బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బిల్లా రంగా నాయకులు ఆడుతున్నాయి: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

 

హైదరాబాద్ వెలుతురు జూలై 19:

తెలంగాణ రాష్ట్రం ఏ నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఆకాంక్షలతో ఏర్పడిందో, వాటిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రెండూ పూర్తిగా విస్మరించాయని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు, ఈ రెండు పార్టీలు రాజకీయ “బిల్లా రంగా” నాటకాలు ఆడుతున్నాయని ఒకరికి అధికార దాహం, మరొకరికి అవినీతి మోహమని విమర్శించారు.

వేల కోట్ల కాళేశ్వరం అవినీతిపై అధికారంలోకి రాగానే చర్యలు తీసుకుంటామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం, నేడు బీఆర్ఎస్తో కుమ్మక్కైందని ఆరోపించారు. ఒక పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని, మరో పార్టీ అవినీతి సొమ్మును కాపాడుకోవాలని తహతహలాడుతుండగా, రైతులకు మాత్రం సాగునీరు అందకుండా పోతోందన్నారు.

లక్షల కోట్ల అప్పుల భారంతో తెలంగాణ ప్రజల జీవితాలను అంధకారంలోకి నెట్టారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంపై ₹8.2 లక్షల కోట్ల అప్పుల భారం మోపగా, కాంగ్రెస్ సుమారు 30 నెలల్లోనే ₹4 లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు. ఇంత అప్పు చేసినా ఉద్యోగులకు పీఆర్సీ, పీఎఫ్ బకాయిలు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొందన్నారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు కలిసి సింగరేణికి సుమారు ₹59,000 కోట్ల బకాయిలు పెట్టాయని, ఫీజు రీయింబర్స్మెంట్ కు ₹12,000 కోట్ల బకాయిలు చెల్లించకుండా విద్యార్థులు, కళాశాలలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు.

నాడు కాంగ్రెస్ నిర్వహించిన ‘యూత్ డిక్లరేషన్’, నేడు బీఆర్ఎస్ నిర్వహిస్తున్న ‘యువ సంగ్రామం’— రెండూ నిరుద్యోగుల ఓట్ల కోసం ఆడుతున్న రాజకీయ నాటకాలేనని అన్నారు. ఎన్నికల సమయంలో సరూర్‌నగర్ కు ఢిల్లీ నుంచి ప్రియాంకా గాంధీని తీసుకొచ్చి హామీల వర్షం కురిపించిన కాంగ్రెస్ యువతను మోసం చేసిందని, పదేళ్లు నిరుద్యోగులను మోసం చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు అదే సరూర్ నగర్‎లో సభ పెట్టి కాంగ్రెస్‎ను విమర్శించడం హాస్యాస్పదమన్నారు.

నిరుద్యోగుల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు లేదన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగాలు భర్తీ చేయకుండా, పరీక్షలను సక్రమంగా నిర్వహించకుండా, ఒక్కో పరీక్షను మూడుసార్లు నిర్వహించి అభ్యర్ధులను కోర్టుల చుట్టూ తిప్పారని విమర్శించారు.

ప్రతిభను కాపాడాల్సిన TSPSCని బీఆర్ఎస్ పాలనలో పేపర్ లీకులకు కేరాఫ్ అడ్రస్ మార్చారని మండిపడ్డారు. ఒక పరీక్షకు మూడుసార్లు పరీక్ష నిర్వహించి, నిరుద్యోగుల జీవితాలనే అగ్ని పరీక్షగా మార్చారని ఆరోపించారు.

GO 46ను తీసుకొచ్చి ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షలకు సిద్ధమైన గ్రామీణ ప్రాంత యువతకు తీవ్ర అన్యాయం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. ఒకే పరీక్ష నిర్వహించి ప్రాంతాల వారీగా వేర్వేరు కటాఫ్ లు పెట్టి అర్హులైన అభ్యర్ధుల అవకాశాలను దెబ్బతీశారని పేర్కొన్నారు. తాము తెచ్చిన GO 46పైన కోర్టుకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులు, ఇప్పుడు అదే జీవోపై మాట్లాడటం ఓట్ల రాజకీయమేనని విమర్శించారు.

“మోకాళ్లపై హామీల వర్షం-గద్దెనెక్కాక నిరుద్యోగులపై విషం” అన్నట్లుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని అన్నారు. GO 46 రద్దు చేస్తామని, అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగుల ముందు మోకాళ్లపై కూర్చొని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు అదే యువతను ఉద్దేశించి “ఎండ్రిన్ తాగినా ఉద్యోగాలు ఇవ్వను” అనే స్థాయిలో అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు.

నిరుద్యోగులను మోసం చేసింది బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలేనని స్పష్టం చేశారు. యువత పేరుతో ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన ఈ పార్టీలు, ఇప్పుడు నిరుద్యోగులను రోడ్లపైకి తీసుకొచ్చి సభలు నిర్వహిస్తూ, వారి కోసమే పోరాడుతున్నట్లు నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు.

యువత, నిరుద్యోగుల గురించి కేటీఆర్ మాట్లాడితే తెలంగాణ సమాజం నవ్వుకుంటుందని అన్నారు. తెలంగాణ యువత అనుభవిస్తున్న ఆకలి, అప్పులు, అవమానాలు, అన్యాయాలు, అణిచివేతకు పదేళ్ల బీఆర్ఎస్ పాలనే మూల కారణమన్నారు. ఇప్పుడు నిరుద్యోగులకు “పొట్టపొట్ట ఆకలి” ఉందని కేటీఆర్ చెప్పడం దొంగే దొంగ అన్నట్లుగా ఉందన్నారు.

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం గత పన్నెండు సంవత్సరాల్లో రైల్వే, బ్యాంకింగ్, SSC, UPSC, CAPF తదితర విభాగాల్లో 17 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేసిందని తెలిపారు. అలాంటి మోదీ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక స్థాయి కేటీఆర్​కు లేదన్నారు.

ఒకరు “అన్నగా వస్తాను” అంటుంటే, మరొకరు “ఆనాటి రోజులు తీసుకొస్తాను” అంటున్నారని, వాస్తవానికి ఇద్దరూ కలిసి తెలంగాణను ‘అన్నకొండ’లా దోచుకున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు బుద్ధి చెప్పి అధికారానికి దూరం చేసినా, బీఆర్ఎస్ నాయకులు తమ వైఫల్యాలను అంగీకరించకుండా బీజేపీపై విమర్శలు చేస్తున్నారని అన్నారు.

బీజేపీది అవకాశవాదమా, జాతీయవాదమా అని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులు ముందుగా తమ రాజకీయ చరిత్రను పరిశీలించుకోవాలని సూచించారు. ఒకప్పుడు ఉత్తర భారతదేశంలో ఔరంగజేబు, దక్షిణాన ఆదిల్షా తోడు దొంగల్లా వ్యవహరించడంతో వారి మధ్య భారతమాత నలిగిపోయిందని గుర్తుచేశారు. అదే విధంగా నేడు బీఆర్ఎస్, కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాల మధ్య తెలంగాణ ప్రజలు నలిగిపోతున్నారని పేర్కొన్నారు.

ఔరంగజేబు లాంటి అవకాశవాది కేసీఆర్ అయితే, ఆదిల్షా లాంటి అవకాశవాది ఆయన మిత్రుడు రేవంత్ రెడ్డి అని ఘాటుగా వ్యాఖ్యానించారు. నాడు ఔరంగజేబు, ఆదిల్షా వంటి శక్తుల నుంచి భారతదేశాన్ని ఛత్రపతి శివాజీ రక్షించినట్లే, నేడు నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ తెలంగాణ ప్రజలను బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి రక్షిస్తుందని స్పష్టం చేశారు.

రాహుల్ గాంధీ ఇప్పుడు తెలంగాణకు వస్తే అశోక్‌నగర్, దిల్‍సుఖ్‍నగర్ నిరుద్యోగ యువత ఆయనను నిలదీస్తారని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ప్రకటించిన యూత్ డిక్లరేషన్, రెండు లక్షల ఉద్యోగాలపై ఆయన సమాధానం చెప్పాల్సిందేనన్నారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడం, వారిని కేవలం ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోవడం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు వెంటనే మానుకోవాలని హెచ్చరించారు. తెలంగాణ యువత ఇప్పటికే ఎంతో కోల్పోయిందని, ఎన్నికల హామీ ప్రకారం రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని  ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.