పారిశ్రామికవేత్తల పాత్ర కీలకమని అన్నారు.

మహిళా పారిశ్రామికవేత్తలను అన్ని విధాలా ప్రోత్సహిస్తామని, ప్రతి మూడు నెలలకోసారి వారితో సమావేశమై సమస్యలు, అవకాశాలపై చర్చిస్తానని సీఎం వెల్లడించారు. ఎఫ్‌ఎల్‌వో ఆధ్వర్యంలోని ఇండస్ట్రియల్ పార్క్ విజయవంతమైన నేపథ్యంలో మరో మహిళా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు.

తెలంగాణలో 67 లక్షల మహిళా స్వయం సహాయక సంఘాలు సరికొత్త విప్లవాన్ని సృష్టిస్తున్నాయని, వీటికి రూ.16 వేల కోట్ల రుణాలు అందించామని తెలిపారు. ప్రస్తుతం మహిళలు పెట్రోల్ బంకులను కూడా నిర్వహిస్తూ కార్పొరేట్ సంస్థలతో పోటీ పడుతున్నారని అన్నారు.

మహాలక్ష్మి పథకం కింద మహిళల ఉచిత బస్సు ప్రయాణాల కోసం ఇప్పటివరకు ఆర్టీసీకి రూ.11 వేల కోట్లు చెల్లించామని చెప్పారు. ఈ పథకం వల్ల మహిళలు ప్రయాణికులే కాకుండా వెయ్యి బస్సులకు యజమానులుగా మారి ఆర్టీసీకి అద్దెకు ఇస్తున్నారని వివరించారు.

ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళా సంఘాల ఆధ్వర్యంలో 1,000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని 27 వేల ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించామని, 27.5 లక్షల మంది విద్యార్థులకు రెండు జతల యూనిఫారాలు కుట్టే పనిని కూడా మహిళా సంఘాలకే అప్పగించినట్లు వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా 8 వేల ఇందిరా స్త్రీ శక్తి భవనాలకు శంకుస్థాపన చేశామని, మహిళా సంఘాల ఉత్పత్తులను అమెజాన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వ్యాపారాల్లో రాణిస్తున్న మహిళా సంఘాలకు ఫిక్కీ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది అవార్డులు అందించే సంప్రదాయం తీసుకురావాలని సూచించారు.

2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని సీఎం తెలిపారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 5 శాతం నుంచి 10 శాతానికి పెంచాలని ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ మహిళలకు ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ముఖ్యమంత్రి, గవర్నర్, న్యాయమూర్తుల వంటి అత్యున్నత పదవులు కల్పించిందని గుర్తుచేశారు. సోనియా గాంధీ ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు త్వరలో అమల్లోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.