ప్రజాస్వామ్యమా – అరాచకమా …? : మంత్రి పొన్నం ప్రభాకర్

  • నీట్ పేపర్ లీకేజీ పై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి
  • ప్రధాని మోదీ మౌనం వీడాలి..
  • శాంతియుత పార్లమెంట్ మార్చ్ చేస్తున్నవిద్యార్థులపై లాఠీ ఛార్జ్‌ను తీవ్రంగా ఖండిస్తున్న -మంత్రి పొన్నం ప్రభాకర్ 

హైదరాబాద్ వెలుతురు జూలై 20:

ఢిల్లీలో నీట్ (NEET) పేపర్ లీకేజీ వ్యవహారంపై న్యాయం కోరుతూ శాంతియుతంగా పార్లమెంట్ వైపు మార్చ్ నిర్వహించిన విద్యార్థులు, యువజన సంఘాలపై పోలీసులు లాఠీచార్జీ చేయడం అత్యంత దురదృష్టకరం, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు.

విద్యార్థులు తమ భవిష్యత్తుకు సంబంధించిన న్యాయమైన డిమాండ్లతో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే, వారి గొంతును అణిచివేయడానికి బలప్రయోగం చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ప్రశ్నించిన వారిపై లాఠీలు ఎత్తడం కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రతిబింబిస్తోందని విమర్శించారు.

నీట్ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలు, పేపర్ లీకేజీ ఘటనలతో లక్షలాది మంది విద్యార్థులు, వారి కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురయ్యారని అన్నారు.  ఈ వ్యవహారానికి రాజకీయ బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని మంత్రి డిమాండ్ చేశారు.

దేశ యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన ఈ పరిస్థితిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. దేశ యువతకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రధానమంత్రిపై ఉందన్నారు. విద్యార్థులపై నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, లాఠీచార్జీకి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, నీట్ పరీక్షల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని నిర్ధారించేలా కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.