నిజామాబాదు జూలై 19 (వెలుతురు):
ఆషాఢ మాసం బోనాల పండుగ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం నిజామాబాద్ నగరంలోని అంబేద్కర్ కాలనీ శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయం, కోటగల్లి శ్రీ కోట మైసమ్మ ఆలయంలను సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు మహేష్ కుమార్ గౌడ్‌కు ఘన స్వాగతం పలికి అమ్మవారి ఆశీర్వచనంతో తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని ప్రార్థించారు. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, ప్రజల ఐక్యతకు ఈ వేడుకలు నిదర్శనమని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మేయర్ ఉమారాణి, డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, కార్పొరేషన్ చైర్మన్లు శేఖర్ గౌడ్, తాహెర్బిన్, కేశ వేణు, కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
